17-03-2025 04:17:27 PM
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై బీజేపీ కార్పొరేటర్ల ఫైర్..
ఎల్బీ నగర్ లో భగ్గుమన్న ప్రోటోకాల్ వార్..
ఎల్బీనగర్: అసెంబ్లీ జరుగుతున్న సమయంలో నియోజకవర్గంలో ఉన్న సమస్యలను అసెంబ్లీలో చర్చించాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో గొడవలు సృష్టిస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నర్సింహ రెడ్డి, వంగమధుసూదన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటమితో బుద్ధి చెప్పిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బుద్ధి మారలేదు అన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి గెలిచిన కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా ఓడిపోయిన మాజీ కార్పొరేటర్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారని ఆరోపించారు.
మేము సోమవారం ప్రజాసామ్యబద్ధంగా ప్రజలతో కలిసి శంకుస్థాపనలు చేస్తుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు రౌడీల మాదిరిగా వచ్చి దాడులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని భావించిన పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. డివిజన్ ల్లో అభివృద్ధి పనులు చేసేందుకు తాము కష్టపడి నిధులు తెచ్చుకుంటే.. ఎమ్మెల్యే ఇప్పుడు మమ్మల్ని పక్కన పెట్టి శంకుస్థాపనలు చేస్తూ చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే తన తీరు మార్చుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ట్యాక్స్ లు తీసుకోవడం తప్పా అణా పైసా తెచ్చింది లేదన్నారు.