calender_icon.png 25 October, 2024 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడో రోజూ మార్కెట్ డౌన్

24-10-2024 12:00:00 AM

మరో 138 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్

ముంబై, అక్టోబర్ 23: స్టాక్ మార్కెట్ క్షీణ త వరుసగా మూడో రోజూ కొనసాగింది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలో స్టాక్ సూచీలు కొంత రికవరీ అయినప్పటికీ, మధ్యాహ్న సెషన్ నుంచి అమ్మకాలు జరగడంతో నష్టాల్లో ముగిసాయి. 

బీఎస్‌ఈ సెన్సెక్స్  మరో 138 పాయింట్ల నష్టంతో 80,082 పాయింట్ల వద్ద నిలిచింది.  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ వరుసగా రెండో రోజూ కీలక సాం కేతిక మద్దతుస్థాయి 24,500 పాయింట్ల దిగువన  36 పాయింట్ల నష్టంతో 24, 435 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.

తాజాగా ఆటోమొబైల్, ఫార్మా, షేర్లలో అమ్మకాలు జరిగాయి. అంతర్జాతీయ సంకేతాల బలహీనత, యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరుగుదల, విదేశీ ఫండ్స్ భారత్ నుంచి పెట్టుబడుల్ని చైనాకు మళ్లించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని  విశ్లేషకులు చెప్పారు. 

యూఎస్ బాండ్ ఈల్డ్స్ ప్రభావం

తాజాగా యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ వేగంగా పెరగడంతో ఫెడ్ రేట్ల కోతల పట్ల మార్కెట్లో అంచనాలు తగ్గాయని, ఈ ప్రభావంతో భారత్ తదితర వర్థమాన మార్కెట్ల నుంచి నిధులు తరలివెళుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఫండ్స్ రూ. 82,000 కోట్లకుపైగా నిధుల్ని భారత్ మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నాయి. సమీప భవిష్యత్తులో బేరిష్ సెంటిమెంట్ కొనసాగుతుందని అంచనా వేశారు. ఆసియాలో టోక్యో క్షీణించగా, సియోల్, షాంఘై, హాంకాంగ్‌లు పాజిటివ్‌గా ముగిసాయి. 

ఎం అండ్ ఎం మరో 3 శాతం పతనం

సెన్సెక్స్ ప్యాక్‌లో అన్నింటికంటే అధికంగా  మహీంద్రా అండ్ మహీంద్రా అధికంగా 3.30  నష్టపోయింది. మంగళవారం సైతం ఈ షేరు 3.80 శాతం తగ్గిన సంగతి తెలిసిందే. సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్,  లార్సన్ అండ్ టుబ్రో,  ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్‌లు 2.5 శాతం వరకూ తగ్గాయి. బజాజ్ ఫైనాన్స్ 4.5 శాతం పెరగ్గా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లు 2 శాతం వరకూ లాభపడ్డాయి. 

హ్యుందాయ్ మోటార్ రికవరీ 

లిస్టింగ్ రోజున ఇన్వెస్టర్లకు భారీ నష్టాల్ని మిగిల్చిన హ్యుందాయ్ మోటార్ బుధవారం కొంతవరకూ కోలుకున్నది. హ్యుందాయ్ షేరు ఐపీవో ధర రూ.1,960తో పోలిస్తే మంగళవారం లిస్టింగ్ రోజున 7 శాతం పతనమై రూ.1,819 వద్ద నిలిచింది. తాజాగా ఇది 4 శాతంపైగా రికవరీ అయ్యి రూ.1,896 వద్ద ముగిసింది. 

రూ.90,000 కోట్లకు పెరిగిన ఎఫ్‌పీఐల అమ్మకాలు

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐలు) విక్రయాలు బుధవారం సైతం కొనసాగాయి. తాజాగా ఎఫ్‌పీఐలు రూ.5,684 కోట్ల విలువైన షేర్లు విక్రయించినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనితో ఈ నెలలో ఇప్పటివరకూ భారత్ నుంచి వెనక్కు తీసుకున్న ఈక్విటీ నిధులు  రూ.90,000 కోట్లను మించాయి.