calender_icon.png 31 October, 2024 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒడిదుడుకుల్లోనే మార్కెట్

28-10-2024 12:00:00 AM

  1. గ్లోబల్ ట్రెండ్స్, విదేశీ ఫండ్స్ యాక్టివిటీపై దృష్టి
  2. ఈ వారం సూచీల కదలికలపై విశ్లేషకుల అంచనాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 27:  అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు,  విదేశీ ఫండ్స్ ట్రేడింగ్ యాక్టివిటీ ఆధారంగా ఈ వారం మార్కెట్ కదలికలు ఉంటాయని విశ్లేషకులు చెపుతున్నారు. నాలుగు రోజులకే ట్రేడింగ్ పరిమి తమైన ఈ వారంలో అక్టోబర్ సిరీస్ ఫ్యూచ ర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టుల ముగింపు మార్కెట్‌ను ఒడిదుడుకులకు లోను చేస్తుందని వారు అంచనా వేస్తున్నారు.

దీపావళి సందర్భంగా వచ్చే శుక్రవారం నవంబర్ 1న మార్కెట్‌కు సెలవు. అయితే ఆ రోజు సాయంత్రం సాంప్రదాయకంగా నిర్వహించే మూరత్ ట్రేడింగ్ ఒక గంటపాటు జరుగుతుంది. అక్టోబర్ 31న ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. మరోవైపు అంతర్జాతీయ క్రూడ్ ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను కూడా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారని విశ్లేషకులు చెప్పారు.

ఈ నేపథ్యంలో మార్కెట్ ఒడిదుడుకులు ఈ వారం కూడా కొనసాగుతాయని వారు అంచనా వేస్తున్నారు.  ఇజ్రాయిల్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరంకావడం, తద్వా రా క్రూడ్ ధరలు పెరగడం మార్కెట్‌ను ఒడిదుడుకులకు లోను చేస్తుందని స్వస్తికా ఇన్వె స్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ చెప్పారు.

మరోవైపు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీ విక్రయాలు జరపడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నదని తెలిపారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, చైనా ఆర్థిక వ్యవస్థ మందకొడితనం, విదేశీ ఇన్వెస్టర్ల ఎడతెగని అమ్మకాల కారణంగా ట్రేడర్లు ఆచితూచి వ్యవహరిస్తారని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు. అక్టోబర్ 25తో ముగిసిన వారంలో మార్కెట్ భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ 1,822 పాయింట్లు, నిఫ్టీ 673 పాయింట్ల చొప్పున క్షీణించాయి. 

యూఎస్ అధ్యక్ష ఎన్నికలపై కన్ను

యూఎస్ అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరగ నున్నందున, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు జాగ్రత్తగా వేచిచూసే ధోరణిలో ఉన్నాయని సంతోష్ మీనా తెలిపారు. నవంబర్ 5న యూఎస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల పట్ల ఇన్వెస్టర్ల అప్రమత్తత కారణంగా సమీప భవిష్యత్తులో మార్కెట్ బలహీనత కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖెమ్కా చెప్పారు. నిఫ్టీ రికార్డు గరిష్ఠ స్థాయి 26,277 పాయింట్ల నుంచి ఇప్పటికి 8 శాతం పడిపోయిందని తెలిపారు. 

ఎఫ్‌పీఐల పెట్టుబడులు కీలకం

రానున్న రోజుల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు మార్కె ట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఎఫ్‌పీఐల అమ్మకాలు తగ్గడం, యూఎస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ట్రెండ్ రివర్సల్ ఆధారపడి ఉంటుం దని నాయర్ వివరించారు. 

అక్టోబర్ డెరివేటివ్స్ ఎక్స్‌పైరీతో ఈ వారంలో ఒడిదు డుకులు పెరుగుతాయని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అంచ నా వేశారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అక్టోబర్ నెలలో ఇప్పటవరకూ రూ. 85,790 కోట్ల మేర నికర విక్రయాలు జరిపారు.  అయితే దేశీయ సంస్థలు రూ. 80,000 కోట్ల మేర నికర పెట్టుబడులు చేయడంతో మార్కెట్ క్షీణత తక్కువగా ఉన్నదని విశ్లేషకులు తెలిపారు.

ఇజ్రాయిల్, ఇరాన్‌ల పరస్పర దాడులు, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా పెరగడం, చైనా ఉద్దీపన ప్యాకేజీతో అక్కడి మార్కెట్ ఆకర్షణీయంగా మారడం వంటి అంశాలు ఎఫ్‌పీఐలను అమ్మకాలకు పురికొల్పాయ ని విశ్లేషకులు తెలిపారు. వీరు సెప్టెంబర్ నెల మొత్తం భారత్ మార్కెట్లో రూ. 57,724 కోట్లు పెట్టుబడి చేశారు.

ఇటీవల యూ ఎస్ ట్రెజరీ ఈల్డ్ పెరగడం కూడా భారత్ మార్కెట్ నుంచి చౌకగా ఉన్న మార్కెట్లలోకి ఎఫ్‌పీఐలు నిధులు తరలించడానికి మరో కారణమని వినోద్ నాయర్ చెప్పారు.

చైనా మార్కెట్లలో అర్బిట్రేజ్ అవకాశాల్ని వారు అందిపుచ్చుకుంటున్నారని, సెప్టెంబర్ మధ్య నుంచి ఎఫ్‌ఫీఐలు చైనా షేర్లను భారీగా కొనుగోలు చేస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమా ర్ చెప్పారు.  ఎఫ్‌పీఐలు, డీఐఐల ట్రేడింగ్ సరళి ఇదేరీతిలో సమీప భవిష్యత్తులో కొనసాగుతుందని ఆయన అంచనా వేశారు. 

కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు

దేశీ కార్పొరేట్ల క్యూ2 ఫలితాల వెల్లడి కొనసాగుతున్నందున, ఈ వారం వెలువ డే కార్పొరేట్ ఫలితాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తుందని సంతోష్ మీనా చెప్పారు. వారాంతంలో వెలువడిన ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్ తదితర ఆర్థిక ఫలితాలపై మార్కెట్ తొలుత ఈ సోమవారం స్పందిస్తుంది. ఈ వారం భారతి ఎయిర్‌టెల్, మారుతి సుజుకి, లార్సన్ అండ్ టుబ్రో, అదానీ పోర్ట్స్, సిప్లా, సన్‌ఫార్మా, బీ హెచ్‌ఈఎల్, డాబర్ ఇండియా తదితర పెద్ద కంపెనీల ద్వితీయ త్రైమాసిక ఫలితాలు వెల్లడికానున్నాయి.