28-02-2025 01:26:29 AM
సూర్యాపేట, ఫిబ్రవరి27(విజయక్రాంతి) :సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో మహా శివరాత్రి వేడుకలలో భాగంగా గురువారం తెల్లవారు జామున ఎరకేశ్వరస్వామి దేవాలయం ఎదుట శివ పార్వతుల కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
ముందుగా నామేశ్వరస్వామి దేవాలయం నుండి ఉత్సవ విగ్రహాలను పల్లకిలలో బొడ్రాయి సమీపంలోని ఎరకేశ్వరస్వామి దేవాలయానికి తీసుకువచ్చారు. ఉపవాస దీక్షలు, జాగరణ చేసే భక్తులు భారీగా తరలిరావడంతో దేవాలయం కిక్కిరిసింది. గ్రామ పురోహితులు పులి హరి ప్రసాద శర్మ, ఆలయ వంశపారంపర్యం ప్రధాన అర్చకులు మునగలేటి సంతోష్ శర్మ సంప్రదాయ బద్దంగా కళ్యాణ తంతు నిర్వహించారు.
ఆకట్టుకున్న ఊరేగింపు
మహా శివరాత్రి వేడుకలలో భాగంగా నిర్వహించే శివ పార్వతుల కళ్యాణం మహోత్సవానికి స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి ఎరకేశ్వరస్వామి దేవాలయం ఎదుట నిర్వహించడం ఆనవాయితీ. అదే క్రమంలో నిర్వహించిన ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టకుంది.
నెమిలి పింఛంతో చేసిన టోపీలు, ముందు రెండు పశువుల కొమ్ములు, మధ్యలో ఓ అద్దం, చుట్టూ రంగురంగుల అలంకరణ వస్తువులు, భుజానికి అడవి జంతువుల తోలు, నడుము, కాళ్లకు గజ్జెలు, వేసిన ఆదివాసీ నృత్యాలు ఒకవైపు, మరో వైపు మహిళల కోలాట ప్రదర్శనలతో భక్త జనం పులకరించారు