calender_icon.png 22 October, 2024 | 11:08 PM

తిరిగి క్షీణబాటలో మార్కెట్

22-10-2024 01:20:20 AM

  1. 73 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
  2. 24,800 దిగువన నిఫ్టీ ముగింపు

ముంబై, అక్టోబర్ 21: గత శుక్రవారం వరుస పతనాలకు బ్రేక్‌నిచ్చిన మార్కెట్ సోమవారం తిరిగి క్షీణబాట పట్టింది. బ్యాంకింక్ హెవీవెయిట్ కోటక్ మహీంద్రా బ్యాంక్‌తో సహా ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ తదితర షేర్లలో అమ్మకాలు జరిగాయి. 

ట్రేడింగ్ తొలిదశలో బీఎస్‌ఈ సెన్సెక్స్  545 పాయింట్లు పెరిగినప్పటికీ, అటుతర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో 80,811 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది. ఈ ఒక్కరోజులో 958 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది.

చివరకు  73 పాయింట్లు తగ్గి 81,151 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  ఇంట్రాడేలో 24,978-24,679 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనై చివరకు 73 పాయింట్లు నష్టంతో  కీలకమైన 24,800  పాయింట్ల దిగువన 24, 781 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 

ప్రైవేటు బ్యాంక్‌ల ఫలితాలు నిరుత్సాహకరం

ప్రస్తుతం కొనసాగుతున్న కార్పొరేట్ క్యూ2 ఫలితాల సీజన్ చాలావరకూ అంచనాల్ని అందుకోలేదని, ప్రత్యేకించి ప్రైవేటు రంగ బ్యాంక్‌ల ఫలితాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అయితే మార్కెట్‌కు దేశీయ సంస్థలు మద్దతును అందించడంతో క్షీణత తక్కువగా ఉన్నదని చెప్పారు. 

హెచ్‌డీఎఫ్‌సీ అప్..కోటక్ డౌన్

 గత వారాంతంలో ఆర్థిక ఫలితాల్ని వెల్లడించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సెన్సెక్స్ బాస్కెట్‌లో అత్యధికంగా (2.83 శాతం) లాభపడగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ అన్నింటికంటే అధికంగా (4.30 శాతం) నష్టపోయింది.  బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, భారతి ఎయిర్‌టెల్, హిందుస్థాన్ యూనీలివర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు 3 శాతం వరకూ తగ్గాయి. 

ఏషియన్ పెయింట్స్ 2 శాతం మేర పెరగ్గా, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకిలు 1 శాతం వరకూ లాభపడ్డాయి.  వివిధ రంగాల సూచీల్లో అధికంగా సర్వీసెస్ ఇండెక్స్ 1.92 శాతం తగ్గింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.68 శాతం, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 1.65 శాతం, రియల్టీ ఇండెక్స్ 1.52 శాతం, మెటల్ ఇండెక్స్ 1.44శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 1.40 శాతం చొప్పున తగ్గాయి.  ఆటో సూచి ఒక్కటే లాభపడింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.63 శాతం పెరగ్గా, స్మాల్‌క్యాప్ సూచి 1.51 శాతం చొప్పున క్షీణించాయి.

ఆగని ఎఫ్‌పీఐల అమ్మకాలు

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐలు) విక్రయాలు సోమవారం సైతం కొనసాగాయి. తాజాగా ఎఫ్‌పీఐలు రూ.2,261 కోట్ల విలువైన షేర్లు విక్రయించినట్లు ్ట స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత 15 ట్రేడింగ్ రోజుల్లో  దాదాపు రూ.80,000 కోట్లకుపైగా ఈక్విటీ పెట్టుబడుల్ని విదేశీ ఫండ్స్ వెనక్కు తీసుకున్నాయి.