గత ఏడాది కాలంగా ప్రపంచ దేశాల భయాలే నిజమయ్యాయి. మధ్యప్రాచ్యం ఇప్పుడు నిప్పుల కొలిమిగా మారింది.తమ భూభాగంపై దాడులకు దిగిన హమాస్‌ను తుదముట్టించేందుకు గత ఏడాది గాజాపై ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడులు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధంగా మారుతోంది. హమాస్, హెజ్‌బొల్లా అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ మంగళవారం రాత్రి క్షిపణుల వర్షం కురిపించింది.
ఇజ్రాయెల్ నగరాలయిన టెల్ అవీవ్, జెరూసలెం లక్ష్యంగా ఈ క్షిపణి దాడి జరిగింది. వీటిలో చాలావాటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకోగలిగినా కొన్ని మాత్రం ఈ నగరాలను తాకాయి. ప్రాణనష్టం వివరాలు తెలియకపోయినప్పటికీ కొద్ది మంది మాత్రం గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రకటించింది.
హెజ్‌బొల్లాపై ప్రతీకారం తీర్చుకునేందుకు లెబనాన్‌లో భూతల దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రకటించిన కొద్ది గంటలకే ఇరాన్ క్షిపణి దాడులు మొదలయ్యాయి. ఇది ఆరంభంమాత్రమేనని, ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడితే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.
అయితే ఇరాన్ దాడులకు ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించడంతో ఈ పోరు మరింత విస్తరించి ప్రాంతీయ యుద్ధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌లోని నిరంకుశ పాలనను అంతం చేసి అక్కడి ప్రజలకు స్వేచ్ఛ కల్పిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ వీడియోలో హెచ్చరించారు.
తమ దేశాన్ని, ప్రజలను రక్షించు కోవడానికి ఎంతదూరమైనా వెళ్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ దాడిని ఖండించని ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ను తమ దేశంలోకి రాకుండా నిషేధిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించడాన్ని చూస్తే ఈ దాడులపై అది ఎంత ఆగ్రహంతో ఉందో అర్థమవుతుంది.
మరోవైపు ఇరాన్ సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖమేనీ సంచలన ఆరోపణలు చేశారు. మధ్యప్రాచ్యంలో అంతర్యుద్ధాలు, యుద్ధాలకు అమెరికా, యూరప్ దేశాలే కారణమని ఆరోపించారు. ఈ ప్రాంతంలో శాంతిస్థాపన పేరిట వస్తున్న వాళ్ల సమక్షంలోనే ఇదంతా జరుగుతోందని, ఆ శత్రుమూకలు ఈ ప్రాంతంనుంచి వైదొలగితే ఈ అంతర్యుద్ధాలు, యుద్ధాలు ఆగిపోతాయన్నారు.
అంతేకాదు, ఇస్లామిక్ రెవల్యూషన్ స్ఫూర్తి, ఇరాన్ ప్రజలు, మిత్రదేశాల సహకారంతో శత్రు సంహారం చేపడతామని ప్రతిజ్ఞ చేశారు. కాగా ఇజ్రాయెల్ తాజా లక్ష్యం ఖమేనీయేనన్న వార్తలు కూడా వస్తున్నాయి. తమ దేశానికి తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఐరోపా దేశాలు తమ ప్రజలను, దౌత్యవేత్తలను లెబనాన్‌నుంచి రప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టాయి.
ఇప్పటికే బ్రిటన్ 5 వేల మందిని ఖాళీ చేయించింది. తాజా పరిణామాలపై భారత్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు మానుకోవాలని అడ్వైజరీ జారీ చేసింది.
మధ్యప్రాచ్యం ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలు ఒకే రోజు మూడు శాతం పెరిగాయి. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాలు పశ్చిమాసియా దేశాలనుంచే చమురును దిగుమతి చేసుకుంటాయి. ముఖ్యంగా మన దేశం దిగుమతి చేసుకునే చమురులో 70 శాతం ఈ దేశాలనుంచే వస్తుంది.
చమురు ధరలు పెరిగితే అది మన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.అలాగే మన దేశంనుంచి ఈ దేశాలకు ఎగుమతులు సైతం భారీగానే జరుగుతాయి. వాటిపైనా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు మన దేశంనుంచి వేలాది మంది గల్ఫ్ దేశాల్లో కార్మికులుగా పని చేస్తున్నారు.
తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో వీరి భద్రతపై ఇక్కడి వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలు కాక తప్పదు.అప్పుడు గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో తలెత్తిన పరిస్థితి పునరావృతమయ్యే ప్రమాదం ఉంది.పశ్చిమాసియాలో మరో యుద్ధం రాకుండా ఆపే శక్తి సౌదీ అరేబియా, టర్కీ, యెమన్ లాంటి అక్కడి దేశాలకు మాత్రమే ఉంది.