04-03-2025 12:00:00 AM
ప్రముఖ నటి రష్మికపై కర్ణాటకలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ మండిపడ్డారు. . ఆమె తీరుని నిరసిస్తూ తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగుళూరు వేదికగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగనుంది. దీనిలో పాల్గొనేందుకు రష్మిక నిరాకరించిందని.. కెరీర్‌ను ఇచ్చిన ఇండస్ట్రీని రష్మిక గౌరవించాలంటూ రవి హితవు పలికారు.
ఆమెకు సరైన గుణపాఠం చెప్పాలన్నారు. కర్ణాటక రాష్ట్రంలోనే ‘కిరిక్ పార్టీ’ చిత్రంతో కెరీర్‌ను రష్మిక ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. అలాంటి రష్మికను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు రావాలని ఎన్నోసార్లు కోరామన్నారు. తనకు కర్ణాటక వచ్చేంత సమయం లేదని.. తాను రానని తెలిపిందన్నారు. పైగా తన ఇల్లు హైదరాబాద్‌లో ఉందని చెప్పిందని ఎమ్మెల్యే రవి తెలిపారు.
అసలు కర్ణాట క ఎక్కడుందో కూడా తనకు తెలియదన్నట్టుగా మాట్లాడిందన్నారు. తనకు తెలిసిన మరికొంత మంది సైతం సుమారు పది సార్లు ఆమెను కలిసి కార్యక్రమానికి ఆహ్వానించినా సుముఖత వ్యక్తం చేయలేదన్నారు.
కన్నడ చిత్ర పరిశ్రమ, భాష పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్న రష్మికకు సరైన గుణపాఠం చెబుతామన్నారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంపై నటీనటులు పాల్గొనకపోవడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.