calender_icon.png 19 March, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిటన్‌లో లేబర్ పార్టీ జయభేరి

06-07-2024 12:43:20 AM

బ్రిటన్ కొత్త ప్రధానిగా కెయిర్ స్టార్మర్

  1. బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ చిత్తు
  2. 650 స్థానాల్లో 412 గెలిచిన లేబర్ పార్టీ
  3. రిషి సునాక్ నాయకత్వానికి దారుణ ఓటమి

శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్రమోదీ

బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే నిజమయ్యాయి. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ గెలుపు సునామీ సృష్టించింది. లేబర్ పార్టీ ప్రభంజనంలో భారత సంతతి ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ (టోరీ) పార్టీ కొట్టుకుపోయింది. మొత్తం 650 ఎంపీ సీట్లున్న బ్రిటన్ పార్లమెంటులో లేబర్ పార్టీ 412 సీట్లు గెలుచుకొన్నది. టోరీలు 121 స్థానాలకే పరిమితమయ్యారు.

లేబర్ పార్టీ దెబ్బకు 40 మంది మంత్రులు, ప్రభుత్వ విప్‌లు ఓటమి చవిచూశారు. ఓటమికి బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి రిషి సునాక్ రాజీనామా చేశారు. ఆ వెంటనే లేబర్ పార్టీ నేత కెయిర్ స్టార్మర్‌ను బ్రిటన్ రాజు మూడో చార్లెస్ దేశ ప్రధానిగా నియ మించారు. ఈ ఎన్నికల్లో 26 మంది భారత సంతతి వ్యక్తులు ఎంపీలుగా గెలిచారు. ఉత్తర ఇంగ్లండ్ నుంచి రిషి సునాక్ మళ్లీ గెలిచినప్పటికీ పార్టీకి ఘోర ఓటమిని తప్పించలేకపోయారు. ఉత్తర లండన్ నుంచి అతి తక్కువ మెజారిటీతో గెలిచినప్పటికీ లేబర్ పార్టీ నాయకుడు స్టార్మర్ ప్రధాని పగ్గాలు చేపట్టారు.        

లండన్, జూలై 5: బ్రిటన్‌లో 14 ఏండ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు తెరపడింది.  శుక్రవారం వెల్లడైన పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో కెయిర్ స్టార్మన్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ప్రభంజనమే సృష్టించింది. 650 ఎంపీ సీట్లున్న పార్లమెంటులో లేబర్ పార్టీ ఏకంగా 412 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో 26 మంది భారతీయ మూలాలున్న బ్రిటిష్ పౌరులు కూడా గెలుపొందారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే ప్రధాని పదవికి రిషి సునాక్ రాజీనామా చేశారు. ఆ వెంటనే కెయిర్ స్టార్మర్‌ను బ్రిటన్ రాజు మూడో చార్లెస్ దేశ ప్రధానిగా నియమించారు. 

దుమ్ములో కలిసిపోయిన కన్జర్వేటివ్స్

లేబర్ పార్టీ ప్రభంజనంలో టోరీలు కొట్టుకుపోయారు. బ్రిటన్‌లో గత 14 ఏండ్లుగా కన్జర్వేటివ్ (టోరీలు) పార్టీ అధికారంలో ఉన్నది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ 121 సీట్లకే పరిమితమైంది. లేబర్ పార్టీ 412 సీట్లు గెలుచుకొన్నది. ఇతర పార్టీలు 115 స్థానాల్లో గెలుపొందాయి. బ్రిటన్ పార్లమెంటులో మొత్తం సీట్లు 650 ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే 326 మంది ఎంపీల మద్దతు కావాలి.  

మార్పు మొదలైంది: స్టార్మర్

దేశంలో అన్నిరంగాల్లో సమూల మార్పులకు సమయం ఆసన్నమైందని బ్రిటన్ కాబోయే ప్రధాని, లేబర్ పార్టీ నాయకుడు కెయిర్ స్టార్మర్ అన్నారు. పార్టీ గెలుపు అనంతరం లండన్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మార్పు మొదలైందని ప్రకటించారు. ప్రజలు ఇచ్చిన భారీ విజయంతో తమ బాధ్యత మరింత పెరిగిందని అన్నారు.

అనంతరం బ్రిటన్ రాజు మూడో చార్లెస్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించారు.  ఆ వెంటనే ఆయనను ప్రధానిగా రాజు నియమించారు. అనంతరం ప్రధాని హోదాలో తొలిసారి కెయిర్ మాట్లాడారు. ‘మీరు మాకు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. ఈ గెలుపును మార్పుకోసం వినియోగిస్తాం. అన్ని సేవలను పునరుద్ధరిస్తాం. రాజకీయాలను గౌరవప్రదంగా మారుస్తాం. అస్తవ్యస్త విధానాలకు ముగింపు పలుకుతాం. మీ జీవితాల్లో మరింత వెలుగును నింపుతాం. దేశాన్ని ఐక్యం చేస్తాం’ అని హామీ ఇచ్చారు. 

రిషి సునాక్ రాజీనామా

ఎన్నికల ఫలితాల సరళి మొదలవగానే ప్రధానమంత్రి రిషి సునాక్ ఓటమిని ఒప్పుకొంటూ ప్రకటన చేశారు. సతీమణితో ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలుపొందింది. ఎన్నికల్లో విజయం సాధించినందుకు స్టార్మర్‌కు శుభాకాంక్షలు’ అని తెలిపారు. రాజు చార్లెస్‌ను కలిసి ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

కెయిర్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

బ్రిటన్ కొత్త ప్రధాని కెయిర్ స్టార్మర్‌కు భారత ప్రధాని మోదీ శుభా కాంక్షలు తెలిపారు. బ్రిటన్ కొత్త నాయకుడితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. మాజీ ప్రధాని రిషి సునాక్ సేవలను కూడా కొనియాడారు.