calender_icon.png 21 December, 2024 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరెకరాల కుంట.. రెండెకరాలైంది!

13-09-2024 12:05:48 AM

  1. పరాధీనమైన హైదర్షాకోట్ ఎర్రకుంట 
  2. పట్టించుకోని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 12: ఆరెకరాల కుంట రెండెకరాలైంది. ఆశ్చర్యకరంగా ఉన్నా.. ఇది నిజమే. గతంలో సుమారు ఆరెకరాలకు పైగా ఉన్న కుంట అధికారుల నిర్లక్ష్యంతో పరాధీనమైంది. వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో కబ్జాదారులు గద్దల మాదిరిగా విలువైన భూమిపై వాలిపోతున్నారు. ఎప్పటికప్పుడు దృష్టిసారిస్తూ తగిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

కబ్జాదారుల చేతుల్లోకి..

బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్షాకోట్ ప్రాంతంలో ఎర్రకుంట ఉంది. రికార్డుల ప్రకారం ఇది సుమారు ఆరెకరాలకు పైగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఇది క్రమంగా సుమారు రెండెకరాలకు కుచించుకుపోయింది. సంబంధిత శాఖల అధికారు లు పట్టించుకోకపోవడం కబ్జాదారులకు వరం గా మారింది. ఎక్కడికక్కడ కబ్జా చేయడంతో ఆరెకరాల ఎర్రకుంట.. రెండెకరాలు అయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుంటకు ఉత్తరం వైపు కట్ట ఉండగా, పశ్చిమం వైపు ప్రభుత్వ పాఠశాల ఉంది. ప్రజాప్రతినిధులు, నాయకులు తమ ఇష్టానుసారంగా కబ్జాలు   చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

వెలిసిన మట్టిదిబ్బలు..

ఎర్రకుంటకు ఓ వైపు మట్టిదిబ్బలు వెలిశాయి. వాటిలో కొంత భాగం చదు ను చేశారు. అయితే, మట్టిదిబ్బలు ఉన్న స్థలం ఎర్రకుంటలోకి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఎర్రకుంట ఉన్న ప్రాంతంలో గజం సుమారు రూ.60 వేల నుంచి రూ.70 వేలు ఉంటుందని, కోట్ల విలువైన కుంట పరాధీనమైనా అధికారుల్లో చలనం లేకుండా పోయిందని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధి కారులు పట్టించుకోకపోవడంతో కబ్జాలు జరుగుతున్నాయంటూ ఆయా శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేస్తే ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. ఎర్రకుంటను కబ్జాదారుల చెర నుంచి విడిపించేందుకు హైడ్రా అధికారులైన చర్యలు తీసుకోవాలని హైదర్షా కోట్ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.