- రాష్ట్రవ్యాప్తంగా 12 యూనివర్సిటీలు
- మొత్తం టీచింగ్ పోస్టులు 2,857
- పాఠాలు చెప్తున్న వారు 757 మంది మాత్రమే..
- కాంట్రాక్ట్ సిబ్బందితోనే మమ అనిపిస్తున్న యాజమాన్యాలు
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): ‘యూనివర్సిటీలు భవిష్యత్తు దేశ నిర్మాతలను తయారు చేసే కార్మాగారం’ అని పెద్దలు చెప్తుంటారు. కానీ.. తెలంగాణవ్యాప్తంగా ఉన్న 12 వర్సిటీల్లో నెలకొన్న దయనీయమైన పరిస్థితులను చూస్తే వారు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారో మరి. 12 వర్సిటీల పరిధిలో 2,857 టీచింగ్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 757 మంది మాత్రమే చెప్తున్నారు.
దీన్నిబట్టి వర్సిటీలో ఏమాత్రం చదువులు వర్థిల్లుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులు, వారికి పాఠాలు చెప్పే టీచర్ల నిష్పత్తి అనేది.. ఒక దేశం విద్యాప్రమాణాలకు సూచిక. ఏఐసీటీసీ ప్రమాణాల ప్రకారం.. భారత్‌లో విద్యా ర్థులు, ప్రొఫెసర్ల నిష్పత్తి 1:10 ఉండాలి. తక్కువలో తక్కువ 1:15 అయినా ఆమోదయోగ్యం. కానీ.. తెలంగాణ పరిధిలోని ఆ నిష్పత్తి కేవలం కలలోనే సాధ్యమన్నట్లు ఉంది.
ఒక్క 2024లోనే సుమారు వంద మందికి పైగా ప్రొఫెసర్లు పదవీ విరమణ చేశారు. వారి స్థానాల్లో కొత్త నియామకాలు లేవు. ఈ ఏడాదిలో మరికొంతమంది ఆచార్యులు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో విద్యార్థుల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతున్నది. వర్సిటీల్లో కొన్ని విభాగాలకైతే కనీసం హెచ్‌వోడీలే లేరు. దీంతో యాజమాన్యాలు కాంట్రాక్ట్ ప్రొఫెసర్లతోనే తరగతులు నెట్టుకొస్తున్నాయి.
ఎటూ తేల్చని ప్రభుత్వం..
వర్సిటీల్లో రిక్రూట్‌మెంట్‌పై రాష్ట్రప్రభుత్వం ఏటూ తేల్చడం లేదనే అభిప్రా యం యూనివర్సిటీల అధికారవర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. కామన్‌బోర్డు అంశంపై నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నదని విమర్శలు వినిపిస్తు న్నాయి. వర్సిటీ పెద్దలు రిక్రూట్‌మెంట్ బాధ్యతలను తమకు అప్పగించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు.
కానీ.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. వర్సిటీల పరిధిలో మొత్తం 2,857 టీచింగ్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 2,060 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతేడాది ఈ ఖాళీల సంఖ్య 1,977 ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 2 వేలు దాటింది. వందేండ్లకు పైగా చరిత్ర ఉన్న ఉస్మానియా వర్సిటీలో మొత్తం 53 విభాగాలు ఉండగా, దాదాపు 900 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పలు విభాగాల్లో కాంట్రా క్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లే పాఠాలు చెప్పాల్సి వస్తోంది. ఆర్కియాలజీ, ఫ్రెంచ్, జర్మన్ లాంగ్వేజెస్ వంటి విభాగాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న అకడమిక్ కన్సల్టెంట్లతోనే బోధన కానిచ్చేస్తున్నారు. అలాగే 27 విభాగాలు ఉన్న కాకతీయ వర్సిటీలో కేవలం 80 మంది టీచింగ్ స్టాఫ్ మాత్రమే పాఠాలు బోధిస్తున్నారు.
పెరుగుతూనే ఉన్న కాలేజీలు
హైదరాబాద్‌లోని చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ (కోఠి ఉమెన్స్ కాలేజీ)కి 179 టీచింగ్ పోస్టులు మంజూరు చేయాలని ఇప్పటికే యజామాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ప్రస్తుతం వర్సిటీ పరిధిలో 25 మంది మాత్రమే ఫ్యాకల్టీ ఉంది. అలాగే జేఎన్టీయూకు అనుబంధంగా వనపర్తి, పాలేరు, సిరిసిల్ల, మహబూబాబాద్‌లో కొత్తగా ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. పాలమూరు వర్సిటీ పరిధి లోనూ ఇంజినీరింగ్, లా కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఆయా కాలేజీల అవసరాలకు ఇప్పుడు ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు మరో వెయ్యి వరకు కొత్త పోస్టులు ఇవ్వాల్సి ఉన్నది.