ఒకరి మృతి
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): కూతురిని స్కూల్లో వదిలి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి చెందిన విషాదకర ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నాచారం పీఎస్ పరిధిలో నివాసం ఉండే విజయ్, నీతా జాన్సన్(37) దంపతుల.. కూతురు(11) రోజు మాదిరిగానే బుధవారం స్కూల్‌కి వెళ్లడానికి రెడీ అయ్యింది. అయితే కాస్త ఆలస్యం అవ్వడంతో స్కూల్ బస్సు వెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లి నీతా జాన్సన్ కూతురిని స్కూటీపై ఎక్కించుకుని స్కూల్ వద్ద వదిలి పెట్టేందుకు బయల్దేరింది.
స్కూల్లో పాపను వదిలి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో నాచారం మెయిన్ రోడ్డు హెచ్ఎంటీ నగర్ కమాన్ వద్ద గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే వాహనం స్కూటీని ఢీకొట్టిది. ఈ ప్రమాదంలో నీతా జాన్సన్ అక్కడికక్కడే మృతిచెందింది. నీతాకు కూతురితో పాటు ఒక కుమారుడు(8) ఉన్నాడు. భర్త విజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.