- వర్షాల కారణంగా అధిక తేమ
- కొనేది లేదంటున్న నిర్వాహకులు
- రంగంలోకి ప్రైవేటు వ్యాపారులు
- రైతులను దోచుకుంటున్న దళారులు
- దిగాలు పడుతున్న కర్షకులు
హైదరాబాద్, నవంబర్ ౨ (విజయక్రాంతి): రాష్ట్రంలో పత్తి, వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే తేమ శాతం పేరుతో రైతులను నిర్వాహకులు ముప్పుతిప్పలు పెడుతూ చుక్కలు చూపెడుతున్నారు. నిబంధల సాకుతో వాటిని తూకం వేయబోమని తేల్చి చెబుతున్నారు.
దీంతో రోజుల తరబడి కేంద్రాల్లో పత్తి, ధాన్యం నిల్వ ఉంచే పరిస్థితి వచ్చింది. కేంద్రాల్లో కాపలా ఉండలేక, అప్పుల బాధలు పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులను రైతులు ఆశ్రయించే దుస్థితి వచ్చింది. ఇదే అదనుగా భావించి వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరలకే కొనుగోలు చేస్తున్నారు.
ఇదే పత్తి, వరి ధాన్యాన్ని అదే కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు దర్జాగా అమ్మకాలు చేస్తున్నారు. అధికారులు, వ్యాపారులతో కుమ్మక్కై రైతుల తీసుకొచ్చే సరుకుకు కొర్రీలు పెడితే వ్యాపారులకు అమ్మకాలు చేస్తారనే కుట్రతో ఈవిధంగా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీనికి తోడు వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం తడిసి రంగు మారడం, పైకప్పు వేసేందుకు ఎలాంటివి లేకపోవడంతో తక్కువ ధరకే అమ్మకాలు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు.
లంచాలు ఇస్తే..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం పత్తిలో తేమ 8 నుంచి 12 శాతం వరకు ఉండాలి. కానీ 15 నుంచి 18 శాతం వరకు వస్తుంది. ఇంత వస్తే తాము తీసుకోలేమని కేంద్రాల నిర్వాహకులు వాపస్ పంపిస్తున్నారు. వరి ధాన్యం కూడా 17 శాతం తేమ ఉండాలి. వాతావరణం మార్పులతో 19 నుంచి 21 శాతం వరకు వస్తుంది.
దీంతో మిల్లర్లు తీసుకోవడం లేదని, వారు కూడా తేమ శాతం ఉన్నదానికంటే తగ్గించి 14 శాతం చేయాలని, లేకుంటే తాము సీఎంఆర్ చేయబోమని హెచ్చరిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఒకవైపు అధికారులు వ్యాపారులతో మిలాఖత్ కావడం, మిల్లర్ల కొత్త డిమాండ్లతో రైతులు ఆరుగాలలు పండించిన మధ్యవర్తుల జేబులు నింపుతుందని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
అదే సన్నధాన్యం గుర్తింపు విషయంలో కేంద్రాల వద్ద నిర్వాహకులు అవకతవకలు చేస్తున్నట్లు, వారికి లంచాలు ఇస్తే కొలతలు వేయకుండానే సన్నాలుగా గుర్తించి రూ. 500 బోనస్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపించారు.
రైతుభరోసా ఇవ్వకపోవడంతోనే త్వరగా అమ్మకాలు
ఈ ఏడాది ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోవడంతో అప్పులు చేసి పంటలకు పెట్టుబడి పెట్టామని, వాటికి వడ్డీ పెరగడం, వడ్డీ వ్యాపారులు త్వరగా చెల్లించాలని ఒత్తిడి తేవడంతో తప్పని పరిస్థితిలో ధర తక్కువైనా అమ్ముతున్నట్లు పలువురు రైతులు వాపోతున్నారు.
దీనికి తోడు గత నెలలో కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో అసలు కొనేందుకు కేంద్రాల నిర్వహకులు ముందుకు రావడం లేదని తెలిపారు. వ్యాపారులు నాణ్యతా ప్రమాణాల పేరుతో తమకు నచ్చిన ధరకే అడుగుతున్నారని, ఎవరు కొనుగోలు చేయకుంటే ఇంకా నష్టం వస్తుందనే భయంతో త్వరగా అమ్మేస్తున్నట్లు తెలిపారు.
బీఆర్‌ఎస్ పాలనలో రైతు భరోసా, పంట రుణాలు దొరకడంతో వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లే పరిస్థితి రాలేదన్నారు. కొనుగోలు కేంద్రాలను నెలరోజుల పాటు ఉంచి తేమ శాతం వచ్చిన తరువాతే అమ్మినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతుల గురించి పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నారు.
పంటను కొనుగోలు చేస్తాం..
పత్తి, వరి ధాన్యం అమ్మకాలపై రైతుల పడుతున్న ఇబ్బందులపై పౌరసరఫరాల అధికారులు మాట్లాడుతూ రైతు పండించే ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. ధాన్యం తూకం వేయని కేంద్రాలను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. తేమ శాతం విషయంలో పెద్దగా పట్టించుకోవద్దని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, ఎక్కడైనా ధాన్యం కొనుగోలు నిరాకరించినట్లు తమ దృష్టికి వస్తే ధాన్యం కొనేలా ప్రయత్నాలు చేస్తామన్నారు.
అదే విధంగా పత్తి కొనుగోలు విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు తేమశాతం విషయంలో రైతులను ఇబ్బందులు పెట్టవద్దని కేంద్రాలకు సూచించామని వెల్లడించారు. వాతావరణ మార్పులతో అశించిన విధంగా తేమశాతం రాదని, రైతులు తీసుకొచ్చిన పంటను కొనుగోలు చేయాలని సూచించినట్లు తెలిపారు.
7,139 కొనుగోలు కేంద్రాలు..
రాష్ట్ర ప్రభుత్వం వానకాలం వరిధాన్యం కొనుగోలు చేసేందుకు 7,139 కొనుగోలు కేంద్రాలను దశల వారీగా ఏర్పాటు చేయనుంది. ఖరీఫ్‌లో 60.39 లక్షల ఎకరాలో సాగు చేయగా, 146.28లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసింది. 91.28లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది.
మొదటిసారిగా 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలకు గోడౌన్లను సిద్ధం చేసింది. అదే సన్నవరి 36 లక్షల ఎకరాలో సాగు చేయగా 88 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. క్వింటాల్ వరి గ్రేడ్ రూ. 2,320 ఉండగా, సాధారణ రకం రూ. 2,300గా నిర్ణయించింది. తేమ శాతం సాకు చూపుతూ దళారులు రూ. 1,800లకు విక్రయాలు చేస్తున్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో పత్తి పంట 42.23 లక్షల ఎకరాలో సాగు చేయగా.. 25.33 లక్షల టన్నుల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీనికి తగ్గట్లుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,500 కేంద్రాలు మాత్రమే ప్రారంభించింది. తక్కువ కేంద్రాలు ఉండటంతో రైతులు ఇంటి వద్ద ఉంచలేక అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 7,321 ఉండగా, ప్రైవేటు వ్యాపారులు రూ. 6,700లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.