calender_icon.png 29 October, 2024 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల కమిటీల జీవో చెల్లదు

29-10-2024 01:58:23 AM

  1. గ్రామ సభల అనుమతి లేకుండా ఎంపికలా?
  2. పలు పిటిషన్లపై హైకోర్టులో వాదనలు 
  3. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి ఆదేశం 

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): గ్రామ సభల అనుమతి లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఇచ్చిన జీవో 33ను రద్దు చేయాలంటూ హైకోర్టులో వాదనలు జరిగాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఏర్పాటుకు జీవో జారీ చేసిందంటూ నిర్మల్ ఎమ్మెల్యే ఏ మహేశ్వర్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం కొత్తపల్లికి చెందిన నితీశ్, పచ్చలనడికుడికి చెందిన మరొకరు పిటిషన్లు వేశారు. వీటిపై జస్టిస్ భీమపాక నగేశ్ సోమవారం మరోసారి విచారించారు.

గ్రామ పంచాయతీల ఆమోదం, అధికారుల ప్రమేయం, గ్రామసభతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక చేయడం అన్యాయమని పిటిషనర్ల వాదన. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కూడా ఇదే తరహాలో అధికారులతో ప్రమేయం లేకుండా గృహాల లబ్ధిదారుల ఎంపికకు జారీ చేసిన జీవోలు 10, 12ను ఇదే హైకోర్టు డిస్మిస్ చేసిందని గుర్తుచేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా గ్రామ స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు కమిటీలు వేసిందని, వీటికి గ్రామసభలు, వార్డు కమిటీల నుంచి అనుమతి లేదని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఏర్పాటుకు వీలుగా రోడ్లు, రవాణా, భవన నిర్మాణాల శాఖ కార్యదర్శి ఈ నెల 11న జారీ చేసిన జీవో 33ను సస్పెండ్ చేయాలని కోరారు. 

చట్ట వ్యతిరేకంగా ప్రకటించండి

గ్రామసభలు, వార్డు కమిటీల ప్రస్తావన లేకుండా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం చేపట్టడాన్ని చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని పిటిషనర్లు కోరారు. గ్రామ పంచాయతీ వార్డు స్థాయి, మున్సిపల్ వార్డు స్థాయిలో ప్రజాభిప్రాయం మేరకు కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు.

జీవో 33 ప్రకారం సంబంధిత ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులను నియమిస్తారని, ఇది చట్ట వ్యతిరేకమని చెప్పారు. ప్రజాహిత కార్యక్రమాలకు గ్రామసభల అనుమతి విధిగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కమిటీలు అధికార పార్టీకి చెందిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేసే అవకాశం ఉందన్నారు.

ఇదే జరిగితే నిజమైన నిరుపేదలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగంలోని 73వ రాజ్యాంగ సవరణ, రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018 నిబంధనలకు ఇది వ్యతిరేకమని పేర్కొన్నారు. వాదనల తర్వాత హైకోర్టు.. గతంలో జీవోలను ఇదే న్యాయస్థానం రద్దు చేసిందని, ఇప్పుడు అదే తరహాలో జీవో ఉందని అభిప్రాయపడింది.

విచారణను వాయిదా వేసింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 468 డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లను నిర్మించకుండా, లబ్ధిదారులకు వాటిని అందజేయకపోవడంపై దాఖలైన పిల్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణను వాయిదా వేసింది. ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.