calender_icon.png 28 November, 2024 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నయనం ప్రధానం

28-11-2024 12:00:00 AM

మనకు తెలుసు అదే పనిగా ఫోన్ చూస్తే కంటి సమస్యలు వస్తాయని.. అయినా ఫోన్ చూస్తూనే ఉంటాం. ఒక్క ఫోన్ విషయంలోనే కాదు.. రకరకాల కారణాల వల్ల కంటి సమస్యలు వస్తాయి అని అంటున్నారు ప్రముఖ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ హరినాథ్ కర్లపూడి.

మనకు ఎలాంటి వ్యాధీ లేదు. అంతబాగానే ఉందని అ నుకుంటాం. కానీ ఏదో పరీక్ష చేయించుకోవడానికి వెళ్తే షుగర్ ఉన్నట్టు తేలుతుంది. అలాగే బీపీ చెక్ చేయించుకుంటారు. అది కూడా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. రెండు, మూడు పరీక్షల తర్వాత.. రక్తపోటు ఉన్నట్టుగా నిర్దారణ అయ్యాక.. డాక్టర్లు ముందుగా కిడ్నీలనూ, కంటినీ పరీక్షించి రక్తనాళాలు బాగున్నాయా? లేదా అని చూస్తారు. ఇలా వచ్చిన వ్యాధి  గుండెపోటు నుంచి మైగ్రేన్ వంటి తలనొప్పి వరకు కంటిపై దుష్ప్రభావాలను చూపుతుంది.  

మనలో ఎన్నో కణాలుంటాయి. ఆ కణాలన్నీ కలిసి కణజాలంగా ఏర్పడతాయి. ఆయా కణజాలాలు కొన్ని విధులు నిర్వహించడానికి ప్రత్యేకంగా కొన్ని అవయవాలుగా ఏర్పడతాయి. ఆ అవయవాలు ఒక వ్యవస్థలా రూపొంది కొన్ని జీవక్రియలు నిర్వహిస్తుంటాయి. మనకు ఏదైనా వ్యాధి వచ్చిందంటే చాలా సందర్భాల్లో అది ఆ అవయవానికో, ఆ అవయవం నిర్వహించే జీవవ్యవస్థకో పరిమితమవు తుందని అనుకుంటాం.

ఉదాహరణకు థైరాయిడ్ అనే అవయవానికి ఏదైనా జబ్బు వస్తే అది థైరాయిడ్‌కే పరిమితం కాదు. అలా రక్తప్రసరణ వ్యవస్థలో ఏదైనా హెచ్చుతగ్గులు ఏర్పడితే అది అంతవరకే తన ప్రభావం చూపదు. కంటి మీదా దాని దుష్ప్రభావం కనిపించవచ్చు. అలా కంటిపై ప్రభావం కనిపించేందుకు ఆస్కారం ఉన్న కొన్ని వ్యాధులకు ఉదాహరణ డయాబెటిస్, రక్తపోటు. 

డయాబెటిస్

ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి డయాబెటిస్. పైగా ఈ వ్యాధి ఉన్నవారిలో కనీసం 20 శాతం మందిలో కంటిపై దాని తాలూకు ప్రభావం కనిపించే అవకాశం ఉంది. డయాబెటిక్ రెటినోపతి.. రెటీనా అనే కంటి వెనక ఉండే తెరపై పడే ప్రతిబింబం నుంచి మెదడుకు సిగ్నల్స్ అందడం వల్లనే మనకు చూపు అనే జ్ఞానం కలుగుతుందన్న విషయం తెలిసిందే.

డయాబెటిస్ కారణంగా రక్తనాళాలు మొద్దుబారడం వల్ల రెటీనాకు అందాల్సినంతగా పోషకాలు, ఆక్సిజన్ అందక క్రమంగా రెటీనా తన పనితీరును కోల్పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల దృష్టిలోపం కూడా రావొచ్చు. అందుకే డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. 

అధిక రక్తపోటు

అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) ఉన్నవారిలో అకస్మాత్తుగా చూపు మసకబారవచ్చు. లేదా చూపు కనిపించకపోవచ్చు. దీనికి కారణాలుంటాయి. రక్తపోటు కారణంగా.. రెటీనాకు సంబంధించిన కేంద్ర రక్తనాళం (సిర) లేదా ఏదైనా రక్తనాళపు శాఖలో రక్తం గడ్డకట్టి అడ్డుపడవచ్చు. రెటీనాకు సంబంధించిన ప్రధాన ధమని లేదా ధమని శాఖలో రక్తం గడ్డకట్టి అడ్డుపడవచ్చు.

ఆప్టిక్ న్యూరోపతి అనే నరాల సంబంధమైన సమస్య రావచ్చు. కన్నులోని ఒక భాగమైన విట్రియల్ ఛేంబర్‌లో రక్తస్రావం కావచ్చు. గ్లకోమా కూడా రావచ్చు. రక్తపోటు ఉన్నవారు బీపీని అదుపులో పెట్టుకోవాలి. ఉప్పు, నూనె పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవాలి. కంటికి సంబంధించిన సమస్య వస్తే మందులు వాడటం లేదా లేజర్ చికిత్స లేదా శస్త్ర చికిత్స చేయించుకోవాలి.  

చిన్నారుల్లో.. 

ప్రపంచవ్యాప్తంగా మయోపియా (హ్రస్వదృష్టి)తో బాధపడేవారి సంఖ్య పెరుగుతున్నట్లు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ సమస్య ఉన్నవారికి దూరంగా ఉన్నవి స్పష్టంగా కనిపించవు. ఈ సమస్య చిన్న పిల్లల్లో, యుక్త వయసువారిలో ఎక్కువగా ఉన్నట్లు చైనాలోని సన్ యట్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు.

2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా హ్రస్వదృష్టితో బాధపడేవారి సంఖ్య 74 కోట్లకు చేరుకుంటుందని వెల్లడించారు. సంపన్న దేశాల కంటే అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో మయోపియా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. సుమారుగా మూడింట ఒక వంతు పిల్లల్లో ఈ సమస్య ఉందని.. అబ్బాయిల కంటే అమ్మాయిల్లో ఈ సమస్య  పెరుగుతున్నట్లు వెల్లడైంది.

తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, చిన్నారులకు బాల్యం నుంచే విటమిన్ ఎ, పోషకాలు ఎక్కువగా ఉండే పదార్థాలను ఆహారంగా ఇవ్వాలని.. పిల్లలు ఎక్కువ సమయం మొబైల్, ట్యాబ్‌లు, టీవీలతో గడపకుండా జాగ్రత్త వహించాలి. 

ఈ లక్షణాలు ప్రమాదకరం.. 

ఇంద్రియాలు అన్నింటిలో కన్ను ప్రధానమైనది. మనకి చూపును ప్రసాదించే కళ్లను సంరక్షించుకోవడం మన బాధ్యత. అలాగే మన కళ్లలో, కంటి చుట్టూ కనిపించే కొన్ని లక్షణాలు కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతాలుగా గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. కళ్ల చుట్టూ చర్మం పసుపు రంగులో మారినట్టు అనిపించినా, కంటి చుట్టూ చర్మం పసుపు వలయంలా ఏర్పడినా నిర్ల క్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు.

రక్తంలో లిపిడ్ స్థాయిలు పెరిగినప్పుడు, గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేసే ధమనుల గోడలపై కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోయిన ఇలా జరుగుతుంది. రక్తంలో లేదా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుంటే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

కంటిలోని నల్ల గుడ్డు చుట్టూ నీలం రంగు లేదా బూడిద రంగు వంటి రంగుల్లో కార్నియా కనిపించినా నిర్లక్ష్యం చేయవద్దు. ఇలా జరిగినప్పుడు ముఖంలో నీరసం, తీవ్ర అలసటగా ఉంటుంది. అందుకే కంటిచుట్టూ పసుపు వలయం ఏర్పడినా, కంటిలో రంగు మారిన కార్నియా కనిపించినా వైద్యులను సంప్ర దించాలి. 

ఒమ్మెటా ఫోబియా..

ఫోబియా.. అంటే భయం. ఎందుకండి ప్రతిదానికి భయపడుతున్నారు? ఇది చేయలంటే భయం.. అది చేయాలంటే భయం.. వాళ్లతో మాట్లాడాలంటే భయం.. ఇలా రకరకాల భయలుంటాయి చాలామందికి. అలాగే కళ్లకు సంబంధించిన  భయం కూడా ఉంటుంది తెలుసా? దాన్నే ‘ఒమ్మెటా ఫోబియా’ అంటారు. 

చూపుతగ్గడానికి కారణాలు.. 

కంటి చూపు మందగించడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. దాన్ని రీఫ్రాక్టీవ్ ఎర్రర్స్ అంటారు. ఈ విధమైన కంటి సమస్యలను పిల్లల్లో ఎక్కువగా వస్తాయి. ఒకటి దగ్గరగా, దూరంగా, సమీపంలో ఉన్నవి కనిపించకపోవడం. పెద్దవారిలో కంటి శుక్లం వస్తాయి. అలాగే వయసు పెరిగే కొద్ది చర్మంలో మార్పులు ఏలా అయితే వస్తాయో.. అలా కంటిలో కూడా మార్పులు వస్తాయి.

మన శరీరంలో బీపీ ఎలా ఉంటుందో.. అలాగే కంటిలో కూడా సరైన మోతాదులో బీపీ ఉండాలి. కంటిలో బీపీ 20 కంటే తక్కువగా ఉండాలి. కంటి ఒత్తిడి కారణంగా చూపు తగ్గుతుంది. మనం తీసుకునే ఆహారంలో విటమిన్‌లు అనే పోషకాలు లోపించడం వల్ల కూడా కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు వస్తాయి.

అందుకే ఆయా విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మొబైల్ ఫోన్ స్క్రీన్‌లపై చిన్నగా ఉండే అక్షరాలను చదవద్దు. స్క్రీన్‌లకు ఎక్కువగా అతుక్కుపోతే అది కళ్ళకు హాని కలిగిస్తుంది. కళ్లు దెబ్బతింటాయి. కళ్లు పొడిబారినట్లు అవుతాయి. దీనివల్ల తలనొప్పి, కంటి ఒత్తిడికి గురవుతారు.

అలాగే సరైన నిద్రలేమి కారణంగా కంటి సమస్యలు తలెత్తుతాయి. వాటిలో ఒకటి కంటి చూపు మందగించడం. రోజుకు కనీసం ఏడు గంటల పాటు నిద్ర చాలా తప్పనిసరి అవసరం. దీనివల్ల కళ్లకు విశ్రాంతి దొరుకుతుంది. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

  డాక్టర్ హరినాథ్ కర్లపూడి

ఆప్తమాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్

హైటెక్ సిటీ, హైదరాబాద్