ముంబై, అక్టోబర్ 11: కీలకమైన ఆర్థిక గణాంకాలు వెల్లడికానున్న నేపథ్యంలో స్టాక్ సూచీలు నష్టాలతో ముగిసాయి. ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, యుటిలిటీ షేర్లలో అమ్మకాలు జరిపారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 304 పాయింట్ల వరకూ తగ్గి 81,304 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకిన అనంతరం చివరకు 230 పాయింట్ల తగ్గుదలతో 81,381 పాయింట్ల వద్ద నిలిచింది.
ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 24,920 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకిన తర్వాత చివరకు 34 పాయింట్ల నష్టంతో కీలకమైన 25,000 పాయింట్ల దిగువన 24,964 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎడతెగని విదేశీ ఫండ్స్ విక్రయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయని ట్రేడర్లు తెలిపారు. మార్కెట్ ముగిసిన తర్వాత కేంద్రం పారిశ్రామికోత్పత్తి గణాంకాల్ని విడుదల చేసింది. ఆగస్టు నెలలో పారిశ్రామికోత్పత్తి తగ్గింది.
టీసీఎస్, ఎం అండ్ ఎం టాప్ లూజర్స్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా టీసీసీ, మహీంద్రా అండ్ మహీంద్రాలు 1.84 శాతం చొప్పున తగ్గాయి.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకి, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ 1.5 శాతం వరకూ క్షీణించాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా రియల్టీ ఇండెక్స్0.74 శాతం తగ్గింది.
యుటిలిటీస్ ఇండెక్స్ 0.68 శాతం, బ్యాంకెక్స్ 0.61 శాతం, ఆటోమొబైల్ ఇండెక్స్ 0.45 శాతం, ఫైనాన్షియల్ సర్వీసుల ఇండెక్స్ 0.42 శాతం, పవర్ ఇండెక్స్ 0.38 శాతం మేర తగ్గాయి. హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్, మెటల్ సూచీలు సైతం పెరిగాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు 0.44 శాతం చొప్పున లాభపడ్డాయి.
పెరిగిన సంపద
ప్రధాన స్టాక్ సూచీలు తగ్గినప్పటికీ, ఇన్వెస్టర్ల సంపద పెరిగింది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.27,796 కోట్లు పెరిగి రూ. 4,62,27,901 కోట్లకు (5.50 ట్రిలియన్ డాలర్లు) చేరింది.
కొనసాగిన ఎఫ్‌పీఐల అమ్మకాలు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐలు) విక్రయాలు శుక్రవారం సైతం కొనసాగాయి. తాజా గా ఎఫ్‌పీఐలు రూ.4,162 కోట్ల వి లువైన షేర్లు విక్రయించినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడి స్తున్నాయి. గత ఎనిమిది ట్రేడింగ్ రోజుల్లో విదేశీ ఫండ్స్ దా దాపు రూ. 60,000 కోట్లకుపైగా ఈక్విటీ పెట్టుబడుల్ని విదేశీ ఫండ్స్ వెనక్కు తీసుకున్నాయి.