29-03-2025 02:30:39 AM
హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): జాతీయ మీడియా సంస్థ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన భారతీయుల జాబితాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రెండో స్థానం దక్కగా.. విదేశాంగ శాఖమంత్రి జైశంకర్ మూడో స్థానంలో నిలిచారు. గతేడాది ఐదో స్థానంలో నిలిచిన జైశంకర్ ఈ యేడు మూడోస్థానం కైవసం చేసుకోవడం విశేషం.
ఇక గతేడాది మూడో స్థానంలో నిలిచిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (సర్‌సంఘ్ సంచాలక్) ఈ సారి నాలుగో ర్యాంకుకు పడిపోయారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఐదో స్థానంలో నిలవగా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరో స్థానంలో నిలిచారు. రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ ఏడో స్థానం, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 8, కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ 9, బిజినెస్ టైకూన్ ముకేశ్ అంబానీ 10వ స్థానంలో నిలిచారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలకూ జాబితాలో చోటు లభించింది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి జాబితాలో 28వ స్థానంలో నిలవగా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు 14 స్థానాన్ని దక్కించుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ జాబితాలో 73వ స్థానంలో నిలవగా, ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదొద్దీన్ ఓవైసీ, ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్‌లకూ జాబితాలో చోటు దక్కింది.
పడిపోయిన ప్రియాంక, కేజ్రీవాల్
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా 62వ స్థానం నుంచి 81వ స్థానానికి పడిపోయారు. ఈ యేడు పార్లమెంట్‌లోకి అడుగుపెట్టి న ప్రియాంక పెద్దగా ప్రభావం చూపడం లేదన్న విషయం నివేదక ద్వారా అర్థమవుతోంది. ఇక ఢిల్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న అరవింద్ కేజ్రీవాల్ ర్యాంక్ దారుణంగా పడిపోయింది. గతేడాది ఆయన 18వ ర్యాంకులో కొనసాగగా, ఈ సారి ఏకంగా 34 స్థానాలు దిగజారి 52వ స్థానానికి పడిపోయారు.
టాప్ టెన్‌లోకి ముకేశ్.. అదానీకి 11
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తొలిసారిగా టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నారు. ఇక అదానీ గ్రూపు సంస్థల ఎండీ గౌతమ్ అదానీ 11వ స్థానంలో నిలిచారు. ఐసీసీ చైర్మన్ జైషా 24వ స్థానం దక్కించుకోగా.. నీతా అంబానీ 26, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే 33, గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ 36వ స్థానంలో నిలిచారు.
ఆనంద్‌కు ఈ జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 48, క్రికెటర్ విరాట్ కోహ్లీ 72, బుమ్రా 83, సెబీ నూతన చైర్మన్ తుహిన్ కాంత పాండే 84, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ 89, తెలుగు యాక్టర్ అల్లు అర్జున్ 92, యోగా గురువు రాందేవ్ బాబా 93, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ 96, బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ 99, బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ 100 ర్యాంకులు దక్కించుకున్నారు.
టాప్ 30లోకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మోస్ట్‌పవర్‌ఫుల్ ఇండియన్స్ జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి టాప్ 30లో చోటు దక్కించుకున్నారు. తన పరిపాలనా నైపుణ్యం.. ముక్కుసూటిగా మాట్లాడే నైజం.. ప్రభావంతమైన రాజకీయంతో రేవంత్‌రెడ్డి అత్యంత శక్తిమంతమైన నాయకునిగా నిలిచారు. గతేడాది జాబితాలో 39 స్థానంలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఏడాది కాలంలోనే 11 స్థానాలు ముందుకు ఎగబాకి 28వ స్థానానికి చేరుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకొచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్యకలాపాలు, దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో పోషిస్తున్న ప్రముఖమైన పాత్రతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఈ గుర్తింపు లభించింది. ఒక ప్రాంతీయ నాయకుడిగానే కాకుండా దేశంలోనే అత్యంత శక్తిమంతమైన, చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా రేవంత్‌రెడ్డి స్థానం సంపాదించుకున్నారు. ప్రాంతీయ అవసరాలను జాతీయ ప్రాధాన్యతలతో సమన్వయం చేయగలిగిన మేధోసంపత్తి, వ్యూహాత్మక దృక్పథం రేవంత్‌రెడ్డిని కీలక నాయకుడిగా నిలిపేలా చేశాయి.
దేశంలో ఎక్కడా లేనివిధంగా అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేయడం, క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్, మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్‌లు, ఆర్టీసీ బస్సులు, ప్రీమియం రిటైల్ స్టోర్ల వంటి వ్యాపార అవకాశాలను కల్పించడం, యువతను నిపుణులుగా తీర్చిదిద్దే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాన్స్‌జెండర్ల నియామకం వంటి అనేక విధానపరమైన వినూత్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజాదరణ పెరగడానికి కారణమయ్యాయని చెప్పొచ్చు.
రాష్ట్రంలోప పారదర్శకమైన పాలన, రాష్ర్ట సమగ్రాభివృద్ధికి కట్టుబడినందునే ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అత్యంత శక్తిమంతుల జాబితా- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గుర్తింపు లభించిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ అన్నారు. ఈ గుర్తింపుతో దేశ, తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతను మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు.