calender_icon.png 15 March, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.18 లక్షలు కాజేసిన పక్కింటి వ్యక్తి

17-12-2024 12:29:25 AM

రిటైర్డ్ ఉద్యోగి ఖాతా నుంచి మాయం

జగిత్యాల అర్బన్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): వృద్ధాప్యం కారణంగా బ్యాంకు లావాదేవీల కోసం పక్కింటి వ్యక్తి సహాయం తీసుకుంటే తన ఖాతాలో డబ్బులు మాయం చేసిన ఘటన జగిత్యాల పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సారెస్పీలో పనిచేసి 20 ఏళ్ల క్రితం రిటైర్డ్ అయిన వ్యక్తి ఖాతా నుంచి ఇప్పటి వరకు ప్రతినెలా విడతల వారీగా సుమారు రూ.18 లక్షలు సదరు వ్యక్తి డ్రా చేస్తూ వస్తున్నాడు. ఆలస్యంగా తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన నక్క లక్ష్మణ్ గతంలో ఎస్సీరెస్పీలో ఉద్యోగం చేసి 20 ఏళ్ల క్రితం రిటైర్డ్ అయ్యాడు. తర్వాత ప్రభుత్వం నుంచి ప్రతి నెల రూ.20 వేల పెన్షన్ వస్తుండటంతో విత్‌డ్రా చేసేందుకు ఇంటి దగ్గరే ఉండే దీకొండ తిరుపతి సాయం కోరాడు. దీంతో బాధితుడి అకౌంట్‌ను తిరుపతి తన మొబైల్ నంబర్‌కు లింకు చేసుకున్నాడు. అప్పటి ప్రభుత్వం పెన్షన్‌ను రూ.44 వేలకు పెంచడంతో తిరుపతి ప్రతి నెల రూ.24 వేలు డ్రా చేసుకుంటూ లక్ష్మణ్ ఖాతాలో రూ.20 వేలు మాత్రమే ఉంచేవాడు.

అయితే ఈ ఏడాది మే నెలలో బాధితుడు అనారోగ్యంపాలవగా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం పెన్షన్ డ్రా చేసేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులకు అసలు విషయం తెలిసి షాకయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డబ్బులు తిరిగి ఇస్తానని ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీంతో బాధితుడు సోమవారం కలెక్టర్‌ను ఆశ్రయిం చాడు. ఎలాగైనా న్యాయం చేయాలని ప్రజావాణిలో వినతిపత్రం అందజేయగా.. సమస్య పరిష్కరించాలని జిల్లా పోలీసు అధికారులను కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు.