08-03-2025 12:00:00 AM
ఇండియన్ సినిమా లేడీ డైరెక్టర్ల జాబితాలో మరో కొత్త పేరు చేరనుందా..? అంటే, చాలా మంది ఔననే సమాధానమిస్తున్నారు. హీరోయిన్ రాధికా ఆప్టే మెగాఫోన్ పట్టుకొని సినిమాలు తెరకెక్కించేందుకు సిద్ధమవుతోందట! ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ‘కోట్యా’ అనే ఓ యాక్షన్ మూవీతో రాధిక ఆప్టే దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వనుందట. ప్రముఖ నిర్మాణ సంస్థ సినీవీ ఈ విషయాన్ని వెల్లడించింది.
విక్రమ్ ఆదిత్య మోత్వాని ఈ ప్రాజెక్టును నిర్మిస్తారని టాక్. రాధికా ఆప్టే.. ప్యాడ్‌మ్యాన్, అంధాదున్, విక్రమ్ వేద, ఏ కాల్ టు స్పై, కబాలి, లస్ట్ స్టోరీస్ వంటి సినిమాలతో అటు బాలీవుడ్‌లో, ఇటు కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చివరిసారి నటించిన ‘సిస్టర్ మిడ్‌నైట్’ బాప్టా (బ్రిటిష్ సినీ అవార్డ్స్)కు నామినేట్ అయ్యింది. ఈ చిత్రం ఇంతకుముందు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శితమైంది.
ఇక ఈ బ్యూటీ టాలీవుడ్‌కు సుపరిచితురాలే. ‘రక్తచరిత్ర’, ‘లెజెండ్’, ‘లయన్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం హిందీ, తమిళంలోనే సినిమాలు చేస్తోంది. నిరుడు ‘మేరీ క్రిస్మస్’, ‘సిస్టర్ మిడ్‌నైట్’ చిత్రాల్లో కనిపించింది. త్వరలో ‘లాస్ట్ డేస్’ సినిమాలో కనిపించనుంది.