calender_icon.png 29 January, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల కళ్లల్లో వెలుగులు

27-01-2025 01:02:27 AM

  • రైతు భరోసాతో అన్నదాతల్లో ఆనందం
  • ఫలించిన రేషన్‌కార్డు కోసం ఎదురుచూపులు
  • సీఎం రేవంత్‌రెడ్డి రిపబ్లిక్ డే సందేశం

హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): ప్రజలందరి ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ఆదివారం ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

పదేండ్లుగా రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారి ఎదురుచూపులు ఫలించాయని ఆనందం వ్యక్తం చేశారు. రైతు కూలీలకు దండుగా నిలిచేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. 2004 నుంచి 2014 వరకు ఆకాశమే హద్దుగా ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చుకున్నామని.. మళ్లీ పదేళ్ల తర్వాత ఇప్పుడు పేదల కళ్లల్లో వెలుగు చూసేందుకు ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సంక్షేమం కోసం నాలుగు నూతన పథకాలను ప్రవేశపెట్టామన్నారు. “మీ రేవంత్ అన్నగా మీ ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ సీఎంగా 13 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఒకటొకటిగా అమలు చేస్తూ, ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది” అన్నారు.

ప్రజాపాలనలో రైతుభరోసా, నిరుద్యోగ సమస్య పరిష్కారం, వరికి బోనస్ ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసుకున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500 సిలిండర్‌లను ఆడబిడ్డలకు అందిస్తూ వారి ఆకాంక్షలు నెరవేర్చుందుకు అడుగులు వేస్తున్నామన్నారు.