- మహాలక్ష్మితో ఉపాధి కరువు ఓలా, ఉబర్, ర్యాపిడోతో మరిన్ని కష్టాలు
- ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.12వేలు లేవు
- సింగిల్ పర్మిట్ విధానమూ నెరవేరలేదు
- ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్న ఆటో డ్రైవర్లు
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): ఎన్నికలకు ముందు వివిధ వర్గాలకు ఇచ్చినట్లుగానే రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు కూడా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. అన్నివర్గాల మాదరిగానే ఆటో డ్రైవర్లు సైతం కాంగ్రెస్ గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక తమ సమస్యలు తీరుతాయని భావించిన ఆటో డ్రైవర్ల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయ్యింది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆటోడ్రైవర్ల కోసం ఏమీ చేయకపోయినా కనీసం మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అనే సౌకర్యం ఇవ్వనందున ఆటోలను నడిపి ఉపాధి పొందేందుకు అవకాశాలు ఉండేవి. కానీ మహిళలకు ఉచిత బస్సును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సర్కారు... ఆటో డ్రైవర్లకు మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకురాలేదు. దీంతో ప్రయాణాలకు ఆటోలను ఎక్కువగా ఆశ్రయించే మహిళలు దాదాపుగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వైపే మొగ్గు చూపారు.
ఫలితంగా ఆటో డ్రైవర్లకు గిరాకీలు లేక ఉపాధి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. పైపెచ్చు ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి టూ వీలర్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం వల్ల మరిన్ని కష్టాలు పెరిగాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సర్కారును ఎన్నిసార్లు ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. తమ సమస్యల పరిష్కారం కోసం బిక్షాటన చేసి నిరసన తెలిపినా సర్కారు స్పందించలేదు.
ఉపాధి అవకాశాలు కరువై ఇప్పటికే 57 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఆటో యూనియన్ల నాయకులు వాపోతున్నారు. సర్కారు స్పందించే పరిస్థితి కనిపించకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఆటో డ్రైవర్లు సిద్ధమవుతున్నారు.
కష్టాలు ఆరంభం..
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, అనేక హామీలతో ఎన్నికలకు వెళ్లింది. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంది. ఈ పథకాన్ని తీసుకువస్తామంటేనే ఆటో డ్రైవర్ల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన సర్కారు... ఆటోడ్రైవర్ల సంక్షేమం కోసం ఏడాది రూ.12వేల ఆర్థిక సాయం సహా మరో అయిదు హామీలను ఇచ్చింది. ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు తమ ఆటోలు ఎక్కకపోయినా సర్కారు ఆదుకుంటుందిలే అనే ఉద్దేశంతో కార్మికులు దీనిపై పెద్దగా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు.
ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది, కానీ ఆటో డ్రైవర్ల సంక్షేమం అనేది హామీగానే మిగిలిపోయింది. దీంతో అనేకమంది డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయి కుటుంబాలను పోషించుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆటో యూనియన్లన్నీ ఐక్యంగా ఏర్పడి ప్రభుత్వం దృష్టికి పలుమార్లు సమస్యలను తీసుకుపోయినా అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లదీశారు తప్పించి ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు.
దీంతో డిసెంబర్ 12న మొదటి సారిగా ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. ఈ ఏడాది జనవరి 7న భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. గత నెల 5న ఇందిరా పార్క్ వద్ద ఆటో యూనియన్లు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కేటీఆర్ సైతం పాల్గొన్నారు. నవంబర్ 16న మరోసారి రాష్ట్ర రాజధానిలో బిక్షాటన చేసి తమ సమస్యను ప్రజలందరికీ తెలిసేలా చేశారు. ఆటో సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరిపినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని ఆటోడ్రైవర్లు చెబుతున్నారు.
ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు
* ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ. 12వేల ఆర్థిక సాయం
* రవాణా వాహనాలపై సింగిల్ పర్మిట్ విధానం
* ఫిట్‌నెస్ చలానాలను ఏడాదికోసారి సమీక్షించి సవరించండం
* సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పించడం
* ప్రతి పట్టణంలో ఆటోనగర్ ఏర్పాటు
* పెండింగ్ ట్రాఫిక్ చలానాలకు 50శాతం రాయితీ ఆటో డ్రైవర్ల డిమాండ్లు..
* ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేల ఆర్థిక సాయాన్ని అందించాలి
* ఓలా, ఉబర్, ర్యాపిడో, యారీల అక్రమ వ్యాపారాన్ని నిషేధించాలి
* మహాలక్ష్మి పథకంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి
* జీహెచ్‌ఎంసీలో ఆటో మీటర్ కనీసం రూ. 40గా మార్చాలి.
* ఆత్మహత్యలు చేసుకున్న డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలి.
* ఆటో, ప్రైవేటు కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి.
* ఆర్టీఏ కార్యాలయాల వద్ద బ్రోకర్ల వ్యవస్థను అరికట్టి ఆర్థిక భారాన్ని తగ్గించాలి
* ఆటోలకు సింగిల్ స్టేట్ పర్మిట్ విధానం తీసుకురావాలి
సీఎం ఇంటిని ముట్టడిస్తాం
మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయి. ఎలాంటి ట్యాక్సులు చెల్లించకుండా ఓన్ ప్లేట్‌తో నడిచే ఓలా, ఉబర్, ర్యాపిడో, యారీ తదితర బైక్స్ వల్ల మాకు గిరాకీలే లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా 5.50 లక్షల ఆటోలుంటే అందులో హైదరాబాద్ నగరంలోనే 1.60 లక్షల ఆటోలున్నాయి. ట్రాన్స్‌పోర్ట్ వాహనాల (ఆటోల నుంచి బస్సుల వరకు) ద్వారా ప్రభుత్వానికి ఏటా ట్యాక్సుల రూపేణా రూ. 3,500 కోట్ల వరకు వస్తుంది.
కానీ అనుమతి లేని యాప్ బేస్డ్ బైక్స్ వల్ల రూపాయి ఆదాయం రాదు. ఆటోలపై ఆధారపడి సుమారు 7 లక్షల డ్రైవర్లు జీవిస్తున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి దయనీయంగా మారింది. హామీ ఇచ్చినట్లుగా మా సమస్యలు నెరవేర్చకుంటే వేలాది ఆటోలతో సీఎం ఇంటిని ముట్టడిస్తాం.
అల్లూరి రవిశంకర్, జాతీయ ప్రధాన కార్యదర్శి, భారతీయ ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్