calender_icon.png 20 September, 2024 | 8:02 PM

లే ఆఫ్స్ ఇంకా ఆగలేదు

06-09-2024 01:19:46 AM

ఆగస్టులో 27 వేల ఐటీ ఉద్యోగాల కోత

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: కొవిడ్ తర్వాత ప్రారంభమైన ఉద్యోగాల తొలగింపు.. ఇప్ప టికీ కొనసాగుతూనే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కొన్ని కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు, మరికొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈరకంగా ఆగస్టు నెలలోనే దాదాపు 40 కంపెనీలు 27 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి లక్షా 36 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇంటెల్, సిస్కో, ఐబీఎం లాంటి ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తుండడం గమనార్హం. కంప్యూటర్ చిప్‌లను రూపొందించే ఇంటెల్ సంస్థ ఆగస్ట్‌లో 15 వేల మందిని తొలగించింది.

ఇది ఆ సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 15 శాతానికి సమానం. నెట్‌వర్కింగ్ కంపెనీ సిస్కో సిస్టమ్స్ సైతం దాదాపు 6వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేసింది. మరో ప్రముఖ కంపెనీ ఐబీఎం సైతం చైనాలోని తమ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్‌లో వెయ్యి మందిని తొలగించాలని నిర్ణయించింది. ఐటీ హార్డ్‌వేర్‌కు డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయానికి వచ్చారు. జర్మన్ చిప్ తయారీ సంస్థ ఇన్ఫినియాన్ 1,400, యాక్షన్ కెమెరా తయారీ సంస్థ గో ప్రో 140 చొప్పున ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం తీసుకుంది.