calender_icon.png 10 January, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రో రెండో దశకు లైన్ క్లియర్

03-11-2024 02:30:36 AM

  1. రూ. 24,269 కోట్లతో.. 5 కారిడార్లలో.. 76.4 కి.మీ మేర నిర్మాణం
  2. పార్ట్ బి కింద ఫోర్త్ సిటీకి మరో 40 కి.మీ మేర సర్వే 

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. రెండో దశ మెట్రో నిర్మాణానికి సర్కారు శనివారం పరిపాలన అనుమతులను జారీచేసింది. దీనిపై జీవో నం ౧౯౬ విడుదల చేసింది.

రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్ర- రాష్ర్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు పీపీపీ విధానంలో మెట్రో రెండో దశ పనులు జరగబోతున్నాయి. మెట్రో రెండో దశకు అంచనా వ్యయం రూ. 24,269 కోట్లు కాగా...

ఇందులో రాష్ర్ట ప్రభుత్వం వాటా (30 శాతం) రూ. 7313 కోట్లు, కేంద్రం వాటా (18 శాతం) రూ. 4230 కోట్లు. మిగిలిన 52 శాతం నిధులను రుణాలతో పాటు పీపీపీ విధానంలో సమకూర్చుతారు. ఇందులో పీపీపీ వాటా 4 శాతం అంటే రూ. 1033 కోట్లు. రుణాలు రూ. 11693 కోట్లు (48శాతం). హైదరాబాద్ మెట్రో మొద టి దశలో మూడు కారిడార్లలో కలుపుకుని మొత్తం 69 కి.మీ మేర నిర్మాణం జరిగింది.

మియాపూర్- ఎల్బీనగర్, రాయదుర్గం- నాగోల్, ఎంజీబీఎస్- జేబీఎస్ మార్గంలో తొలి దశ మెట్రో నిర్మాణానికి మొదటి దశ ప్రాజెక్టుకు రూ. 22 వేల కోట్లు ఖర్చు అయ్యింది. హైదరాబాద్ మెట్రో ద్వారా ప్రస్తుతం రోజుకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రెండో దశ కూడా అందుబాటులోకి వస్తే రోజుకు మరో 8 లక్షల మంది మెట్రోలో ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రెండో దశలోనే పార్ట్ బి కింద శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ) వరకు 40 కి.మీ మేర తొమ్మిదో కారిడార్ నిర్మించేందుకు సర్వే కొనసాగుతోందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ మార్గాన్ని కూడా కలుపుకుంటే మెట్రో రెండో దశలో మొత్తం 116.4 కి.మీకు చేరనుంది.

రెండో దశలో 5 కారిడార్లలో నిర్మాణ పనులు జరుగుతాయి. కాగా.. మొదటి దశలో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా ఫలక్‌నుమా వరకు కారిడార్ నిర్మించాల్సిన గుత్తేదారు కేవలం ఎంజీబీఎస్ వరకు మాత్రమే పనులు చేశారు. దీనిపై ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. 

రెండో దశలో ప్రతిపాదించిన 5 కొత్త కారిడార్లు

కారిడార్ నంబర్ మార్గం దూరం(కి.మీ)

నాలుగు నాగోల్- శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 36.8  

ఐదు రాయదుర్గ్ నుంచి కోకాపేట్ నియోపోలీస్ వరకు 11.6  

ఆరు ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు 7.5  

ఏడు మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు 13.4  

ఎనిమిది ఎల్ బీ నగర్ నుంచి హయత్‌నగర్ వరకు 7.1  

తొమ్మిది శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ వరకు 40