calender_icon.png 8 October, 2024 | 5:06 AM

ఆ కంపెనీల భూములు వాపస్

08-10-2024 02:58:11 AM

  1. ప్రారంభంకాని కంపెనీల నుంచి స్వాధీనం చేసుకోవాలి
  2. ఉమ్మడి ఏపీలో భూకేటాయింపుల రద్దుకు హైకోర్టు నిరాకరణ 

ఇందూటెక్, బ్రాహ్మణి సహా ఇతర కంపెనీల నుంచి వెనక్కి తీసుకోండి

2007 నాటి పిల్‌పై హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2001 నుంచి 2006 వరకు జరిగిన భూకేటాయింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలే మని హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే, భూకేటాయింపుల తర్వాత కంపెనీలను ప్రారంభించని సంస్థల నుంచి భూములను స్వాధీనపర్చుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

భూములు తీసుకొని, నిర్మాణాలు చేయని ఇందూటెక్ జోన్, బ్రాహ్మణి ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్, స్టార్జ్ ప్రాపర్టీస్, అనంత టెక్నాలజీస్, జెటీ హోల్డింగ్‌కు కేటాయించిన భూములను నాలుగు నెలల్లో స్వాధీనం చేసుకోవాలని తీర్పు వెలువరించింది.

2001 నుంచి 2006 వరకు నామినేషన్ విధానంలో అమ్మకం, లీజు ప్రాతిపదికపై 4,156 ఎకరాల భూమిని పలు కంపెనీలు, వ్యక్తులకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ చత్రి అనే స్వచ్ఛంద సంస్థ 2007లో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ అనంతరం 72 పేజీల కీలక తీర్పు చెప్పింది.

ఉమ్మడి ఏపీలో 2001 నుంచి 2006 దాకా భూముల కేటాయింపు జరిగిన ఏడాదికి పిల్ దాఖలు చేయడాన్ని తప్పుపట్టింది. ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా పలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయని గుర్తుచేసింది. వందల కోట్ల పెట్టుబడితో కంపె నీలు ప్రారంభమై, వేల మందికి ఉపాధి లభించిందని తెలిపింది.

పిటిషనర్ కోరినట్టు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర ప్రకా రం సొమ్ము వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తే అది ప్రభుత్వం రూపొం దించిన విధాన నిర్ణయాలకు విరుద్ధం అవుతుందని స్పష్టంచేసింది. అలాంటి ఉత్తర్వులు ఇవ్వజాలమని తేల్చిచెప్పింది.  

పారదర్శకతతో కేటాయింపులు

ప్రభుత్వ ఆస్తుల కేటాయింపునకు సంబంధించిన విధానం పారదర్శకంగా ఉండాలి, ఇలాంటి ప్రభుత్వ విధానాలపై న్యాయసమీక్షకు సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ధర్మాసనం ప్రస్తావించింది. పారిశ్రామిక అభివృద్ధి నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 1973లో ఏపీఐఐసీని ఏర్పాటు చేసిందని తెలిపింది.

పథకాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాలు చేపట్టడానికి, పౌరులకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడానికి కమ్యూనికేషన్ రంగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపింది. ఐటీ రంగానికి ప్రోత్సాహకాలు కల్పించడంలో అర్హతలు, విధివిధానాలు, దరఖాస్తులు, వాటి పరిశీలనా విధానం, షరతులు తదితరాలతో ప్రభుత్వ విధానానికి రూపకల్పన జరిగిందని గుర్తుచేసింది.

ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటరు ప్రకారం భూకేటాయింపులకు సంబంధించి 2000లోనే కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపింది. అప్పటి ప్రభుత్వ విధానాలు ఐటీ రంగానికి ఊతం ఇచ్చాయని, రాష్ట్రంలో ఐటీ రంగం 2004-05లో 64.05 వద్ధి సాధించగా, జాతీయ సగటు 34 శాతం మాత్రమే ఉందని తెలిపింది. 2007-08లో పరిశ్రమల ఎగుమతి రూ.8,270 కోట్లతో 41 శాతం ఉండగా జాతీయ సగటు 33.88 మాత్రమేని స్పష్టంచేసింది.

ఐటీ రంగానికి సంబంధించి 1997 నుంచి 2007-08 దాకా 1584 యూనిట్లు ఏర్పాటుకాగా, రూ.26,122 కోట్ల ఎగుమతులు, రూ.10,101 కోట్ల పెట్టుబడులు, 2.39 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టు కౌంటరు ద్వారా వెల్లడైందని తెలిపింది. 2002-05, 2005-10 మధ్య ఐటీ పాలసీ వల్ల హైటెక్ సిటీ, సాఫ్ట్‌వేర్ యూనిట్స్ మాదాపూర్‌లో, బహుళజాతీయ సంస్థలు, మైక్రో సాఫ్ట్, సీఏ, కాన్బో, యుబీఎస్, ప్రాంక్లిన్ అండ్ టెంపుల్టన్, విప్రో, హనీవెల్, అమెజాన్ బహుళజాతి కంపెనీలు ఏర్పాటయ్యాయని తెలిపింది.

భూకేటాయింపుల్లో దురుద్దేశాలు, వివక్ష ఉన్నట్లు పిటిషనర్ చెప్పలేదని, ఇవి లేకుండా ప్రభుత్వ నిర్ణయాలు ఏకపక్షమని చెప్పలేమని తెలిపింది. భూకేటాయింపులకు సంబంధించి ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌పై విచారణను ముగించింది. ఇందూటెక్ జోన్, బ్రాహ్మణి ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ తదితర కంపెనీలకు ఒక్కొక్క దానికి దాదాపు ౨౫౦ ఎకరాలను కేటాయించారు.