30-04-2025 12:00:00 AM
సంగారెడ్డి, ఏప్రిల్ 29(విజయక్రాంతి) : గత పది నెలల నుండి పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీల బిల్లులను వెంటనే విడుదల చేయాలని పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సందిల బలరాం ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఆయన ‘విజయక్రాంతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
గత సంవత్సరన్నర కాలం నుండి గ్రామాల్లో సర్పంచులు లేకపోయినా పంచాయతీ కార్యదర్శులు అన్ని తానై నడిపిస్తూ గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం జరుగుతుం దని, అవే కాకుండా ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజా పాలన దరఖాస్తులు, వాటి ఆన్లైన్ ఎంట్రీ, మిషన్ భగీరథ సర్వే, సమగ్ర కుల గణన సర్వే మరియు ఆన్లైన్ ఎంట్రీ, ఇందిరమ్మ ఇల్లుల కోసం ఇంటింటి సర్వే, ఎల్‌ఆర్‌ఎస్ సర్వే, రేషన్ కార్డుల సర్వే, రాజీవ్ యువ వికాసం సర్వే, ఇలా రక రకాల పనిభారాలు మోస్తూ గత సంవత్సరం కాలం నుండి గ్రామ పంచాయతీలకు ఎలాంటి నిధులు విడుదల చేయకపోయినను గ్రామ ప్రజలకు తాగునీటికీ ఇబ్బందు లు రాకుండా చూస్తున్నారని వాపోయారు.
తన సొంత పూచికత్తుపై కార్యదర్శులు వివి ధ రకాల వ్యాపార సంస్థల నుండి గ్రామ పంచాయతీలకు అవసరమైన బల్బులు, తాగునీటి సరఫరా సామాను, డీజిల్ ఉద్దరకు తీసుకోవటం జరిగిందని, ఉద్దెర ఇవ్వని సందర్భంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కార్యదర్శులు తమ సొంత జేబుల నుండి డబ్బులు పెట్టుకోవడం జరుగుతుందన్నారు.
పెండింగ్ బిల్లులు విడుదల కాకపోతే పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలు భవిష్యత్తులో ఆర్థికంగా చితికి పోయే ప్రమాదం ఉందని, వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు.
నిధులపై స్పందించని మంత్రి...
పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో పారిశుధ్య నిర్వహణ పై మంత్రి సీతక్క రివ్యూ నిర్వహించి చెత్త సేకరణ కొరకు కొత్త యాప్ ను తీసుకువస్తామని చెప్పడం జరిగినదని తెలిపారు. ప్రస్తుతం చెత్త సేకరణ చేసే ట్రాక్టర్లను నడపడానికి డీజిల్ కు కూడా నిధులు లేని పరిస్థితులలో ఇది ఎలా సాధ్యం అవుతుందని అధికారులే చెప్పాలని, కనీసం గ్రామాలలో నిధుల గురించి మంత్రి అధికారులకు వివరించకపోవడం చాలా శోచనీయ మన్నారు.
చాలా రకాల ప్రభుత్వ యాప్లను వినియోగించడం వల్ల మొబైల్ ఫోన్లు పనిచేయడం లేదని, అలాగే కుటుంబ సభ్యులకు సమయం కూడా కేటాయించలేని దుస్థితిలో కార్యదర్శులు కొట్టుమిట్టాడుతున్నారని వాపోయారు.