calender_icon.png 23 October, 2024 | 4:44 AM

‘ఆయుష్మాన్ భారత్’ పరిమితి రెట్టింపు!

09-07-2024 12:05:00 AM

న్యూఢిల్లీ: భారతీయులందరికీ వైద్య చికిత్స అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ’ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా’ పథకం కింద కవరేజీ మొత్తం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నెల 23న 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై)  ‘ఆయుష్మాన్ భారత్’ స్కీంపై నిర్మలా సీతారామన్ భారీ ప్రకటన చేయనున్నారు. ఇప్పటి వరకు ఆయుష్మాన్ భారత్ కింద చేరిన భారత పౌరులకు రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా వర్తిస్తోంది. ఈ పరిమితిని  ఏటా రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.

అలాగే కేంద్రం తన ఫ్లాగ్ షిప్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం లబ్ధిదారులను వచ్చే మూడేండ్లలో రెట్టింపు చేయాలని కేంద్రం భావిస్తున్నదని అధికార వర్గాల కథనం. ‘ఆయుష్మాన్ భారత్’ కింద ఆరోగ్య బీమా కవరేజీ పెంచడం వల్ల మూడింట రెండొంతుల మంది పౌరులకు లబ్ధి చేకూరనున్నదని తెలుస్తున్నది. కరోనా తర్వాత వైద్య చికిత్స భారంగా మారిన నేపథ్యంలో మధ్య తరగతి వర్గాల ప్రజలకు ప్రస్తుత ఆయుష్మాన్ భారత్ కవరేజీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.

పేదలు, నిస్సహాయ కుటుంబాలకు నాణ్యమైన వైద్య చికిత్స లభిస్తుందని చెబుతున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులు, భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ చేయూతనిస్తుందని భావిస్తున్నారు. 70 ఏండ్లు దాటిన వృద్ధులందరినీ ’ఆయుష్మాన్ భారత్’ పరిధిలోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. ఒకవేళ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య బీమా కవరేజీ రూ.10 లక్షలకు పెంచితే, ప్రభుత్వ ఖజానాపై రూ.12,076 కోట్ల భారం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. 

2018లో ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.5 లక్షల బీమా కవరేజీ పథకాన్ని ప్రారంభించారు. దీనివల్ల 12 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు. తాజాగా 70 ఏండ్లు దాటిన వృద్ధులకు ఉచిత వైద్య చికిత్స కల్పించడంతోపాటు బీమా కవరేజీ రెట్టింపు చేయడం వల్ల క్యాన్సర్, అవయవాల మార్పిడి వంటి ఖర్చుతో కూడుకున్న వైద్య చికిత్స పేదలకు ఉచితంగా లభిస్తుందని భావిస్తున్నారు. 70 ఏండ్లు దాటిన వారికి అవకాశం ఇవ్వడం వల్ల కొత్తగా సుమారు 4-5 కోట్ల మందికి లబ్ధి చేకూరనున్నది.