బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో శ్రద్ధా కపూర్ది ప్రత్యేక స్థానం. ఏడాదికి రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉంటూ గుర్తింపు తెచ్చుకుందీ భామ. 2024 పింక్ విల్లా స్క్రీన్ అండ్ స్టుల్ ఐకాన్ అవార్డులో ‘మోస్ట్ స్టులిష్ ఫ్యాన్ ఫేవరెట్ సూపర్ స్టార్’ టైటిల్‌ను గెలుచుకుంది. తరుచూ మ్యాగజైన్ కవర్లకు ఫోజులిచ్చే ఈ సొగసరి పలు ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది. ‘సాహో’లో ప్రభాస్ సరసన పోలీస్‌గా కనిపించటం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకూ సుపరిచితురాలైందీ ఈ అమ్మడు. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలతో ఆకట్టుకుంటోంది శ్రద్ధాకపూర్. ఆమె నటించిన తాజా చిత్రం ‘స్త్రీ2’ శుక్రవారం విడుదలైంది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ హార్రర్ కామెడీ సినిమా ప్రమోషన్లలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ ముద్దుగుమ్మ.
‘నేనొక ఫుడీని (భోజనాన్ని ఇష్టపడే వ్యక్తి). ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటా. అయితే, నా చుట్టూ ఎన్ని తిండిపదార్థాలున్నా జిలేబీ, చేపలకూర కనిపిస్తే మాత్రం వాటి వైపునకే నా మనసు మళ్లుతుంటుంది’ అని చెప్తోంది శ్రద్ధ. అలా లెక్కలేసుకోకుండా ఇష్టమైనవి లాగించేస్తూ ఉంటే అందం ఏంగానూ అని ప్రశిస్తే.. ‘దానికి తగ్గట్టుగానే ఫిట్నెస్ మెయింటెన్ చేసేందుకు జిమ్ చేస్తా..’ అని సమాధానమిచ్చింది. తన గురించి ఇంకా చెప్తూ.. ‘పెంపుడు జంతువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాను.. శునకాలంటే మహా సరదా. వాటితో దిగిన ఫొటోలు ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఆనందం పొందుతుంటా. అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌ల నటన అంటే ఇష్టం. పండుగలు, ప్రత్యేక రోజులను కుటుంబంతో సెలబ్రేట్ చేసుకునేందుకే ఇష్టపడతా’ అంటూ ఎంతో హుషారుగా చెప్పింది శ్రద్ధ.