సెన్సెక్స్ 100 పాయింట్లు, నిఫ్టీ 27 పాయింట్లు అప్
ముంబై, సెప్టెంబర్ 16: ఒక రోజు విరామానంతరం సోమవారం మార్కెట్ ర్యాలీ కొనసాగింది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త రికార్డుస్థాయిల్ని నమోదు చేశాయి. గత గురువారం చరిత్రలో తొలిసారిగా 83,000 శిఖరాన్ని అందుకున్న బీఎస్‌ఈ సెన్సెక్స్ ఆ మరుసటి రోజు శుక్రవారం బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సోమవారం ఇంట్రాడేలో 283 పాయింట్లు పెరిగి 81,183 పాయింట్ల వద్ద కొత్త గరిష్ఠస్థాయిని తాకింది. చివరకు 98 పాయింట్ల లాభంతో 82,988 పాయింట్ల వద్ద నిలిచింది. సెన్సెక్స్ ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రధమం.
ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 89 పాయింట్లు ఎగిసి 25,445 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. చివరకు 27 పాయింట్ల లాభంతో 25,383 పాయింట్ల వద్ద నిలిచింది. ఎనర్జీ, యుటిలిటీ, బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్లు జరిగాయని ట్రేడర్లు తెలిపారు. అయితే వరుస కొనుగోళ్లు జరుపుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తాజాగా రూ. 1,634 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
పాజిటివ్ సెంటిమెంట్
ఇన్వెస్టర్లు యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం కోసం వేచిచూస్తున్న నేపథ్యంలో తాజాగా స్టాక్ సూచీలు స్వల్ప శ్రేణిలో పాజిటివ్‌గా ట్రేడయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. యూఎస్ జాబ్ మార్కెట్ బలహీనత, ద్రవ్యోల్బణం తగ్గుదల కారణంగా ఫెడ్ నుంచి వరుస రేట్ల కోతలు ఉంటాయన్న అంచనాలు మార్కెట్లో ఏర్పడుతున్నాయన్నారు. దీంతోపాటు విదేశీ నిధులు దేశీయ మార్కెట్లోకి తరలివస్తుండటం, భారత్ జీడీపీ వృద్ధిపై ఆశాభావం కారణంగా పాజిటివ్ సెంటిమెంట్ కొనసాగుతుందని చెప్పారు.
స్వల్పకాలిక ట్రెండ్‌ను యూఎస్ ఫెడ్ నిర్ణయం ప్రభావితం చేస్తుందని, ఇన్వెస్టర్లు ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటూ, జాగ్రత్త వహించాలని పీఎల్ క్యాపిటల్ ప్రభుదాస్ లీల్లాధర్ అడ్వయిజరీ హెడ్ విక్రమ్ కాసత్ సూచించారు. సమీప భవిష్యత్తులో స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను ఫెడ్ నిర్ణయం నిర్దేశిస్తుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ చెప్పారు.
ఎన్టీపీసీ టాప్ గెయినర్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా ఎన్టీపీసీ 2.44 శాతం పెరిగింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, లార్సన్ అండ్ టుబ్రో, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్‌లు 2 శాతం వరకూ లాభపడ్డాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్ 3 శాతం క్షీణించింది. బజాజ్ ఫిన్‌సర్వ్, హిందుస్థాన్ యూనీలీవర్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు 2.5 శాతం వరకూ తగ్గాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా యుటిలిటీస్ ఇండెక్స్ 1.97 శాతం ఎగిసింది.
పవర్ ఇండెక్స్ 1.93 శాతం, మెటల్ ఇండెక్స్ 0.65 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.56 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 0.49 శాతం, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 0.33 శాతం మేర పెరిగాయి. ఐటీ, టెలికమ్యూనికేషన్స్, టెక్నాలజీ, సర్వీసెస్, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌లు తగ్గాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచి 0.28 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.01 శాతం చొప్పున పెరిగాయి.