* 1969 ఉద్యమ ‘అమరుల వీరుల స్తూప’ నిర్మాణానికి అంకురార్పణ చేసిన స్ఫూర్తి ప్రదాత ఎన్. లక్ష్మీనారాయణ ముదిరాజ్ జ్ఞాపకాలు
* రెండు సంవత్సరాలపాటు హైదరాబాద్ నగర మేయర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించిన లక్ష్మీనారాయణ హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకొన్నారు. తనదైన శైలిలో నగర అభివృద్ధికి పాటుపడ్డారు.
మహారాజ్‌గంజ్ మాజీ ఎమ్మెల్యే స్వాతంత్య్ర సమరయోధుడు, హైదరాబాద్ నగర మాజీ మేయర్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎన్. లక్ష్మీనారాయణ ముదిరాజ్ 1929లో హైదరాబాద్ పాతబస్తీలో జన్మించారు. 2015 మార్చి 4న కన్నుమూసిన ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పట్టా పొందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు అనిల్ కుమార్ అమెరికాలో స్థిరపడగా, చిన్న కుమారుడు వినయ్ కుమార్ ‘ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యుడి’గా కొనసాగుతున్నారు.
లక్ష్మీనారాయణ ముదిరాజ్ రాజకీయ ప్రస్థానం 1954లో మొదలైంది. తొలుత కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా చేరి 1960 సంవత్సరాలలో హైదరాబాద్ మున్సిపాలిటీకి కార్పొరేటర్‌గా ఎన్నికై 1970 వరకు కొనసాగారు. అదే సమయంలో 1967 నుండి 1969 వరకు ‘హైదరాబాద్ నగర పాలక సంస్థ’లో కాంగ్రెస్ పక్ష నాయకుడుగా వ్యవహరించడమేకాక 1968, 1969 సంవత్సరాలలో రెండు సం వత్సరాలపాటు ‘స్టాండింగ్ కమిటీ చైర్మన్’గానూ పని చేశారు. హైదరాబాద్ మున్సిపాలిటీలో ఎంతో క్రియాశీల పాత్ర పోషించారు. జంట నగరాల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులలో ఆయన ఒకరు. 1969 నుండి రెండు సంవత్సరాలపాటు హైదరాబాద్ నగర మేయర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించిన లక్ష్మీనారాయణ హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకొన్నారు. తనదైన శైలిలో నగర అభివృద్ధికి పాటుపడ్డారు. ఈ మేరకు ప్రత్యేక గుర్తింపు ఇప్పటికీ వారికి ఉంది.
సాహసోపేత నిర్మాణానికి శ్రీకారం
1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం (తొలి దశ)లో లక్ష్మీనారాయణ ముదిరాజ్ పాల్గొన్నా రు. 369 మంది ఆనాడు పోలీసు కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని రగిలించుకొని వారి త్యాగాలను ప్రపంచమంతా గు ర్తుంచుకోవాలని హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌వద్ద ‘అమరవీరుల స్మారక స్తూపాన్ని’ నిర్మించాలనే సాహసోపేత నిర్ణయాన్ని తీసుకొన్నారు. హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ దీనిని తీర్మానించింది. ఈ మేరకు స్మారక స్తూపాన్ని నిర్మించే బాధ్యతలను చేపట్టిన ధీశాలి లక్ష్మీనారాయణ ముదిరాజ్. ఆయన అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని ఎదిరించి, 5,000 మందికి పైగా పోలీసుల నగర నిర్బంధాన్ని ధిక్కరించి, పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ఐదుగురు మిత్రులతో రహస్యంగా, పోలీసుల కన్ను గప్పి గన్‌పార్క్ వద్దకు చేరుకున్నారు. 1970 ఫిబ్రవరి 23న ప్రకటించిన సమయానికి ఉదయం 10.30 గంటలకు ‘తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపాని’కి లక్ష్మీనారాయణ ముదిరాజ్ స్వయంగా శం ఖుస్థాపన చేశారు. దీనిపై ఆగ్రహించిన అప్పటి ప్రభుత్వంలోని పోలీసులు ఆయనను అరెస్టు చేసి చంచల్ గూడ జైలులో నిర్బంధించారు.
1969లో తెలంగాణ ఉద్యమం బాగా వ్యాప్తిలో ఉంది. ఈ సమయంలో ఉద్యమ నేతృత్వంలో తన పాత్ర మేరకు పని చేయడంతోపాటు ఎన్నో కార్యక్రమాలతో ప్రభుత్వ నిర్భందాలనూ అనుభవించారు. ఉద్య మంలో అరెస్టు అయి ఎన్నో రోజులు జైళ్లలో గడిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఇంకా బలోపేతంగా ముందుకు తీసుకెళ్లడానికి కంకణం కట్టుకొని, ఎన్నో పోరాటాలలో భాగస్వామి అయ్యారు. 1954లో కాంగ్రె స్ పార్టీలో చేరిన లక్ష్మీనారాయణ ముదిరాజ్ తాను మరణించే నాటికి కూడా అందులోనే కొనసాగారు. ఇది అప్పటి ఆయన రాజకీయ నైతిక విలువలకు అద్దం పడుతూ, వారి వ్యక్తిత్వాన్ని చాటుతున్నది. వ్యాపార రం గంలో టింబర్ వ్యాపారాన్ని తన తండ్రి నుండి వారసత్వంగా స్వీకరించారు లక్ష్మీనారాయణ. వ్యాపార రం గంలో తనదైన ముద్ర వేస్తూ సమాజంలో పదిమందికి ఉపాధి కల్పించి, నిత్య జీవితంలో నిరాడంబరంగా, ఆదర్శప్రాయమైన జీవితం గడిపారు. ఆనాటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నప్పటికీ వాటన్నింటినీ పక్కకు పెట్టారు. పదవీ బాధ్యతలు, సామాజిక సేవా రంగాలలో తన శైలిలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేకంగా ‘టింబర్ మర్చంట్ అసోసియేషన్’ అధ్యక్షులుగా వ్యవహరిస్తూ, వ్యాపార రంగం లో కూడా చెదరని ముద్ర వేసారు.
ఇంతటి రాజకీయ చైతన్యం, ప్రజాసేవా దృక్పథం గల లక్ష్మీనారాయణ 1972లో జరిగిన ఎన్నికలలో కాం గ్రెస్ అభ్యర్థిగా మహరాజ్‌గంజ్ (ఇప్పటి గోషామహాల్) నియోజక వర్గానికి శాసనసభ్యులుగా ఎన్నిక య్యారు. తాను గెలుపొందిన ప్రాంత ప్రజల మన్ననలు పొందిన ఆయన నగర మేయర్‌గానూ పని చేశా రు. ఎటువంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా ప్రజల సమస్యల పరిష్కారంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ప్రజా జీవితంలో కార్పొరేటర్‌గా, స్టాండింగ్ కమిటీ చైర్మెన్‌గా, మేయర్‌గా తన నియోజక వర్గం సహా జంట నగరాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అవిరళ కృషి సలిపారు. ‘పీపుల్స్ కో ఆపరేటివ్ బ్యాంక్’ ప్రారం భం నుంచి ఒక షేర్ హోల్డర్‌గా వ్యవహరించారు. బ్యాంక్ అభివృద్ధిలో కీలక ప్రాత పోషించారు. బీసీ కమీషన్ సభ్యులుగా కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో శ్రీ దవళ సుబ్రహ్మణ్యం కమిటీలో ఒక సీనియర్ మెంబర్‌గా 3 సంవత్సరాలపాటు నియమితులైనారు. ప్రభు త్వం దాదాపు 2009 వరకు పొడిగించడంతో 5 సంవత్సరాలపాటు బీసీ కమీషన్ సభ్యులుగా ఉన్నారు. వెనుకబడిన తరగతుల వారిగా గుర్తింపు లేకుండా ఎంతో నిర్లక్ష్యానికి గురవుతున్న ఎన్నో కులాల అర్జీలను పరిశీలించి, సాధ్యమైన వారి కోరికలను అంగీకరించారు. అలా, వారిని బీసీ కులాలలో చేర్పించారు.
ఇలా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహిస్తూ ముదిరాజ్‌ల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన మహనీయులు లక్ష్మీనారాయణ ముదిరాజ్. రాష్ట్ర ముది రాజ్ మహాసభ అధ్యక్షులుగా కూడా పనిచేసి ముదిరాజ్‌ల అభ్యున్నతికి పాటుపడ్డారు. ముదిరాజ్‌లకు రిజర్వే షన్ పరంగా బీసీ డీ ఏ కోసం 2009లో బీసీ కమిషన్ ముందు నివేదికలు సమర్పించారు. ముదిరాజుల వాదనలు వినిపించడానికి ఒక బీసీ కమిషన్ మాజీ సభ్యులుగానూ ఆయన కృషి చేశారు. లక్ష్మీనారాయణ ముదిరాజ్ ‘హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్’ సభ్యునిగా కూడా ఉండి విద్యారంగంలో తనదైన కృషి సలిపారు. వనితా మహిళా విద్యాలయ డిగ్రీ కాలే జీ చైర్మన్‌తోపాటు అనేక విద్యాసంస్థలకు ఉపాధ్యక్షులుగా, కరెస్పాండెంట్‌గా, సెక్రటరీగా సేవలు అందిం చారు. వెనుకబడిన తెలంగాణ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషి చేసి, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
సమరయోధుని సేవలు మరవరాదు
2001లో ‘ఎగ్జిబిషన్ సొసైటీ’ వైస్ ప్రెసిండెంట్‌గానే కాక మొదటి నుండి ‘ఎకనామిక్ కమిటీ’ సభ్యులుగా కూడా ఉంటూ సొసైటీ అభివృద్ధికి అవిరళ కృషి జరిపారు. ‘హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ’ ప్రారంభో త్స వం సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చం ద్రశేఖర్‌రావు చేతులమీదుగా ‘ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు’గా పురస్కారాన్ని అం దు కున్నారు. అప్పట్లోనే రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో భాగంగా గాంధీభవన్‌లో ఒక స్వాతంత్య్ర సమరయోధుడిగా పీసీసీ అధ్యక్షుల చేతులమీదుగానూ పుర స్కారం పొందారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి స్పూర్తినిచ్చిన ‘తెలంగాణ అమరవీరుల స్మారక స్తూప’ నిర్మాణంలో కీలకపాత్ర వహించిన వ్యక్తిగా ఆయనను రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సిందే. ఈనాటికి ఎవరైనా ఎలాంటి ఉద్యమ కార్యక్రమం ప్రారంభించడానికైనా ముందుగా మలిదశ ఉద్యమానికి ఎంతో స్పూర్తిని ఇచ్చిన ‘అమరవీరుల స్మారక స్తూపం’ వద్ద నివాళులు అర్పిస్తారు. కానీ, అంతకు ముందే, తొలిదశ (1969) అమరవీరుల స్తూప నిర్మాణం కోసం ఆనాడే నిరంతరం శ్రమించిన మన పోరు బిడ్డ లక్ష్మీనారాయణ ముదిరాజ్‌ను మరవకుండా స్మరించుకోవాల్సిన అవసరం, భాధ్యత ఈ సమాజం మీద, రాష్ట్ర ప్రభుత్వంపైనా ఎంతో ఉంది.
పల్లెబోయిన అశోక్,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ ముదిరాజ్ మహాసభ