calender_icon.png 23 October, 2024 | 7:05 AM

హుజూరాబాద్ గడ్డ.. పోరాటాల అడ్డా

23-10-2024 12:00:00 AM

తెలంగాణ ఉద్యమంలో హుజూరాబాద్ పాత్ర చాలా కీలకం. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు. తొలిదశ ఉద్యమాన్ని విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ముందుండి నడిపించారు. ప్రజల భాగస్వామ్యం కూడా ఉంది. అప్పట్లో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి, దానికి అనుబంధంగా తెలంగాణ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి డాక్టర్ మల్లికార్జున్ నాయకత్వంలో ఉద్యమా లు కొనసాగాయి.

హుజూరాబాద్ తాలుకా లో వెల్ది, వేగురుపల్లి గ్రామాలు, మరోవైపు కట్కూరు, కన్నారం గ్రామాలు సరిహద్దుగా ఉన్నాయి. తొలి దశ ఉద్యమ సమయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పొలసాని నరసింగారావు చెన్నారెడ్డి నాయకత్వంలో ప్రజాసమితికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

పొలసాని నరసింగరావుకు ముఖ్య అనుచరుడైన మాణిక్యాపూర్‌కు చెందిన ఎదులాపు రం లింగయ్య, విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్న నల్ల సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఆవునూరి సమ్మయ్యలతోపాటు విద్యార్థి నాయకులుగా ఉన్న నలుబాల వెంకటస్వామి, మహమ్మద్ అబ్దుల్ కరీం, తాళ్లపల్లి లక్ష్మయ్య, సయ్యద్ ఇంతియాజుద్దీన్‌లను తెలంగాణకు జరుగుతున్న వివక్షను వివరించి ఉద్యమం వైపు మళ్లించారు. 

కాసు బ్రహ్మనందారెడ్డి గో బ్యాక్

విద్యార్థుల ఉద్యమాలు తీవ్రతరం కావడంతో ‘హుజూరాబాద్ తాలుకా ప్రజా సమితి’ ఏర్పాటయింది. కమిటీ అధ్యక్షుడిగా కోర్కల్ గ్రామానికి చెందిన గోవిందరెడ్డి, కార్యదర్శిగా ప్రముఖ న్యాయవాది, హుజూరాబాద్ సర్పంచ్ బి జగన్నాథ్ నాయుడు, మిగతా కార్యవర్గ సభ్యులుగా పరిపాటి జనార్ధన్ రెడ్డి, దుగ్గిరాల వెంకటరావు, కేతిరి సాయిరెడ్డి, ఎర్రం రాజు, కృష్ణం రాజు, పుల్ల ఏలియా, కొత్త కిష్టారెడ్డి ఉన్నారు.

అప్పటి ఉద్యమంలో ‘ఇడ్లి సాంబార్ గో బ్యాక్, ఆంధ్రా గో బ్యాక్, అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందారెడ్డి గో బ్యాక్’ నినాదాలతో తాలుకా మొత్తం మార్మోగింది. తెలం గాణ నుంచి ఆంధ్రా ఉద్యోగులను పంపించారు.

అప్పటికే హుజూరాబాద్ తాలుకా మొత్తం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడంతో రెండు బెటాలియన్ల సీఆర్‌పీఎఫ్‌ను దింపారు. పోలీసులు పట్టణంలోని వేర్వేరు సంఘటనల్లో విద్యార్థి నాయకులైన నల్ల సుధాకర్ రెడ్డి, ఆవునూరి సమ్మయ్యలను పట్టుకుని చితకబాదారు. ఇప్పటికీ నల్ల సుధాకర్ రెడ్డి భుజంపై పోలీస్ దెబ్బల గాయలున్నాయి. 

అంతా ఒక్కటై..

ఉద్యమ నేత కేసీఆర్ నవంబర్ 2009లో కరీంనగర్ కేంద్రంగా అల్గునూరులో దీక్ష మొదలు పెట్టారు. ప్రభుత్వ దీక్షను భగ్నం చేసే క్రమంలో కేసీఆర్‌ను అరెస్టు చేసి హుజూరాబాద్ మీదుగా తరలిస్తుండగా ప్రజలంతా పోలీసులను అడ్డుకునే ప్రయ త్నం చేశారు. దాంతో పోలీసులు హుజూరాబాద్ నుంచి వరంగల్ మీదుగా ఖమ్మం తరలించారు.

అనంతరం ఆమరణ దీక్షకు దిగిన ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో ముందుకెళ్లాడు. జేఏసీలను ఏర్పాటు చేసుకుంటూ ప్రొఫెసర్ కోదండరాం కూడా కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచారు. తెలంగాణ ఉద్యమం ఇక తీవ్రరూపం దాల్చడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

 హుజూరాబాద్, విజయక్రాంతి

ఉద్యమకారుడిగా గర్విస్తున్నా.. 

స్వాతంత్రోద్యమంలో పాల్గొనక పోయినా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు గర్వంగా ఉంది. ఆంధ్ర పెత్తందారు లు తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల మీద అజమాయిషీని భరించలేక తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టాం.

మలిదశ ఉద్యమంలో హుజూరాబాద్ మొత్తాన్ని ఉద్యమంవైపు నడిపించేందుకు ఎంతోమంది మేధావులు అహ ర్నిశలు కష్టపడ్డారు. 1969 నుంచి ఉద్యమం చేసిన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు ఉద్యమాభివందనాలు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దేశంలోని నెంబర్‌వన్‌గా నిలవాలి. 

 వంగల హనుమంతు గౌడ్, 

తెలంగాణ ఉద్యమకారుడు