- నవంబర్ 5న అగ్రరాజ్యంలో పోలింగ్
- కీలక రాష్ట్రాలపైనే అభ్యర్థుల ఫోకస్
- సుడిగాలి పర్యటనలు చేస్తోన్న ట్రంప్, కమల
- కమలకు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్న సెలబ్రిటీలు
- ట్రంప్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తోన్న ప్రపంచ కుబేరుడు మస్క్
న్యూఢిల్లీ, నవంబర్ 3: అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. రెండ్రోజుల్లో అగ్రరాజ్యంలో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. కీలకమైన స్థానాలుగా పరిగణించే స్వింగ్ స్టేట్లలో పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్నారు.
ఎన్నికలకు రెండ్రోజులే ఉండటంతో కీలకమైన ప్రాంతాల్లో అధ్యక్ష అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గతంలో కోల్పోయిన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ రెండ్రోజుల పాటు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమల హ్యారిస్ బిజీ షెడ్యూల్‌ను ప్రిపేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకు 7.5 కోట్ల మంది ముందస్తుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు.
కీలక రాష్ట్రాల్లోనే తుది ప్రచారం
ట్రంప్, కమల శనివారం నిర్వహించిన భారీ సభల మధ్య దూరం 12 కిలోమీటర్లు అంటే పోటీ ఏ రీతిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరూ స్వింగ్ స్టేట్ విస్కాన్సిన్‌లోని మిల్వాకీ నగరంలో ప్రచారంలో నిర్వహించారు. మిల్వాకీ ప్రధాన నగరంలో ఓటర్లు డెమోక్రాట్లకు, డౌన్‌టౌన్‌లో రిపబ్లికన్ ఓటర్లు అధికంగా ఉంటారు. డౌన్‌టౌన్‌లో ట్రంప్, నగర శివార్లలో కమల ప్రచారం నిర్వహించారు.
విస్కాన్సిన్ రాష్ట్రంలో 2016 ఎన్నికల్లో ట్రంప్ ఆధిక్యం సాధించగా గత ఎలక్షన్‌లో మాత్రం ఓడిపోయారు. దీంతో ఎలాగైనా విస్కాన్సిన్ హస్తగతం చేసుకోవాలని అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నార్త్ కరోలినాలో ఒక్కరోజే ట్రంప్ 12 సభల్లో ప్రసగించారు. జార్జియా రాజధాని అట్లాంటలో కమల భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.
స్వదేశంపైనే ఎక్కువ దృష్టి
గత ఎన్నికల్లో అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్.. అందుకు తగ్గట్టే ఇతర దేశాలతో సంబంధాలను కుదించారు. ఇప్పుడూ అదే నినాదంలో ట్రంప్ బరిలోకి దిగారు. అందుకే అంతర్గత సమస్యల గురించే ట్రంప్ ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంతర్జాతీయ విషయాలకు వస్తే భారత్‌తో సాన్నిహిత్యం, పశ్చిమాసియాలో శాంతి, రష్యా యుద్ధానికి ముగింపు వంటి అంశాలను ప్రస్తావించారు.
అంతేకాకుండా ద్రవ్యోల్బణాన్ని తగ్గించి ధరలు అదుపు చేసే ప్రణాళికలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, చిన్న చిన్న తప్పిదాలు ట్రంప్‌కు ప్రతికూలంగా మారుతున్నాయి. ఇటీవల న్యూయార్క్ ప్రచార సభలో స్టాండప్ కమెడియన్ టోనీ హించ్‌క్లిఫ్ జాత్యాహంకార వ్యాఖ్యలు ట్రంప్ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదముంది. కీలక రాష్ట్రాల్లో ట్రంప్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశముంది. అయితే, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎప్పటినుంచో ట్రంప్ అధ్యక్షుడిగా గెలవాలని కృషి చేస్తున్నారు.
ఎన్నో మలుపులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నాయి. మొదటగా డెమోక్రాట్ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ నిలిచారు. కానీ ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లో బైడెన్ తేలిపోవడంతో విమర్శలు మొదలయ్యాయి. దీంతో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదుర్కొన్నారు. దీనికి తోడు అనారోగ్య కారణాలు బైడెన్ పోటీ నుంచి వైదొలిగేందుకు కారణమయ్యాయి.
అనంతరం ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ డెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికయ్యారు. కమల నేతృత్వంలో డెమోక్రటిక్ పార్టీ ఒక్కసారిగా మళ్లీ అధ్యక్ష రేసులో ముందంజలో నిలుచుంది. సర్వేలు కూడా ఆమెకు భారీ మద్దతు లభిస్తున్నట్లు వెల్లడించాయి. కమల, ట్రంప్ మధ్య డిబేట్‌లోనూ ఆమె సత్తా చాటారు.
బియాన్స్, జెన్నీఫర్ లోపెజ్, టేలర్ స్విఫ్ట్, అర్నాల్డ్ స్కార్జ్‌నెగ్గర్, మడోన్నా, స్కార్లెట్ జాన్సన్, రాబర్ట్ డౌనీ జూనియర్, మాడిసన్ ఫోర్డ్, బజ్ ఆల్డ్రిన్ వంటి అనేక మంది వివిధ రంగాల్లోని ప్రముఖులు కమలకు మద్దతుగా నిలుస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు అమెరికాకు ఓ మహిళ అధ్యక్షురాలిగా పనిచేయలేదు. గతంలో హిల్లరీ క్లింటన్ చేరువదాకా వచ్చి మరీ ఓడిపోయారు. దీంతో అమెరికన్లు ఎవరికీ మద్దతిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.