calender_icon.png 27 September, 2024 | 6:56 AM

ఏకాకిగా హెజ్బొల్లా చీఫ్

27-09-2024 01:00:12 AM

  1. నంబర్ 2 వరకు ఏరేసిన ఇజ్రాయెల్
  2. కీలక నేతలు లేకపోవడంతో కొత్త ప్లాన్
  3. లెబనాన్‌లో భూతల దాడులకు సిద్ధమైన యూదు దేశం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్‌లోని స్థావరాలపై గత వారం రోజులుగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ జరి పిన దాడుల్లో ఇప్పటివరకు 600 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా సుమారు 5 లక్షల మంది నిరాశ్రయులైనారు. లెబనాన్‌లో గ్యారేజీల్లో ఎవరూ రాకెట్లను దాచినా వారికి ఇల్లు ఉండదని నెతన్యాహు హెచ్చరించారు. లెబనాన్‌లో భూతల దాడికి సిద్ధం కావాలని ఇజ్రాయెల్ సైనికాధిపతి సైతం ఆదేశాలు జారీ చేశారు. వారంరోజులుగా ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గు రు అగ్రనేతలను హెజ్బొల్లా కోల్పోయింది. టాప్ కమాండర్లందరినీ ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ప్రస్తుతం ఉన్నత నాయకుల్లో సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా మాత్రమే మిగిలారు.

కీలక నేతల హతం

ఇటీవల ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో సెప్టెంబర్ 24న హెజ్బొల్లా మిస్సైల్ విభాగం చీఫ్ ఇబ్రహీం ఖుబైసీ, అంతకుముందు రోజు జీహాదీ కౌన్సిల్ సభ్యుడు అలీ కరాకీ హతమయ్యాడు. హెజ్బొల్లా కార్యకలాపాలను పర్యవేక్షించే ఇబ్రహీం అకిల్ సెప్టెంబర్ 20న మృతిచెందాడు. రెండు నెలల క్రితం సంస్థ సీనియర్ కమాండర్లలో ఒకరైన ఫువాద్ షుక్ హత్య హెజ్బొల్లాకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. సంస్థలో కీలకంగా వ్యవహరించే నేతల మరణంతో ప్రస్తుత కఠిన సమయంలో హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా జాగ్రత్తగా వ్యవహరించాల్సి అవసరముంటుంది. ఇరాన్ నుంచి మద్దతు ఉన్నప్పటికీ ప్రస్తుతం అతను ఒంటరిగానే మిగిలాడు. బలమైన సంస్థాగత నిర్మాణం, సవాళ్లను స్వీకరించే సామర్థ్యం కారణంగా హెజ్బొల్లా మనుగడ సాగించగలిగింది. కానీ, తక్కువ వ్యవధిలో ఇంతమంది అగ్రనేతల మరణంతో సంస్థ తక్షణ భవిష్యత్తు ప్రశ్నాకర్థంగా మారింది. ఇప్పటివరకు మరణించిన నేతలంతా షియా సంస్థకు కీలకమైన వ్యక్తులుగా పేర్కొంటారు. 

ఇబ్రహీం ఖుబైసీ: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఖుబైసీ మరణించినట్లు హెజ్బొల్లా ధ్రువీకరించింది. ఇతను హెజ్బొల్లా రాకెట్, మిస్సైల్ విభాగానికి చీఫ్‌గా వ్యవహరించాడు. 1980లో ఖుబైసీ సంస్థలో చేరి అనేక కీలక పదవులను నిర్వహించాడు. 2000లో ఇజ్రాయెల్ సైనికుల మరణానికి కారణమైన మౌంట్ డోవ్ కిడ్నాప్‌కు ఖుబైసీ ప్రధాన సూత్రధారి. 

అలీ కరాకీ: హెజ్బొల్లా దక్షిణ ఫ్రంట్ కమాండర్ అలీ కరాకీ సైతం వైమానిక దాడిలోనే మృతిచెందాడు. జిహాద్ కౌన్సిల్‌తో పాటు అగ్ర సైనిక విభాగం సభ్యుడు. కానీ, కరాకీ చనిపోయినట్లు హెజ్బొల్లా ధ్రువీకరించలేదు. ఒకవేళ కరాకీ మరణం నిజమైతే సంస్థ దళాల నిర్వహణకు పెద్ద దెబ్బ తగిలినట్లేనని నిపుణులు చెబుతున్నారు. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ భూతల దాడులకు వ్యతిరేకంగా అతని దళాలు మొదటి రక్షణ శ్రేణిగా పనిచేస్తాయని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. 

ఇబ్రహీం అకిల్: లెబనాన్‌లో పేజర్ దాడులు జరిగిన కొద్ది రోజులకే ఇబ్రహీం అకిల్‌ను ఇజ్రాయెల్ చంపేసింది. హెజ్బొల్లా ఎలైట్ రద్వాన్ ఫోర్స్‌లో అకిల్ సీనియర్ నాయకుడు.  1980లలో హెజ్బొల్లాలో చేరిన అకిల్.. ఫువాద్ షుక్ తర్వాత రెండో కీలక కమాండర్‌గా కొనసాగారు. 1983లో బీరుట్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడిలో అతని పాత్ర ఉందని యూఎస్ ఆరోపించింది. అకిల్‌పై 70 లక్షల డాలర్ల రివార్డ్‌ను యూఎస్ ప్రకటించింది. 

ఫువాద్ షుక్:్ర ఇతను చీఫ్ నస్రల్లాకు కుడి భుజంగా వ్యవహరించాడు. జూలైలో షుక్‌న్రు చంపేశారు. 1982లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన సమయంలో హెజ్బొల్లా వ్యవస్థాపక సభ్యుల్లో షుక్ ఒకడు. 

ఏకాకిగా నస్రల్లా

హెజ్బొల్లాకు ఇరాన్ అన్ని రకాలుగా మద్దతునిస్తున్నా హెజ్బొల్లా మనుగడపై అనుమా నాలు నెలకొన్నాయి. సంస్థ టాప్ కమాండర్లలో నస్రల్లా మాత్రమే మిగిలారు. ఈ సమ యంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ మాట్లాడుతూ.. ౨౦ ఏళ్లుగా హెజ్బొల్లా నిర్మించిన మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు నస్రల్లా ఒంటరిగా ఉన్నాడని, రద్వాన్ బలగాలు మొత్తం నిర్వీర్యం అయిపోయాని చెప్పారు. ప్రస్తుతం హెజ్బొల్లా అన్ని కార్యకలాపాలను నస్రల్లానే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో దాడి చేస్తే హెజ్బొల్లా ఇక ఎప్పటికీ కోలుకోలేదని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇప్పటివరకు వాయుమార్గంలోనే హెజ్బొల్లాపై దాడి చేసిన ఇజ్రాయెల్.. భూమార్గంలోనూ అటాక్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఏదేమైనప్పటికీ హెజ్బొల్లాను పూర్తిస్థాయిలో అంతం చేయడం సాధ్యపడదని విశ్లేషకులు భావిస్తున్నారు.