calender_icon.png 25 February, 2025 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీటర్లు తిరిగాయ్!

20-02-2025 01:08:01 AM

  1. రాష్ట్రంలో 16,000 మె.వా దాటిన విద్యుత్తు డిమాండ్
  2. బుధవారం ఉదయం 16,058 మె.వా నమోదు

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): వేసవికి ముందే రాష్ట్రం లో విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. గత రికార్డులన్నింటినీ తలదన్నేలా బుధవారం ఉదయం 16,058 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ నమోదవ్వడంతో విద్యుత్తు సంస్థల సీఎండీలతో విద్యుత్తు సరఫరా పరిస్థితిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమీక్షించారు.

కొత్త రికార్డు..

ఇదే నెల 10న 15,998 మెగావాట్లతో రాష్ట్రంలో విద్యుత్తు గరిష్ఠ డిమాండ్ కొత్త రికార్డును సృష్టించగా.. బుధవారం ఆ రికార్డుకూడా తుడిచిపెట్టుకుపోయింది. బుధవారం ఉదయం 7.55 గంటలకు 16,058 మెగావాట్ల డిమాండ్ నమోదయ్యింది. గతేడాది మార్చిలో నమోదైన 15,623 మెగా వాట్ల గరిష్ట డిమాండ్‌ను ఈనెల 5న అధిగమించింది.

ఈ ఏడాది భారీస్థాయిలో నమోదవుతున్న విద్యుత్తు డిమాండ్‌కు అనుగుణంగా ఎలాంటి సమస్యలు లేకుండా డిస్కంలు సరఫరా చేస్తున్నాయని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్) పరిధిలో గరిష్ట డిమాండ్ 10 వేల మెగావాట్లను మించి నమోదవుతున్నది.

ఈనెల 7న 10,130 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదవ్వగా.. బుధవారం 10,049 మెగావాట్లుగా నమోదయ్యింది. విద్యుత్తు వినియోగంకూడా 200 మిలియన్ యూనిట్లుగా నమోదవుతున్నది. బుధ వారం (ఈనెల 18న) 202.18 మి.యూనిట్ల విద్యుత్తు సరఫరా అయ్యింది. గతేడాది సెప్టెంబర్ 20న 9,910 మెగావాట్ల గరిష్ట డిమాండ్ రాగా.. సెప్టెంబర్ 19న 198.80 మి.యూనిట్ల అత్యధిక వినియోగం నమోదయ్యింది.

సాధారణంగా సెప్టెంబర్‌లో నమో దయ్యే గరిష్ట డిమాండ్, వినియోగాలు.. ఈయేడు ఫిబ్రవరిలోనే నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో విద్యుత్తు డిమాండ్ మరింతగా పెరిగే అవకావం ఉందని ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు.

బుధవారం డిస్కం పరిధిలో పరిస్థితిని సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న అదనపు డిమాండ్‌ను తట్టుకునేందుకుగాను నూతన సబ్ స్టేషన్ల, పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల స్థాయి పెంపు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేస్తున్నామన్నారు.