calender_icon.png 11 January, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనసు కొలిమి

15-07-2024 12:00:00 AM

నేనెవరికోసమో ఎదురు చూస్తాను

దేనికోసమో వేచి వుంటాను

నిలబడీ నిలబడీ వూడలు మొలుస్తాయి

ఎదురు చూసీ చూసీ కన్నీళ్లు ఇంకిపోతాయి

నువ్వెప్పుడు వస్తావో తెలీదు

ఎందుకు వెళ్లి పోతావో తెలీదు

వెలుగు కిరణంలా వచ్చి

చీకటిని ఖాళీ చేస్తావు

నా నీడని

నా వెనకే నిలిపి ఉంచుతావు

రెప్పలు తెరిచినట్టుగా వస్తావు

రెప్పలు మూసినట్టుగా వెళ్తావు

సడీ లేదు సప్పుడూ లేదు

నిజానికి

నువ్వు అరుదెంచావా! ఆవిరయ్యావా!

నేనేమయినా కలగన్నానా భ్రమపడ్డానా

అవునూ నిజంగానే నువ్వు రాకూడదూ

చిరుగాలిలా సితారా సంగీతంలా

చిన్నారి నవ్వులా మల్లె పువ్వులా  

నిజం చెప్పు నువ్వెవరివి ఎక్కడుంటావు

నీటిలో బుడగవా మబ్బులో చినుకువా

నాలుగు కాలాలుగా మౌనం పట్టి

నాలుగు దిక్కులా ఊపిరి బిగబట్టి

ఎదురుచూసీ  చూసీ అలసిపోయా

వెతికి వేసారిపోయా

అదేమి చిత్రమో కానీ

ఇంటా బయటా

ఊరంతా దేశమంతా తిరిగా

ఎక్కడా కనిపించని నువ్వు

ఎప్పుడూ వినిపించని నీ నవ్వు

నాలోనే ఎక్కడో ధ్వనిస్తోంది

రూపం లోపలెక్కడో ప్రతిబింబిస్తోంది

ఎప్పటికప్పుడు మనసు కొలిమిలో

నన్ను పుటం బెడుతోంది.

వారాల ఆనంద్

సెల్: 9440501281