22-03-2025 01:05:45 AM
ఎల్‌ఎండీలో 7 టీఎంసీలే
కరీంనగర్, మార్చి 21 (విజయ క్రాంతి): ఈసారి తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. కరీంనగర్ నగరవాసులతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు తాగునీరందించే లోయర్ మానేరు డ్యాంలో నీటిమట్టం తగ్గడం ఆందోళన కలిగిస్తున్నది. కాకతీయ కాలువ ద్వారా వరంగల్, నల్గొండ జిల్లాలకు రోజు 5 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తుండడంతో ఎల్‌ఎండీలో నీటిమట్టం ఏప్రిల్ నెలలోనే డెడ్ స్టోరేజీకి చేరుకునే ప్రమాదం ఏర్పడింది.
వరంగల్, నల్గొండకు చెందిన రాష్ట్ర మంత్రు లు నీటి పారుదల శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి 5 వేల క్యూసెక్కులను సాగునీరు, తాగునీటి అవసరాల కోసం తరలించుకుపోతున్నారు. ఈసారి భూగర్భ జలాలు అడు గంటడంతోపాటు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో తాగునీటి కోసం తండ్లాడే పరిస్థితి రానుంది. ఎల్‌ఎండీ పూర్తిస్థాయి నీటిమట్టం 24.074 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.750 టీఎంసీల నీరు ఉంది.
ప్రస్తుతం ఎల్‌ఎండీకి మిడ్ మానేరు నుంచి 2500 క్యూసెక్కుల నీరు చేరుకుంటుండగా, అవుట్ ఫ్లో ద్వారా కాకతీయ కెనాల్ కు 5 వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 285 క్యూసెక్కులు, మొత్తంగా 5285 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిడ్ మానేరు నీటిమట్టం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10 టీఎంసీలకు చేరుకుంది. ఇన్ఫ్లో బిల్వే ద్వారా కేవలం 231 క్యూసెక్కులే. వరద కాలువ ద్వారా చుక్కనీరు రావడం లేదు.
అవుట్ ఫ్లో ఎల్‌ఎండికి వదులుతున్న 2500 క్యూసెక్కులు, మూలవాగుకు 231 క్యూసెక్కులు, మిషన్ భగీరథతోపాటు ఆర్‌ఎంసీ కెనాల్ కు 650 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎల్‌ఎండి నుండి కాకతీయ కెనాల్ కు యాసంగి పంట కోసం మార్చి 31 వరకు నీటిని వదలనున్నారు. 31 తర్వాత ఎల్‌ఎండీనీటిమట్టం 5 నుంచి 6 టీఎంసీలకు పడిపోనుంది.
ఎల్‌ఎండీలో సిల్ట్ ఎక్కువగా ఉండడంతో 4 టీఎంసీలు ఉన్నా నగర ప్రజలకు తాగునీరు అందడం కష్టమే. గత ప్రభుత్వం ఎల్‌ఎండీలో మిషన్ భగీరథ, నగర ప్రజలకు తాగునీటి అవసరాల కోసం 12 టీఎంసీల స్టోరేజీ ఉండాలని జీవో జారీ చేసింది. అయితే ప్రస్తుతం వరద కాలువ, ఎల్లంపల్లిల నుండినీటి విడుదల చేయకపోవడంతో ఆ జీవో తుంగలో తొక్కి ఎల్‌ఎండీని ఖాళీ చేస్తున్నారు. దీంతో నీటి ఎద్దడి ముంచుకు వస్తే పరిస్థితి ఉన్నది.