calender_icon.png 21 October, 2024 | 6:38 AM

ఒడిదుడుకుల బాటలో మార్కెట్

21-10-2024 01:37:07 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 20:  అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, దేశీయంగా కార్పొరేట్ల క్యూ 2 ఫలితా ల ఆధారంగా ఈ వారం మార్కెట్ కదలికలు ఉంటాయని, వీటితో పాటు వ్రిదేశీ ఫండ్స్ ట్రేడింగ్ యాక్టివిటీ కీలకమని విశ్లేషకులు చెపుతున్నారు. అంతర్జాతీ య క్రూడ్ ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను కూడా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమని స్తారని విశ్లేషకులు చెప్పారు. ఈ నేపథ్యంలో మార్కెట్ ఒడిదుడుకులు ఈ వారం కూడా కొనసాగుతాయని వారు అంచనా వేస్తున్నారు.

  ఇజ్రాయిల్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తత లు తీవ్రతరంకావడం, తద్వారా క్రూడ్ ధర లు పెరగడం మార్కెట్‌ను ఒడిదుడుకులకు లోను చేస్తుందని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ చెప్పారు. మరోవైపు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీ విక్రయాలు జరపడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తుందని తెలిపారు. అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులు, దేశీయ రాజకీయ పరిణామాల ఆధారంగా విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ యాక్టివిటీ ఉంటుందని గౌర్ వివరించారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, చైనా ఆర్థిక వ్యవస్థ మందకొడితనం, విదేశీ ఇన్వెస్టర్ల ఎడతెగని అమ్మకాల కారణంగా ట్రేడర్లు ఆచితూచి వ్యవహరిస్తారని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు.

అక్టోబర్ 18తో ముగిసిన వారంలో సెన్సెక్స్ 156 పాయిం ట్లు, నిఫ్టీ 110 పాయింట్ల చొప్పున తగ్గాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు పెరగటం, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలపై ఈ ఉద్రిక్తతల ప్రభావం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రతికూలంగా మారుస్తుందని వివరించారు. ప్రీమియం విలువల్లో ట్రేడ్‌కావడం, క్యూ2 ఫలితాలపై అంచనాలు అంతంత మాత్రంగా నే ఉన్నందున మార్కెట్ ప్రస్తుతం కన్సాలిడేషన్ బాటలో ఉన్నదని జియోజిత్ ఫైనాన్షి యల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వివరించారు.  

క్యూ2 ఫలితాలు

ఇప్పటివరకూ వెలువడిన, రానున్న రోజు ల్లో వెలువడే క్యూ2 ఫలితాల్ని ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించి, కార్పొరేట్ల పనితీరును విశ్లేషించుకుని ఇన్వెస్ట్‌మెంట్  నిర్ణయాలు తీసుకుంటారని విశ్లేషకులు చెప్పారు. గత వారాంతంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రాలు వెల్లడించిన ఫలితాలకు  ఈ సోమవారం తొలు త మార్కెట్ స్పందిస్తుందని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.

దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సెప్టెంబర్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని 6 శాతం పెంచుకోగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాండెలోన్ నికరలాభం 5 శాతం పెరిగింది. టెక్ మహీంద్రా కొన్ని ఆస్తుల్ని విక్రయించడం ద్వారా లాభాన్ని రెండింతలు పెంచుకున్నది. ఈ వారం ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఐటీసీ, హిందుస్థాన్ లీవర్, పెట్రో కంపెనీలు హెచ్‌పీసీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్ తదితర ఇండెక్స్ హెవీవెయిట్లు వాటి ఆర్థిక ఫలితాల్ని వెల్లడిస్తాయని మిశ్రా వివరించారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, బజాజ్ ఫైనాన్స్, ఒన్97కమ్యూనికేషన్స్ (పేటీఎం), జొమాటో, బజాజ్ ఫిన్‌సర్వ్, బ్యాంక్ ఆఫ్ బరోడాల ఫలితాలు కూడా ఈ వారంలోనే వెలువడతాయి. 

ఎఫ్‌పీఐ అమ్మకాలు 80,200 కోట్లు

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) అక్టోబర్ నెలలో ఇప్పటవరకూ రూ. 80,200 కోట్ల మేర నికర విక్రయాలు జరిపారు.  అయితే దేశీయ సంస్థలు ఈ అక్టోబర్ 18 వరకూ రూ. 74,000 కోట్ల మేర నికర పెట్టుబడులు చేయడంతో మార్కెట్ క్షీణత తక్కువగా ఉన్నదని విశ్లేషకులు తెలిపారు. ఇజ్రాయిల్, ఇరాన్‌ల పరస్పర దాడులు, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా పెరగడం, చైనా ఉద్దీపన ప్యాకేజీతో అక్కడి మార్కెట్ ఆకర్షణీయంగా మారడం వంటి అంశాలు ఎఫ్‌పీఐలను అమ్మకాలకు పురికొల్పాయని విశ్లేషకులు తెలిపారు.

వీరు సెప్టెంబర్ నెల మొత్తం భారత్ మార్కెట్లో రూ. 57,724 కోట్లు పెట్టుబడి చేశారు. ఇటీవల యూ ఎస్ ట్రెజరీ ఈల్డ్ పెరగడం కూడా భారత్ మార్కెట్ నుంచి చౌకగా ఉన్న మార్కెట్లలోకి ఎఫ్‌పీఐలు నిధులు తరలించడానికి మరో కారణమని వినోద్ నాయర్ చెప్పారు. చైనా మార్కెట్లలో అర్బిట్రేజ్ అవకాశాల్ని వారు అందిపుచ్చుకుంటున్నారని, సెప్టెంబర్ మధ్య నుంచి ఎఫ్‌ఫీఐలు చైనా షేర్లను భారీగా కొనుగోలు చేస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు.  ఎఫ్‌పీఐలు, డీఐఐల ట్రేడింగ్ సరళి ఇదేరీతిలో సమీప భవిష్యత్తులో కొనసాగుతుందని ఆయన అంచనా వేశారు.

నవంబర్ 1న మూరత్ ట్రేడింగ్

దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్సేంజీల్లో మూరత్ ట్రేడింగ్ సెష న్ 2024 నవంబర్ 1న జరుగుతుం ది. హిందూ క్యాలండర్ సంవత్సరం 2081 ప్రారంభదినమైన నవంబర్ 1 శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటలవరకూ మూరత్ ట్రేడింగ్ జరుగుతుందని నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ), బొంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ)లు ప్రకటించాయి. ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ ప్రి ఒపెనింగ్ సాయంత్రం 5.45 నుంచి 6.00గంటల వరకూ ఉంటుంది.