calender_icon.png 3 October, 2024 | 2:08 AM

రెండో రోజూ మార్కెట్ జోరు

11-09-2024 12:00:00 AM

  1. మరో 362 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌
  2. 25,000 పాయింట్లపైకి నిఫ్టీ
  3. ఐటీ, టెలికం షేర్లలో కొనుగోళ్లు

ముంబై, సెప్టెంబర్ 10: యూఎస్ మార్కెట్లు పటిష్టంగా బౌన్స్‌కావడం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు కొనసాగడంతో భారత్ సూచీలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 362 పాయింట్లు పెరగ్గా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 25,000 పాయింట్ల స్థాయికి ఎగువన ముగిసింది.

ఇంట్రాడేలో 637 పాయింట్ల వరకూ పెరిగిన సెన్సెక్స్ 82,196 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. ముగింపులో కొన్ని హెవీవెయిట్ షేర్లు దిగిరావడంతో చివరకు 362 పాయింట్ల లాభంతో 81,921 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ కీలకమైన 25,000 పాయింట్ల స్థాయిని అధిగమించి 25,130 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. చివరకు 105 పాయింట్లు లాభంతో 25,041 పాయింట్ల వద్ద ముగిసింది. 

ఎన్టీపీసీ టాప్ గెయినర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా ఎన్టీపీసీ 4 శాతం పెరిగి రూ.299 వద్ద ముగిసింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, భారతి ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అదానీ పోర్ట్స్ షేర్లు 3 శాతం వరకూ లాభపడ్డాయి. మరోవైపు బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనీలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు 2 శాతం వరకూ తగ్గాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా టెలికమ్యూనికేషన్ ఇండెక్స్ 2 శాతం పెరిగింది.

యుటిలిటీస్ ఇండెక్స్ 1.76 శాతం, పవర్ ఇండెక్స్ 1.74 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 1.62 శాతం, ఐటీ ఇండెక్స్ 1.52 శాతం, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 1.25 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 1.20 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 1.10 శాతం చొప్పున లాభపడ్డాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు క్షీణించాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచి 1.53 శాతం తగ్గగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.53 శాతం పెరిగింది. బీఎస్‌ఈలో ట్రేడయిన మొత్తం షేర్లలో 2,587 షేర్లు లాభపడగా, 1,352 షేర్లు తగ్గాయి. సోమవారం రాత్రి యూఎస్ స్టాక్ సూచీలు 2 శాతం వరకూ ర్యాలీ జరపగా, మంగళవారం ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్‌లు లాభపడ్డాయి. సియోల్, టోక్యోలు తగ్గాయి. 

సెంటిమెంట్ బలహీనమే

యూఎస్ ద్రవ్యోల్బణం గణాంకాలు, ఫెడ్ పాలసీ వైఖరివైపు ఇన్వెస్టర్లు దృష్టి మరల్చడంతో దేశీయ మార్కెట్ కొంత రికవరీ అయ్యిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల రిస్క్, మాంద్యం భయాల కారణంగా ప్రపంచ మార్కెట్లలో వచ్చే కొద్ది రోజులూ సెంటిమెంట్ బలహీనంగానే ఉంటుందని అంచనా వేశారు. 

ఎఫ్ పీఐల భారీ కొనుగోళ్లు

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు వారి కొనుగోళ్ల జోరును కొనసాగిస్తున్నారు. గత వారంలో బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడి చేసిన ఎఫ్‌పీఐలు ఈ సోమ, మంగళవారాల్లో రూ.2,400 కోట్ల నికర కొనుగోళ్లు జరిపినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.