calender_icon.png 20 January, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాతాదారుల వద్దే మేనేజర్ అప్పులు!

17-07-2024 03:08:31 AM

రూ. కోటితో ఉడాయించిన నిజామాబాద్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్‌కుమార్

నిజామాబాద్, జూలై 16 (విజయక్రాంతి): ఆయనో బ్యాంకు మేనే జర్.. తన బ్యాంకు ఖాతాదారులతో నమ్మకంగా మెదిలి ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద అప్పులు చేశారు.. వారికి నమ్మకం కల్గించేలా ప్రామిసరి నోట్లు, చెక్కులు సైతం ఇచ్చాడు.. దాదాపు కోటి రూపాయల వరకు వసూలుచేసిన సదరు మేనేజర్ మూడు రోజులుగా ఆచూకీ లేకుండా పోయాడు. ఇప్పుడు  లబోదిబోమనడం బాధితుల వంతైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ యూనియన్ బ్యాంక్‌లో పినపాటి అజయ్‌కుమార్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. బ్యాంకు ఖాతాదారుల కు రుణాలు ఇప్పించడం, లావాదేవీల్లో సాయం చేయడంతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు.

ఆ పరిచయంతో ఖాతాదా రులు తమ ఆర్థిక లావాదేవీలను మేనేజర్‌తో పంచుకొనేవారు. వారి వద్ద నమ్మకం పెంచుకున్న మేనేజర్.. పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరి నుంచి.. ఒక్కొక్కరి వద్ద రూ. లక్ష నుంచి రూ. ఐదారు లక్షల వరకు అప్పుచేశాడు. వారికి పూచికత్తు కింద బ్యాంకు చెక్కులు, ప్రామిసరి నోట్లు సైతం రాసిచ్చాడు. బ్యాంకులో ఖాతాలు ఉన్న అనేకమంది నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్న అజయ్‌కుమార్ గత మూడు, నాలుగు రోజులుగా బ్యాంకుకు రావడం లేదు. 

వడ్డీ డబ్బులు సైతం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన ఖాతా దారులు అతనికి ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో అనుమానంతో బ్యాంకు సిబ్బందిని విచారించారు. వారు బ్యాంకు మేనేజర్ లీవులో ఉన్నాడని  సమాచారం ఇవ్వడంతో, ఖాతాదారులు మేనేజర్ ఇంటికి వెళ్లారు. మేనేజర్ ఇంటికి సైతం తాళంవేసి ఉండటంతో తమ డబ్బులతో మేనేజర్ ఉడాయించాడని గ్రహించిన ఖాతాదారులు ఒకరొక్కరుగా బ్యాంకుకు వచ్చి తాము మేనేజర్ డబ్బులు అప్పుగా ఇచ్చినట్టుగా తెలిపారు, దీనితో బ్యాంకు సిబ్బంది పైఅధికారులకు సమచారం అందించారు.

దీంతో బ్యాంకు ఉన్నతాధికారులు శివాజినగర్ బ్రాంచ్‌కు మరో మేనేజర్‌ను కేటాయించారు. బ్యాంకు కు పెద్దఎత్తున మేనేజర్ బాధితులు వస్తుండటంతో, పాత మేనేజర్ బ్యాంకులో సైతం ఏమైనా అక్రమాలకు పాల్పడ్డాడా అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఆడిటర్లను నియమించి బ్యాంకు లావాదేవీలపై ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 16 మంది తాము రూ.60 లక్షలకు పైగా మేనేజర్‌కు అప్పుగా ఇచ్చినట్టు ప్రస్తుత బ్యాంకు మేనేజర్, ఆడిటర్లకు ఫిర్యాదు చేశారు.

తమ డబ్బులు తమకు ఇప్పించేటట్టుగా చూడాలని బ్యాంకు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మేనేజర్‌కు అప్పు ఇచ్చిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. అజయ్‌కుమార్ ఐపీ పెడు తాడా ? లేక తమ డబ్బులు ఇస్తాడా అని బాధితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.