calender_icon.png 15 November, 2024 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజ విభజనే విపక్షాల ధ్యేయం

12-11-2024 12:56:37 AM

దేశ వ్యతిరేకులంటూ ప్రతిపక్షాలపై ప్రధాని ఫైర్

న్యూఢిల్లీ, నవంబర్ 11: కుల ఆధారిత రాజకీయాలు చేస్తూ కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం  సమాజాన్ని విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం, మతం, భాష, నీచ, ఉన్నత, స్త్రీ, పురుషులు, గ్రామం, పట్టణాల ప్రాతిపదికన సమాజాన్ని విభజించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

దేశ వ్యతిరేకులు చేస్తోన్న ఈ కుట్రకు సంబంధించిన తీవ్రతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. రాబోయే సంక్షోభాన్ని అర్థం చేసుకుని అందరం కలిసి కట్టుగా ఆ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి దేశ వ్యతిరేకులకు వ్యతిరేకంగా దేశం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

గుజరాత్ వడ్తాల్‌లోని శ్రీ స్వామినారాయణ ఆలయ 200వ వార్షిక వేడుకల్లో ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. కాగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు జనాభా లెక్కలతోపాటు కుల సర్వే కూడా నిర్వహించాలని పట్టుపడుతున్నాయి. తాజా ఎన్నికల్లోనూ ఆ పార్టీలు కుల గణననే ప్రధాన అస్త్రంగా చేసుకుని బీజేపీపై విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలను జాతీయ శత్రువులుగా అభివర్ణిస్తూ విరుచుకుపడ్డారు.

పెళ్లిళ్లతో లాక్కున్న భూములను స్వాధీనం చేసుకుంటాం

జార్ఖండ్‌లో చొరబాటుదాలను గుర్తించి తరిమేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్రంలో వారు లాక్కున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సెరయికేలాలో జరిగిన సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆదివాసీ జనాభా భారీగా తగ్గుతోంది. మన అమ్మాయిలను పెళ్లి చేసుకుని వలసదారులు భూములను లాక్కుంటున్నారు. ఇలా ఆదివాసీ మహిళలను పెళ్లి చేసుకుని వారి పేరు మీద చొరబాటుదారులు భూమి బదలాయింపు చేసుకోవడాన్ని నిరోధిస్తాం.

ఇందుకోసం జార్ఖండ్‌లో మేం అధికారంలోకి వచ్చాక చట్టాన్ని తీసుకొస్తాం. వారిని గుర్తించేందుకు కమిటీని సైతం ఏర్పాటు చేస్తాం అని అమిత్ షా వెల్లడించారు. జార్ఖండ్‌లో అక్రమ వలసల అంశాన్ని లేవనెత్తినందుకే మాజీ సీఎం చంపయి సోరెన్‌ను అవమానించి, ఒత్తిడి తెచ్చి సీఎం పదవికి రాజీనామా చేయించారని ఆరోపించారు.

అధికార కూటమి లోని జేఎంఎం, కాంగ్రెస్ తమ అభివృద్ధి కోసం పని చేస్తూ రాష్ట్రాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారని తీవ్రంగా స్పందించారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక అవినీతి పరులపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.