- రేపటి నుంచి నగరంలో బోనాల సందడి
- 7న గోల్కొండలో, 21, 22న లష్కర్, 28న లాల్‌దర్వాజ ఆలయంలో బోనాలు
- రూ.20 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా భావించే బోనాల పండుగ వచ్చేసింది. భాగ్యనగరం బోనమెత్తనుంది. ఆషాఢంలో వచ్చే మొదటి ఆదివారం (జూలై 7) రోజు భాగ్యనగరంలో బోనాల సంబురం ప్రారంభమవుతుంది. నగరంలో సుమారు నెలన్నర రోజుల పాటు జరిగే బోనాల పండుగలో డప్పుల చప్పుళ్లు, పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు, కళా బృందాల నాట్యాలు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. గోల్కొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజ నిర్వహించిన తర్వాత నగరంలోని వాడవాడలో ఉన్న అమ్మవార్లకు ప్రతి ఆది, గురువారాల్లో ప్రజలు బోనాలను సమర్పిస్తారు.
మళ్లీ గోల్కొండ కోటలోనే చివరి రోజు పూజ నిర్వహించడంతో నగరంలో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. హైదరాబాద్‌లో జూలై 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆషాఢ బోనాల ఏర్పాట్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ. 20 కోట్లను విడుదల చేసింది. ఇప్పటికే ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. బోనాల జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో నగరంలో మెట్రో, ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడపాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఉచిత బస్సు సౌకర్యం ఉండటం వల్ల ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని, అందుకు తగ్గట్లుగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు.
1869వ సంవత్సరంలో..
1869వ సంవత్సరంలో జంట నగరాల్లో ప్లేగు వ్యాధి ప్రబలడంతో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దైవాగ్రహానికి గురయ్యామని భావించిన అప్పటి ప్రజలు గ్రామ దేవతలను శాంతిపర్చడానికి, ప్లేగు వ్యాధి నుంచి తమను తాము కాపాడుకోవడానికి చేపట్టిన క్రతువే ఈ బోనాల పండుగ అని చెబుతుంటారు. అలాగే 1675లో గోల్కొండను పాలించిన కుతుబ్ షా (తానీషా) కాలంలో బోనం పండుగ హైదరాబాద్‌లో ప్రారంభమైందని కూడా కొందరు చరిత్రకారులు చెబుతుంటారు. హిందువులు మొదటి పండుగగా భావించే తొలి ఏకాదశి ఆషాఢ మాసంలోనే వస్తుంది. ఈ మాసంలో వర్షాలతో పాటు సంభవించే ప్రకృతి వైపరీత్యాలు రాకుండా చూడాలని అమ్మవార్లను ప్రార్థిస్తారు. తొట్టెల పేరుతో అమ్మవారికి కర్రలు, కాగితాలతో చేసిన అలంకారాలు సమర్పించడం, రంగం పేరిట భవిష్యవాణి చెప్పే ఆచారమూ ఉంటుంది.
ఫలహారం బండ్ల ఊరేగింపు..
బోనాల రోజు కానీ మరుసటి రోజు కానీ భక్తులు తమ ఇళ్లల్లో అమ్మవారికి ఇష్టమైన పదార్థాల్ని సిద్ధం చేస్తారు. వాటిని బండిలో ఉంచి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఫలహారం బండ్లకు ఎడ్లు, గొర్రెలు, ఒంటెల్ని కట్టి నడిపిస్తారు. దీన్నే ఫలహారం బండిగా వ్యవహరిస్తారు. తాము తెచ్చిన పదార్థాల్లోంచి అమ్మవారికి సమర్పించిన అనంతరం మిగిలింది మహాప్రసాదంగా ఆరగిస్తారు.
పోతరాజుల వీరంగం..
బోనాల ఉత్సవాల్లో పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. శరీరమంతా పసుపు రాసుకొని కళ్లకు కాటుక, నుదుట కుంకుమ దిద్దుకోనడంతో పాటు లంగోటి వస్త్రం ధరించి కాళ్లకు గజ్జెలు కట్టుకొని, నోట్లో నిమ్మకాయలు, చేతిలో త్రిశూలం, కొరడాతో డప్పు చప్పుళ్లకు అనుగుణంగా నాట్యం చేస్తారు.
సాక సమర్పణ..
సాక అంటే చెట్టుకొమ్మ అని అర్థం. కొత్త చెంబులో పసుపు నీళ్లు పోసి అందు లో వేపమండను ఉంచి దాన్ని అమ్మవారి ఆలయం ఎదుట పోయడాన్ని సాక అంటారు. వేపాకు ఉంచిన పసుపునీటిని సమర్పిస్తే అమ్మవారు తమను చల్లగా చూస్తుందని మహిళల ప్రగాఢ విశ్వాసం.
ఘటోత్సవం..
ఘటోత్సమంటే కలశంతో ఎదురెళ్లి అమ్మవారికి స్వాగతం పలకడం. దీన్నే పూర్ణకుంభ స్వాగతం అంటారు. బోనాలకు ముందు అమ్మవారిని ఆవాహన చేసి పురవీధుల్లో ఘటాన్ని ఊరేగిస్తారు.
‘గావు’ పట్టడం
రంగం ముగిశాక వస్తున్న పోతురాజులు విలయ తాండవం చేస్తూ ఆలయం చుట్టూ నాట్య విన్యాసాలతో ప్రదర్శనలిస్తారు. ఆ సమయంలో అమ్మవారు వారిని ఆవహిస్తుందని భక్తులు నమ్ముతారు. సొరకాయ, గుమ్మడికాయల్ని పోతురాజులు పళ్లతో ఎత్తిపట్టుకొని తిప్పుతూ బలిస్తారు. పూర్వం జంతువుల్ని బలి ఇచ్చేవారు.
రంగం..
రంగం అంటే భవిష్యవాణి. పూనకం వచ్చిన మహిళలు ఉత్సవాలు ముగిసిన మరుసటి రోజు అమ్మవారి ఆలయం ఎదుట ప్రజలకు భవిష్యవాణి చెబుతారు. వారి నుంచి వచ్చే మాటల్ని స్వయంగా అమ్మవారే చెప్పినట్లుగా విశ్వసిస్తారు.