calender_icon.png 14 October, 2024 | 1:31 PM

బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాక బోల్తా పడ్డ లారీ

14-10-2024 11:38:58 AM

గ్రామస్తులు కోరిన పట్టించుకోని అధికారులు

బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ పనులను ఆపినా వైనం

రోడ్డు ప్రమాదాలతో బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తికాక ప్రాణాలు పోతున్నాయని పలు గ్రామాల ప్రజల ఆవేదన

ఇప్పటికి ఆరుగురు మృత్యువాత

కామారెడ్డి (విజయక్రాంతి): బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తికాక తాత్కాలికంగా వేసిన రోడ్డుతో 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఆరుగురు మృత్యువాత పడ్డారు. అయినా అధికారులు చలించడం లేదు. బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తికాక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఈ రోడ్డు వెంట వెళ్లే రామరెడ్డి, పోసానిపేట్, గిద్ద, రెడ్డిపేట్, రాధాయిపల్లి, గోకుల్ తండా, అన్నారం, మోషన్ పూర్ రాజమ్మ తండా, కన్నాపూర్, కన్నాపూర్ తండాతో పాటు నిజాంబాద్ జిల్లా పరిధిలోని తూంపల్లి, కొండాపూర్, గడుకోల్ తదితర గ్రామాల ప్రజలు నిత్యం ద్విచక్ర వాహనాలపై వేలాదిమంది వెళ్తున్నారు.

బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరైన పనులు ముందుకు సాగడం లేదు. కాంట్రాక్టర్ సగం వరకు పనులు చేసి వదిలిపెట్టారు. నిధులు ఇవ్వడం లేదని పనులు చేయడం లేదని కాంట్రాక్టర్ వాపోతున్నాడు. దీంతో ఈ ప్రాంతం నుంచి ప్రయాణించే ప్రయాణికులు నిత్యం అవస్థలు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. గతంలో ఉన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్లు గంగమ్మ బ్రిడ్జి నిర్మాణం పనులకు నిధులు మంజూరు చేయించారు. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ స్లాబ్ లెవెల్ వరకు బ్రిడ్జి నిర్మాణం పనులు జరిగిన బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్ పనులను మధ్యలో నిలిపి చేతులెత్తేశారు. స్థానిక ప్రస్తుత ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు బ్రిడ్జి నిర్మాణం పనులపై ఈ ప్రాంత ప్రజలు వివరించారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రాణాలు పోతున్నాయని చెప్పడంతో సంబంధిత రోడ్లు భవనాల శాఖ అధికారులను ఎమ్మెల్యే వెంటనే ఆదేశాలు జారీ చేశారు. పనులు పూర్తి చేయాలని కోరిన కూడా నెలరోజుల్లో పూర్తిచేస్తామని చెప్పిన అధికారులు ఆరు నెలలు అవుతున్న పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.

దీంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి లారీ లోడుతో వెళ్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు తాత్కాలికంగా వేసిన మొరపు రోడ్డు గుంతల మయం కావడంతో పెద్ద వాహనాలు వస్తే బోల్తాపడడం జరుగుతుందని రామారెడ్డి జేఏసీ నాయకులు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా పట్టించుకుని ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణం పనులను పూర్తి చేయించాలని కోరుతున్నారు. నిత్యము ప్రమాదాలు జరుగుతున్నాయని పట్టించుకోవాలని అధికారులను కోరుతున్నారు. కాంట్రాక్టర్కు బిల్లు ఇప్పించి పనులు పూర్తి చేయించాలని వారు కోరుతున్నారు. లేకుంటే వారం రోజుల వరకు వేచి చూసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని రామారెడ్డి జేఏసీ నాయకులు తెలిపారు. సుమారు 10 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారని అందరికీ ఇబ్బందులు జరుగుతున్నాయని రాత్రి వేళలో మరిన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు పూర్తి చేయించాలని కోరుతున్నారు .