22-03-2025 01:49:10 AM
-జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట. మార్చి 21(విజయక్రాంతి) : నారాయణ పేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ మరింత వేగం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో కలెక్టర్ రెవెన్యూ, నీటి పారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నారాయణ పేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉట్కూర్ మండలం లోని దంతెన్ పల్లి గ్రామం లో భూసేకరణ కు నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. అలాగే కోస్గి పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులపై కలెక్టర్ చర్చించారు.
22 మంది వేసిన రిట్ పిటిషన్ల పై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని కోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్ల కు పరిష్కారం చూపాలని కలెక్టర్ తెలిపారు. నారాయణ పేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ పనులు, కోస్గి రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమీక్షలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలం, ఆర్డీఓ రామచంద్ర నాయక్, ఆర్ అండ్ బీ డీఈ రాములు, కోస్గి తహసిల్దార్ బక్క శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ నాగ రాజు, తదితరులున్నారు.