calender_icon.png 19 October, 2024 | 9:22 AM

మార్కెట్ నిస్తేజం

23-07-2024 12:05:00 AM

  • 102 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్

బడ్జెట్ ముందు ఇన్వెస్టర్ల జాగ్రత్త

ముంబై, జూలై 22: కొద్ది రోజులపాటు వరుస రికార్డులతో అదరగొట్టిన మార్కెట్ బడ్జెట్ ముందు రోజున నిస్తేజంగా ముగిసింది.  సోమవారం ట్రేడింగ్ తొలిదశలో బీఎస్‌ఈ సెన్సెక్స్ తొలుత 80,800 పాయింట్ల వరకూ పెరిగినప్పటికీ, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో  80,100 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది. చివరకు 102 పాయింట్ల నష్టంతో 80,502 పాయింట్ల వద్ద నిలిచింది. గత వారాంతంలో క్యూ1 ఫలితాల్ని వెల్లడించిన 

హెవీవెయిట్ షేరు రిలయన్స్ ఇండస్ట్రీస్ క్షీణించడం సూచీలను దెబ్బతీసాయని ట్రేడర్లు తెలిపారు. ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ట్రేడింగ్ తొలిదశలో 24,592 పాయింట్ల గరిష్ఠాన్ని చేరిన తర్వాత  వెనక్కుమళ్లి 24,362 పాయింట్ల స్థాయికి పతనమయ్యింది. చివరకు 22 పాయింట్ల నష్టంతో 24,509 పాయింట్ల వద్ద నిలిచింది. కేంద్ర బడ్జెట్ మంగళవారం వెల్లడికానున్నందున, ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా కొంతమేర లాభాల స్వీకరణ జరిపారని, మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ బ్యాంక్‌ల ఫలితాలు మార్కెట్‌ను నిరుత్సాహపర్చాయని ట్రేడర్లు వివరించారు. 

అయితే ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల ర్యాలీ ఫలితంగా సూచీల నష్టం పరిమితంగా ఉన్నదన్నారు. ఆర్థిక సర్వేలో వృద్ధి అంచనాల్లో పెద్దగా పెంపులేకపోవడంతో మార్కెట్లో ఒడిదుడుకులు ఏర్పడ్డాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అయితే బడ్జెట్ ఇన్వెస్టర్లకు సానుకూలంగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయని, షేర్ల అధిక విలువల కారణంగా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారన్నారు. 

రిలయన్స్, కోటక్ బ్యాంక్‌లు 3 శాతం డౌన్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు   3 శాతంపైగా క్షీణించి రూ.3,001 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ నికరలాభం జూన్ త్రైమాసికంలో 5 శాతం తగ్గిన సంగతి తెలిసిందే. కోటక్ బ్యాంక్ ఫలితాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకోకపోవడంతో ఈ షేరు రూ.1,761 వద్దకు తగ్గింది. ఐటీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లు 1.5 శాతం మధ్య తగ్గాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను ఆకట్టుకోవడంతో 2 శాతంపైగా పెరిగి రూ.1,642 వద్ద నిలిచింది.

ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్‌లు 2 శాతం వరకూ పెరిగాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా ఎనర్జీ ఇండెక్స్ 0.67 శాతం తగ్గింది.  రియల్టీ ఇండెక్స్ 0.53 శాతం, ఎఫ్‌ఎంసీజీ సూచి 0.27 శాతం, బ్యాంకెక్స్ 0.27 చొప్పున తగ్గాయి. కమోడిటీస్, కన్జూమర్ డిస్క్రీషనరీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, ఇండస్ట్రియల్స్, యుటిలిటీస్, పవర్ సూచీలు లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1,27 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.83 శాతం చొప్పున పెరిగాయి.