ముత్తరాచ (ముదిరాజు) కుల పురాణాన్ని ప్రచారం చేస్తూ జీవిస్తున్న ఆశ్రిత గాయకులను ‘కాకి పడగలోళ్లు’ అంటారు. వీరు ప్రధానంగా ‘పాండవుల కథ’ను ప్రచారం చేస్తారు. కనుక, వీరిని ‘పాండవుల వాళ్ళు’ అనికూడా అంటారు. కాకి బొమ్మగల ధ్వజాన్ని వీరు కలిగిఉంటారు. వీరు ముదిరాజు, ముత్తరాజు, తెనుగు, దండు, బంటు, కావలిగార్ అనే తెగలవారిని వినోదిం పచేస్తారు. ‘మహాభారతం’లో ముదిరాజు పుట్టుక మొదలైనట్లు చిత్రపటా లను ప్రదర్శిస్తూ కథలు చెప్పి జీవిస్తారు. ముదిరాజుల పుట్టుక యయాతి మహారాజు నుండి మొదలై అతని వంశంలో ఉదయించిన పాండవుల వనవాస కథనం, లక్క ఇంటి దహనం, హిడింబాసుర వధ, బకాసుర వధ, మత్స్య యంత్రం, మాయా జూదం, శశిరేఖ సుభద్ర కళ్యాణం, కర్ణ కళ్యాణం, రామర్షివనం, కీచక వధ, ద్రౌపది వస్త్రాపహరణం మొదలైన ఘ ట్టాలను అమృతపానంలా చెబుతారు. కురుక్షేత్ర సన్నివేశంలో భీముని పరాక్రమాన్ని సాక్షాత్కరింప చేసేలా వర్ణిస్తారు.
ప్రదర్శనా పద్ధతి:
కాకి పడగల వారు (పాండవులోళ్లు) ముదిరాజుల ఇండ్లకు వెళ్ళి ఆ కులపెద్దతో మాట్లాడి, ‘మేము మీ గ్రామం లో కాకి పడగల పటాల్ని ప్రదర్శిస్తామని, మీకు వీలున్న రోజు మా కథనానికి రావాల్సిందని, ఆ రోజు గ్రామంలోని ముదిరాజు కులస్తులందరూ ఉండాలని’ విజ్ఞప్తి చేస్తారు. ఉదయం భోజనాలు అయ్యాక, ఆ కులపెద్ద ఇంటిముందు లేదా ఓ విశాల ప్రదేశంలో పటాన్ని రెండు కర్రలకు వ్రేలాడదీసి సినిమా రీలులా గుంజుతూ, బొమ్మ లు చూపుతూ కథను ప్రదర్శిస్తారు. ఇందులో ప్రధాన కథకుడు తెల్ల లాల్చి వేసుకొని, ధోవతి కట్టుకొని, నెత్తికి రుమాలు ధరించి, చేతిలో వెండికట్లుగల చూపుడు కర్రను పట్టుకొని పటాన్ని చూపిస్తూ కథను నడిపిస్తుంటాడు.
ఇతనికి సందర్భానికి తగినట్లుగా అభినయించటానికి సహ కథకుడు ఉంటాడు. వీరిద్దరూ తమ కాళ్లకు గజ్జెలు ధరిస్తారు. సహ కథకుడు చేతిలో నెమలి కట్టు పట్టుకొని పటాన్ని తడుముతూ ఉం టాడు. అతడు ప్రధాన కథకునికి హాస్య, పిట్టకథలు చెప్పి నవ్విస్తుంటాడు. వీరేకాక మరో ముగ్గురు ఉంటారు. ఒకరు హార్మోనియం, ఇంకొకరు మద్దెల, మరొకరు తాళం వాయిస్తారు. ఆశువుగా సంద ర్భానికి తగినట్లు లయ, దరువుకు ఒదిగేట్లు పాటలు పాడతారు. వీరు తమ తలవెంట్రుకలు వెనక్కి కట్టుకుంటారు.
కథనం:
జంపన్న అనే ముత్తరాసు కులస్తుడు కొర్రలు, దోసపాదులు, దుంపలు, ఆలుగడ్డలు మొదలైన అడవిపంటలు వేసి, కాపు కొచ్చాక ఒకరోజు తన కుమారుడు దుగ్గన్నను పిలిచి, “నాయనా! పాండవులు ఈ దారిన వస్తారు. వారు వచ్చేవరకు ఈ పంట కాపు చెయ్యి. పంటను ముట్టుకోవద్దు, కోయవద్దు, ఎంగిలి చేయవద్దు” అని హెచ్చరించి వెళతాడు. దుగ్గన్న పాండవుల కోసం చూసిచూసి ఎంతకూ రాకపోయేసరికి అయిదు రాళ్ళు తెచ్చి అక్కడ పెట్టి, నీళ్ళు ఆరగింపు చేసి దోసపండ్లు తింటాడు. పాండవుల కోసం పంటను కాపాడినంత వరకు పంటని ముట్టుకోని పక్షులు, జంతువులు దుగ్గన్న పంటను ఎంగిలి చేయగానే పంట పొలం పైబడి పంటను నాశనం చేస్తాయి. జంపన్న వచ్చి, “ఒరే దుగ్గన్నా! పంట అంతా పాడైంది. ఎంగిలి చేసినావురా?” అని అడుగుతాడు. దుగ్గన్న ‘చేయలేదని’ అబద్ధమాడతాడు. నోరు తెరచి చూపించమనగానే నోరు తెరుస్తాడు.
పళ్ల సందులలో దోసకాయ ముక్కలు కనిపిస్తాయి. కోపంతో జంపన్న గొడ్డలితో కొడుకుని నరికి బొంద పెడతాడు. పాండవులు దీనులై రాజ్యాన్ని కోల్పోయి వస్తున్నారని తమ వంశస్థులను ఆదరించాలనేది అతని తపన. కానీ, కుమారుడు దుగ్గన్న చేసిన పనివల్ల ఆ పంటలను పక్షులు, జంతువులు తింటూ ఉంటాయి. జంపన్న పాండవులను స్మరించుకోగానే అవి తినడం ఆపి వేస్తాయి. ఇంతలో పాండవులకు మొత్తం ఆరు విస్తర్లు వేస్తాడు. కాళ్లు కడుక్కొని వచ్చిన ధర్మరాజు, ఏడో విస్తరు తన పక్కన వేయమంటాడు. జంపన్న ఏడు విస్తర్లలో తన పంటనంతా వడ్డించిన తరువాత ధర్మరాజు, “దుగ్గన్నా రారా!” అని పిలువగానే దుగ్గన్న బతికి వస్తాడు. పాండవులు ఆహారం భుజించి వెళుతూ, జంపన్నకు అష్ట ఐశ్వర్యాలు కలగాలని దీ వించి ‘రామర్షివనం’ వెళతా రు. వెళ్తూ జంపన్నతో, “జంపన్నా! ఈ దారిన ద్రౌపది వస్తుంది.
ఆమెను అదరించి మేము వెళ్ళిన దారి జాడ తెలుపు” అని చెప్పి వెళతారు. పాండవులు వెళ్ళిన కొద్ది రోజులకు ద్రౌపది ఆ దారిన వస్తుంది. జంపన్న, అతని భార్య ధర్మరాజు దీవెనలతో వచ్చిన ఐశ్వర్యంతో కళ్ళకు అహం కమ్మి, ద్రౌపదిని ఒక శక్తిగా భావించి ఒక పెద్ద అగ్నిగుండం తయారు చేసి ఉంచుతారు. ఆ దారినుండి వచ్చిన ద్రౌపది, పాండవుల జాడ అడుగగానే జంపన్న “పాండవులు అయిదుగురు ఈ అగ్నిగుండంలో పడి ఆహుతి అయ్యారని” చెబుతాడు. ద్రౌపది వెంటనే తన దివ్యజ్ఞాన దృష్టితో తిలకించి, జంపన్న మోసగాడని గ్రహించి “ఒరే జంపన్నా! నేను ఎలాగైతే నా భర్తలకోసం చెట్లు పుట్టలు పట్టుకొని తిరుగుతున్నానో అలాగే నీ భార్యకూడా పండ్లో పండ్లో అంటూ తిరుగుతుంది” అని శపిస్తుంది. అందుకే, ముత్తరాసులలో బతుకు తెరువుకోసం పండ్లు అమ్ముతూ జీవిస్తుంటారనే కథ ఉంది.
జంపన్న సంతతి వారు పాండవుల కథలు చెబుతూ ‘పాండవుల వారు’ అయ్యారు. దుగ్గన్న ఊరి వ్యవహారాలు చూసే గ్రామపెద్దగా ఉంటాడు. ఇదే కథను వివిధ ప్రాంతాలలో వివిధ మార్పులతో చెబుతారు. ముదిరాజుల ఆశ్రితులైన కాకి పడగల వారి పుట్టుకకు సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. ముదిరాజులు ముగ్గురు అన్నదమ్ములు. జంపన్న, దుగ్గన్న, సందనుడు. వీరు మామిడి తోట గుత్తకు (కౌలు) తీసుకున్నారు. ఈ తోటలో వీరితోపాటు వీరి అక్క శబరి కూడా ఉంటుంది. ఆమె ఒక కంసాలి బ్రహ్మయ్యకు ప్రతిరోజు పూజకోసం పుష్పాలు ఇస్తుంది. చిన్నవాడైన నందనుడు అది చూసి, శబరిని పుష్పాలు ఇవ్వడం మాన్పిస్తాడు. దాని మూలంగా బ్రహ్మయ్య కోపంతో తన దగ్గరున్న మంత్రజలంతో పంచరంగుల ఒక కాకాసురుణ్ణి (కాకిని) సృష్టించి తోట మొత్తం నాశనం చేయమని ఆజ్ఞాపిస్తాడు. ఆ కాకి మరికొన్ని కాకుల్ని సృష్టించుకొని తోటను నాశనం చేస్తుంది.
నందనుడు చూసి బాధ పడి భూమినుండి దర్భను తీసి బాణంగా చేసి శ్రీరాముని ధ్యానించి కాకులపై వదులుతాడు. పంచరంగుల కాకి మినహా మిగతా కాకులన్నీ మర ణిస్తాయి. ఆ బాణం బ్రహ్మయ్య వద్దకు చేరి అక్కడినుండి ఆ కాకి దగ్గరకు వెళుతుంది. ఆ కాకి శ్రీరాముణ్ణి శరణు వేడటంతో బాణం ఆగిపోతుంది. అప్పు డు నందనుడు వ చ్చి, “బాణం ఎందుకు ఆపావు?” అని శ్రీరాముణ్ణి ప్రశ్నిస్తాడు. శ్రీరాముడు “ఆ కాకిని ఎందు కు చంపాలనుకున్నావో చెప్పు?” అంటా డు. జరిగిన వృత్తాంతమంతా చెబుతాడు నందనుడు. అప్పు డు శ్రీరాముడు, కాకిని చంపకుండా కుడిరెక్క నుండి, కుడికన్ను మాత్రమే భంగపరచునట్లు చేయమని చెబుతాడు.
ఆ బాణం శ్రీరాముని ఆజ్ఞ మేరకు ఆ పని చేసి శాంతిస్తుంది. ఆ కాకి బతకదని తెలిసినా దానిని పట్టుకొని నందనుడు ఇంటికి తెస్తాడు. అప్పుడు అతని తల్లి దేవయాని చూసి, “కాకిని పట్టుకోవడం మంచిది కాదు. యదు వంశమందున ముదిరాజును అడిగే ఆర్తివాడివై అచట ఉండు కుమారకా!” అని శపిస్తుంది. శాప ఫలితంగా అతడు కాకితో ఇంటికి ఒక పక్కన వేరుగా నివసిస్తుంటాడు. తండ్రి యయాతి, అన్నలు, అక్కలు వచ్చి ఇంట్లో భోజనం చేయవలసిందిగా నందునుణ్ణి కోరతారు. అప్పుడు తన తల్లి ఇచ్చిన శాపం చెబు తాడు. బంధువులందరూ కలిసి శ్రీరాముణ్ణి ప్రార్థిస్తారు. శ్రీరాముడు ప్రత్యక్షమై, “తల్లిదండ్రుల ఆజ్ఞ శిరసావహించడం న్యాయ సమ్మతం.
కాకిని పట్టుకొనుట, ఇది ముది వంశంలోనే మర్యాద కాదు. జీవించు పొమ్మిక ముదిరాజు కొడుకా!” అని చెబుతాడు. ఆనాటి నుండి నందనుణ్ణి అతని వంశం వారు “ముదిరాజు నడిగె ఆర్తివాడివై వంశపారంపర్యంగా ఉండమని” ఆజ్ఞాపిస్తారు. “నేను ఏ విధంగా బతకాలని” అడిగితే, మున్ముందు “మహాభారత కాలం రాబోతున్నది. పాండవులు, కౌరవులు పుడతారు. రాజ్యం కోసం వారిమధ్య రణరంగం జరుగుతుంది. ఆ భారతకథను నీ వంశం వారు ‘పాండవుల కథలు’గా చెప్పి, వారిని యాచించి బతకండి. అది మీకు వృత్తిగా ఉంటుంది” అని చెప్పి అంతర్ధానమవుతాడు శ్రీరాముడు. అలా తమ పుట్టుకకు కారణం గురించి కాకి పడగల వారు చెప్పుకొంటారు. పాండవ కథాగానం చేస్తూ అయిదు రోజులు ప్రదర్శిస్తారు. చివరి రోజున ముదిరాజు కులస్తులు అందరూ కలిసి ‘పెందోట పెద్దమ్మ’కు పూజలతో బోనాలు చేస్తారు. ఈ కళాకారులు చిత్రపటం లేకుండా ప్రదర్శన ఇస్తారు.
వీరిని ‘పాండవుల వారు’ అనీ పిలుస్తారు. వీరు సాధారణంగా తమ కళా ప్రదర్శన రాత్రివేళ చేస్తారు. వీరి బృందంలో ముగ్గురు సభ్యులు వుంటారు. ప్రధాన కథకుడు కిన్నెరను వాయిస్తూ కథ చెబుతాడు. మిగిలిన ఇద్దరు ప్రధాన కథకుడికి రెండువైపులా ఉండి సహాయ పడుతారు. కుడివైపున ఉండే వ్యక్తి మద్దెల, ఎడమ వైపున ఉండే వ్యక్తి తాళాలు వాయిస్తారు. కాకి పడగల చిత్ర పదర్శన అయ్యాక వారు తమకు రావలసిన సంభావన తీసుకొంటారు. ఊరిలో కులస్తుల నుండి కులపెద్దలు కొంత డబ్బు వసూలు చేస్తారు. ఒక యాట పిల్ల, నూతన వస్త్రాలు, ధాన్యం, వెయ్యి లేక రెండు వేల రూపాయిలు వీరికి ఇస్తారు. కాకి పడగల వారు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఈ కథలు చెప్పి జీవిస్తుంటారు. (కుల పురాణాలు గౌడ పురాణం-: - డా. గుడికాడి ఆంజనేయులు).
ఈ కాకి పడగల వారికి సంబంధించిన మరొక కథనం ప్రచారంలో ఉంది. రామాయణ కాలంలో బోయ ముత్తరాచ కులానికి చెందిన శబరి పండ్లు అమ్ముకొని జీవించేది. ఒకనాడు పండ్లు అమ్ముకొంటూ పంచాధ్యాయి అనే మహిళ ఇంటికి వెళ్ళింది. ఆ ఇంట్లో ఉన్న చిన్నారి పాప శబరి పండ్ల బుట్టలోనుండి ఒక పండు తీసుకొని కొరికి పారవేస్తుంది. అప్పుడు శబరికి కోపం వచ్చి పాపను మందలించింది. పంచాధ్యాయి తన బిడ్డను దుర్భాషలాడిన శబరిపై ఆగ్రహం చెందుతుంది.
తన మంత్రశక్తితో శబరిపై ఒక ఉక్కు కాకిని ప్రయోగిస్తుంది. ఆ కాకి శబరిని ఉక్కు ముక్కుతో పొడిచి గాయపరుస్తూ ఉంది. ఈ దృశ్యాన్ని చూసిన శబరి కుమారుడు నందనుడు తన తల్లిని కాపాడుకొనేందుకు ఉక్కు కాకితో పోరాటానికి దిగాడు. ఈ పోరాటం మూడు నెలలుపాటు కొనసాగింది. మూడు నెలలైనా తన కుమారుడు తిరిగి రాక పోవడం వల్ల కాకి తన కుమారుణ్ణి హతమార్చి ఉంటుందని భావించిన శబరి కన్నీరు మున్నీరుగా విలపించింది. తన కోసం ప్రాణాలకు తెగించి పోరాడి మరణించిన పుత్రుని ఆత్మ శాంతి కోసం కర్మకాండ జరిపిస్తూ ఉంది. అంతలో శబరి చిన్న కుమారుడు నందనుడు ఉక్కు కాకిని జయించి, దానిని పట్టుకొని విజయోత్సాహంతో తిరిగి వచ్చాడు.
పల్లెబోయిన అశోక్,
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ముదిరాజ్ మహాసభ