calender_icon.png 9 November, 2024 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో రోజూ మార్కెట్ డౌన్

09-11-2024 01:59:55 AM

సూచీలను దెబ్బతీసిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్

ముంబై, నవంబర్ 8: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో ఐటీ షేర్ల అండతో ఒక రోజు పెరిగిన స్టాక్ మార్కెట్ తదుపరి బ్యాంకింగ్, ఆయిల్ షేర్లలో జరిగిన అమ్మకాలతో వరుస రెండు రోజులూ తగ్గింది.

ఇండెక్స్ హెవీవెయిట్లు రిలయన్స్ ఇండస్ట్రస్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు సూచీల క్షీణతకు కారణమయ్యాయి.  శుక్రవారం  బీఎస్‌ఈ సెన్సెక్స్ మరో  55 పాయింట్లు నష్టపోయి 79,424 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 51 పాయింట్లు తగ్గి కీలకమైన 24,200 పాయింట్ల దిగువన 24,148 పాయింట్ల వద్ద  ముగిసింది. గురువారం సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 285 పాయింట్ల చొప్పున పతనమయ్యాయి. ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 237 పాయిం ట్లు, నిఫ్టీ 156 పాయింట్ల మేర క్షీణించాయి.

ఉత్సాహపర్చని ఫెడ్ రేట్ల కోత 

యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ, దేశీయ ఇన్వెస్టర్లను ఉత్సాహపర్చలేదని, విదేశీ ఫండ్స్ అదేపనిగా జరుపుతున్న విక్రయాలతో దేశీయ మార్కెట్ క్షీణిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లు రికవరీ అయినా, భారత్ సూచీలు మాత్రం విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల తాకిడికి విలవిలలాడుతున్నాయని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే తెలిపారు. యూఎస్ ఫెడ్ రేట్ల కోత స్థానిక ఇన్వెస్లర్లలో జోష్‌ను నింపలేకపోయిందన్నారు. ఫెడరల్ రిజర్వ్ గురువారంనాటి సమీక్షా సమావేశంలో ఫెడ్ ఫండ్స్ రేటును 0.25 శాతం తగ్గించింది. దీనితో ఫెడ్ ఫండ్స్ రేటు 4.5 శాతానికి దిగివచ్చింది. సెప్టెంబర్ మీట్‌లో ఫెడ్ అరశాతం వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. 

ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా ఏషియన్ పెయింట్స్ 2.6 శాతం తగ్గింది. టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లు 2 శాతం వరకూ తగ్గాయి. మరోవైపు క్యూ2 ఫలితాలతో ఇన్వెస్టర్లను ఆకట్టుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా 2.8 శాతం పెరిగింది. టైటాన్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, నెస్లే, హిందుస్థాన్ యూనీలీవర్‌లు 2 శాతం వరకూ లాభపడ్డాయి.

వివిధ రంగాల సూచీల్లో అత్యధికంగా రియల్టీ ఇండెక్స్ 2.98 శాతం తగ్గింది. ఎనర్జీ ఇండెక్స్ 2.10 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 2.08 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 1.59 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 1.30 శాతం, మెటల్ ఇండెక్స్ 1.05 శాతం. పవర్ ఇండెక్స్ 1.51 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.18 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.52  శాతం చొప్పున తగ్గాయి. ఐటీ, ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్, టెక్నాలజీ ఇండెక్స్‌లు లాభపడ్డాయి. 

నవంబర్ 20న మార్కెట్లకు సెలవు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కారణంగా నవంబర్ 20న స్టాక్ ఎక్సేంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు సెలవు ప్రకటించాయి. ఈక్విటీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో ట్రేడింగ్ ఉండదని తెలిపారు.