22-02-2025 01:10:06 AM
యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 21 (విజయ క్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి శ్రీ సుదర్శన దివ్య విమాన స్వర్ణ గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా మూడో రోజు అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కొండపై ఆలయం విద్యుత్ కాంతుల మధ్య దగదగా మెరుస్తూ వైకుంఠాన్ని తలపిస్తుంది. భక్తులు వందల మంది హాజరై స్వామివారి సంప్రోక్షణ కార్యక్రమాలలో పాల్గొని తన్మయం చెందారు. అర్చకులు వేద పండితులు స్వామివారిని ప్రధాన వీధులలో ఊరేగింపు జరిపారు.
రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా బంగారు తాపడంతో శ్రీ నరసింహ అవతారాలైన కేశవ నారాయణ మూర్తులు. గరుడమూర్తులు. మొదలగు దేవత విగ్రహాలను నెలకొల్పారు. సుమారు 50. 5 అడుగుల ఎత్తున స్వర్ణ శోభిత విమాన గోపురమును శ్రీశ్రీశ్రీ వానమామలై మఠం 31వ పీఠాధిపతులు శ్రీ మధుర కవి రామానుజ జీయర్ స్వామి వారిచే ఈ నెల 23న ఆదివారం ఉదయం 11 గంటలకు మహా కుంభాభిషేక సంప్రోక్షణ జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వర్ణ శోభిత విమాన గోపురాన్ని స్వామి వారికి అంకితం చేస్తారు అని వివరించారు. సంప్రోక్షణ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని ఆలయ ప్రధాన అర్చకులు ఈవో భాస్కరరావు కోరారు.