ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ కేంద్రంలో అత్యాధునిక హంగులతో వంద పడకలతో కూడిన ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణ స్థలాన్ని సోమవారం ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో కలిసి పరిశీలించారు. బైపాస్ రోడ్డుకు సమీపంలో ఆస్పత్రికి సరిపడ స్థలాన్ని సింగరేణి నుంచి సేకరిస్తున్నారు. స్థలాన్ని త్వరగా అప్పగించాలని కలెక్టర్ సింగరేణి ఇల్లెందు ఏరియా జీఎం వీసం కృష్టయ్యను కోరారు. నూతనంగా నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి రహదారి, భద్రతా, తదితర అంశాలకు అనుగుణంగా అన్నింటిని దృష్టిలో పెట్టుకొని స్థల పరిశీలన జరుగుతుందని అన్నారు.
అంతకు ముందు ఇల్లెందు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యే కోరం కనకయ్యలు పరిశీలించారు. వైద్య సదుపాయం ఎలా ఉందో రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతం కావడంతో నిపుణులైన వైద్యులు వచ్చి పనిచేసేందుకు వెనుకంజ వేస్తున్నారని, వచ్చి పనిచేసే వారిని సక్రమంగా పనిచేయనీయాలని కోరారు. కొందరు అసత్య ప్రచార వార్తలు రాయడంతో కొంత ఇబ్బంది ఏర్పడి ఏజెన్సీ ప్రజలకు వైద్యం అందడంలో ఇబ్బంది ఏర్పడుతుందని, మీడియా కూడా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, డీఎస్‌పి చంద్రబాను, డీసీడీవో డాక్టర్ రవిబాబు, ప్రధాన వైద్యుడు డాక్టర్ హర్షవర్థన్, మాధురి, కాంగ్రెస్ నాయకులు మడుగు సాంబమూర్తి, అంకెపాక నవీన్, ఆజాం తదితరులు పాల్గొన్నారు.