ఐకేపీ నిర్వాహకుల నిర్వాకం
- నమ్మించి రైతులను నట్టేటా ముంచుతున్న వైనం
- అన్నదాతకు క్వింటాల్‌కు రూ.250 వరకూ నష్టం
- 2౦ రోజుల్లో 15 వేల టన్నులకు పైగా కొనుగోలు
- అధికారులు, నాయకుల అండదండలతోనే దందా?
మంచిర్యాల, జనవరి 4 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని ధాన్యం పండించిన రైతులు నానా అవస్థలు పడుతూ అడ్డికి పావు షేరు లెక్కన అమ్ముకుంటున్నారు. గోదావరి తీరాన్ని ఆనుకొని ఉన్న జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, జైపూర్, భీమారం, చెన్నూర్, హాజీపూర్ మండలాల్లో రైతులు అధిక మొత్తంలో వరి పండిస్తుంటారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సన్న రకాలకు బోనస్ ప్రకటించడంతో పెద్ద మొత్తంలో రైతులు సన్న వరి సాగు చేశారు. సన్న ధాన్యంపై కన్నేసిన దళారులు ధరలు తగ్గించేందుకు కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో రైతులు చేసేదేమీ లేక కొనుగోలు కేంద్రాల వైపు దృష్టి సారించారు. అలాగైనా మద్దతు ధర వస్తుందనుకుంటే.. రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిల పడ్డట్టయ్యింది.
కేంద్రాల నిర్వాహకులే దళారుల వేషం వేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలోని జైపూర్, జన్నా రం, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో కొందరు వ్యాపారులు (కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, వారి బంధువులు) రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు వడ్లు కొని ఆ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం పేరిట మిల్లులకు పంపిస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు.
రైతుల వద్ద సన్న రకం ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.2,550 చెల్లించి ప్రభుత్వ మద్దతు ధర దళారీ మింగేస్తున్నాడు. ఇలా క్వింటాల్‌కు రూ.200 నుంచి రూ.250 వరకు దండుకుంటున్నారు. జిల్లాలో ఇలా దళారుల పేరిట కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నవంబర్ 20 నుంచి సన్న రకాలు కొనడం ప్రారంభించారు.
ఇందులో కొందరు సక్రమంగా చేసినా.. చాలామొత్తంలో తక్కువ ధరకు కొని బినామీల పేరిట ప్రభుత్వానికి అమ్మినట్టు తెలిసింది. డిసెంబర్ 20 వరకు 5 వేల మెట్రిక్ టన్నుల సన్నాలు కొన్న కేంద్రాల నిర్వాహకులు ఈ నెల 4 వరకు 30 వేల మెట్రిక్ టన్నుల సన్న రకాలు సేకరించినట్టు అధికారులు చెప్తున్నారు.
రైతులు తక్కువ.. బినామీలు ఎక్కువ
20 రోజుల్లోనే 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించగా, ఇందులో సుమారు 15 వేల మెట్రిక్ టన్నులపైగానే సన్న రకం ధాన్యం తక్కువ ధరకు రైతుల వద్ద కొని దళారులు బినామీల పేరిట ప్రభుత్వానికి అమ్మినట్టు విశ్వసనీయ సమాచారం. జిల్లాలోని కొన్ని మండలాల్లో ‘విజయక్రాంతి’ కొనుగోళ్లపై ఆరాతీయగా ఈ తతంగం బయటకు వచ్చింది.
దండేపల్లి మండలంలోని పెద్దపేట, నెల్కి వెంకటాపూర్, వెల్గనూర్, కొత్త మామిడిపల్లి, నంబాల, లక్షెట్టిపేట మండలంలోని మోదెల, ఇటిక్యాల, దొనబండ, లక్ష్మీపూర్, చెన్నూర్ మండలంలోని పొన్నారం, ఆస్నాద్, దుగ్నెపల్లి, సోమన్‌పల్లి, నాగాపూర్, జైపూర్ మండలంలోని శెట్‌పల్లి, నర్సింగాపూర్, బెజ్జాల, కుందారం, భీమారం మండలంలోని దాంపూర్, సుంకర్‌పల్లి, పోలంపల్లి, కోటపల్లి మండలంలోని సర్వాయిపేట, కోటపల్లి, శంకరాపురం, వేమనపల్లి మండలంలోని బద్ధంపల్లి, వేమనపల్లి గ్రామాల్లో పెద్ద మొత్తంలో రైతుల నుంచి దళారీ అవతారం ఎత్తిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తక్కువ ధరకు కొనుగోలు చేసి వారి బంధువుల పేరిట ట్రక్ షీట్లు రాసి పంపించినట్టు తెలిసింది.
కొన్ని చోట్ల రైతు వద్ద క్వింటాల్‌కు రూ.2,650కు కొని ధాన్యంకు సరిపడా డబ్బులు రైతు అకౌంట్లలో, మిగితావి వారి అనుచరుల అకౌంట్లలోకి జమ చేసినట్టు తెలిసింది. ఏదీ ఏమైనా దీనిపై సంబంధిత శాఖ అధికారులు విచారణ చేపడితే అసలు కథ బయటపడనుంది.
రైతుల ఫిర్యాదుతో లారీని పట్టుకున్న అధికారులు
ఈ తతంగంపై రైతులు జిల్లా కేంద్రంలోని ఓ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయడం తో సంబంధిత శాఖ అధికారులు కాళ్లకు పని పెట్టారు. లారీ ఎక్కడ తూకం వేశారో, ఎప్పు డు బయలుదేరుతుంది, లారీ నెంబర్‌తో పాటు పూర్తి వివరాలివ్వగా అధికారులు (డీటీలు) దండేపల్లి మండలం గూడెం చెక్ పోస్టు వద్ద ఆ లారీని పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
రైతులు ఫిర్యాదు చేసేంత వరకు అధికారులకు తెలియదా? కొనుగోలు కేంద్రాలు తిరుగుతున్నట్టు ఫొటోలు దిగడమేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ప్రైవేటు వ్యాపారం చేస్తే రైతులు బయట అమ్ముకుంటున్నారు.
అయినా, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, దళారులు ఒక్కటై తిరిగి రైతులకే నష్టం చేస్తున్నారనడానికి దండేపల్లిలో దొరికిన లారే ఒక నిదర్శనం. దళారీ తూకం వేసి పంపించిన లారీలో సివిల్ సప్లయ్ అధికారులు కొనుగోలు కేంద్రాలకు పంపించిన కొత్త 40 కిలోల గన్నీ సంచులు వెళుతున్నాయంటే ఏ మేరకు కుమ్మక్కై తరలిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
పట్టుబడిన లారీలో 570 బస్తాలు అంటే సుమారు 230 క్వింటాళ్ల ధాన్యంను దళారులు తరలిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి గతంలో రైతులు ఎవరికి అమ్మారు? ఎంతకు అమ్మారు? అనే విషయాలపై విచారణ జరిపితే బండారం బయటపడే అవకాశం ఉంది.
అధికారుల, నాయకుల అండదండలతోనేనా..?
గతంలో జిల్లాలో డీఆర్డీయే ఐకేపీ కేంద్రాలతోపాటు పీఏసీఎస్, డీసీఎంఎస్ కేంద్రాలుండేవి. ప్రస్తుతం వాటిని మంచిర్యాల నియోజక వర్గంలో పక్కకు పెట్టి డీఆర్‌ర్డీయే ద్వారా మాత్రమే కొనుగోళ్లు ప్రారంభించారు. ఇదే అదనుగా అసలు దందాకు తెరలేపారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపు మహిళల భర్తలు, రాజకీయ నాయకులు దళారులుగా మారి దండుకోవడం మొదలు పెట్టారు.
కొందరేమే మిల్లర్లతో కుమ్మక్కై దందా నడుపుతుండగా, మరికొందరు నేరుగా ప్రభుత్వం అందించిన బారదాన్‌తోనే ధాన్యం కాం టా చేసి మిల్లులకు తరలించడం గమనార్హం. అధికారులు, నాయకుల అండ దండలతోనే ఈ తతంగం జరుగుతుంటే ఎవరికి చెప్పువకోవాలో తెలియక రైతులు మిన్నకుండి పోతున్నారు.
కొంత మంది రైతులు నష్టానికీ అమ్ముకుంటుండగా ఇప్పటికీ దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో సన్న రకం ధాన్యం రోడ్లపైనే మగ్గుతుంది. ధర పెరుగుతుందని, కనీసం మద్దతు ధర వస్తుందేమోననే ఆశతో ఉన్నారు.
క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
జిల్లాలోని 18 మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాలలో నిర్వాహకులు కానీ, వారి బంధువులు కానీ రైతుల వద్ద తక్కువ ధరకు ధాన్యం కొన్నట్టు ఫిర్యాదు వస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఎలాంటి తప్పులను సహించేది లేదు.
ఇటీవల కొత్తమామిడిపల్లి సెంటర్ నుంచి 40 కిలోల గన్నీ బ్యాగులు దళారీకి ఎలా వెళ్లాయో డీటీలతో విచారణ జరిపిం చాం. వారిపై సైతం చర్యలు తీసుకుం టాం. రైతులకు నష్టం చేసేలా వ్యవహరించే దళారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపే క్షించేది లేదు. దళారులకు సహకరించిన వారిపై సైతం కేసులు నమోదు చేస్తాం. రైతులు దళారులను ఆశ్రయించవద్దు.
సబావత్ మోతీలాల్,
అదనపు కలెక్టర్, మంచిర్యాల