తిరుప్పావై సిరినోము-8
కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱువీడు,
మెయ్‌వాన్ పరన్దనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్,
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు, ఉన్నై
క్కూవువాన్ వందు నిన్ఱోమ్, కోదుకలముడైయ
పావాయ్! ఎన్దిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ,
దేవాది దేవనై శెన్ఱు నాం శేవిత్తాల్,
ఆ వా వెన్ఱారాయ్‌న్దరుళేలో రెమ్బావాయ్! (తమిళ)
గోదా గోవింద గీతం
తూరుపు దెలవారు గోధూళివేళ గోవులు కదిలినాయి
దూడలవెంట ఉదయకిరణాల మెరయు గడ్డిమేయ
నీతోడ కలిసిపోవ నీయింటి వాకిట నిలిచినాము
భక్తిమణిదీపమా మావెంట రావమ్మ హరిని జేర
పఱై పరముల గోరెడు నోము నోచుదామని చెప్పుదాము
కేశిరాకాసి నోరు జీల్చి చాణూరముష్ఠుల గూల్చి
లోకాలనాథుడే మాధవుడు మనమధ్య నిలిచె
కృష్ణ సంస్పర్శ స్నానాలు జేయ రావమ్మ కృష్ణవేణి (తెలుగు)
కీళ్= తూర్పు దిక్కున, వానమ్= ఆకాశం, వెళ్ళు= తెల్లబడ్డది, ఎన్ఱు= అని, ఎరుమై= గేదెలు, శిఱువీడు= చిన్నమేత, మేయ్వాన్= మేయుటకై, పరన్దనగాణ్= వ్యాపించినవి, మిక్కుళ్ళ= మిగిలిన, పిళ్ళైగళుం= పిల్లలునూ, పోవాన్= పోవుటయే ప్రయోజనంగా, పోగిన్ఱారై= పోవుచుండగ వారిని, ప్పోగామల్= అలా వెళ్ళకుండా, కాత్తు= అడ్డి, ఉన్నై= నిన్ను, కూవువాన్= పిలుచుటకై, వందు= వచ్చి (నీ ఇంటిముందర), నిన్ఱోం= నిలిచితిమి, కోదుకల ముడైయ= కృష్ణునికి కూడ కుతూహలం కలిగించు, పావాయ్!= యువతీ!, ఎన్దిరాయ్!= లెమ్ము!, పాడి= గానము చేయుచూ, పఱై=పఱై అనెడి వాయిద్యాన్ని, కొండు= అతడి నుంచి స్వీకరించి, మా= అశ్వాసురుని, వాయ్= నోటిని, పిళన్దానై= చీల్చిన వానిని, మల్లరై= చాణూరుడు, ముష్టికుడు అనే మల్లురను, మాట్టియ= మట్టి కరిపించిన, దేవాది దేవనై= దేవతలందరికి ఆరాధ్యుడైన శ్రీకృష్ణుని, శెన్ఱు= దగ్గరకు వెళ్ళి, నామ్= మనం, శేవిత్తాల్ = నమస్కరించినట్లైతే, ఆవావెన్ఱు= అయ్యో! శ్రమపడ్డారా! యని, ఆరాయ్‌న్దు= పలుకరిం చి, అరుళ్ =అనుగ్రహించును, ఏల్+ఓర్+ఎం+పావాయ్= ఇదే మా గొప్ప వ్రతం.
గుఱ్ఱం రూపంలో ఉన్న కేశి అనే రాక్షసుణ్ణి సంహరించిన వాడు. కృష్ణుడు ఆడుకుంటుంటే ఒక అసురుడు గుఱ్ఱంలా వచ్చి నోరు తెరిచాడు. తెరిచిన ఆ నోటిలో చేతులు పెట్టాడు కృష్ణుడు. చిన్న పిల్లాడు కదా ఆనందంతో ఉబ్బిపోయాడు. ఆయన తగ్గి పోగలడు, ఉబ్బిపోగలడు. తగ్గితే వామనుడయ్యాడు, ఉబ్బిపోతే త్రివిక్రముడయ్యాడు. కేవలం చేయిని ఉబ్బిస్తూపోయాడు. ఉబ్బిన చేయి శరీరంలో ఇమడక, ఆ పరిమాణాన్ని భరించలేక ఆ అశ్వరూపాసురుడి నోరు పనిచేయదు. స్వార్థంతో మింగడానికి తప్ప, అజ్ఞానంతో నోరు మూసుకుని ఉండి, మూర్ఖంగా తెరవడానికి ఇష్టపడని, స్వామిని నుతించని వారి నోళ్లను తెరిపిస్తాడు.
కేశవుడంటే క అనే పరబ్రహ్మ స్వరూపం, అ అంటే విష్ణు స్వరూపం, ఈశ అంటే రుద్ర రూపం. త్రిమూర్తుల సమ్మేళనం కేశవుడు. అయిదు ఇంద్రియాలు శరీరం అనే రథానికి కట్టిన గుఱ్ఱాలు మనలను అయిదువైపులా లాగుతుంటాయి. మనస్సు అనే కళ్లాన్ని బుద్ధి అనే సారథి చేతులో పెట్టగలిగితే రథం సక్రమంగా సాగుతుంది. లేకపోతే ముక్కలై పోతుందని ఉపనిషత్తులు హెచ్చరిస్తాయి. ఇంద్రియాలను చంపడు కాని అదుపులో పెట్టుకుని మారేట్టు చేయడం గురించి భగవంతుడు వివరిస్తాడు.
ఇంకా, కౌమారం దాటక ముందే, బలరామ కృష్ణులు భయంకరులైన మల్ల విశారదులు చాణూర ముష్టికులను ఎదుర్కొని ఓడించారు. చాణూరుడు క్రోధానికి, కోపానికి, పాపానికి ప్రతీక. కామం, కోపం పోవాలంటే గురువు అనుగ్రహం కావాలి. చాణూర ముష్టికులను అవలీలగా సంహరించిన వీరులు. మదజలం స్రవించే కువలయాపీడం అనే మత్తగజంతో పోరాడి, మావటిని చంపి దాని రెండు దంతాలు పెఱికి భుజాన మోస్తూ రామకృష్ణులిద్దరూ కంసుని సభలో ప్రవేశించి మల్లవీరులను మట్టి కరిపిస్తారు. మంచెలమీద ఉన్న రాజులు ఆశ్చర్య భయోపేతులవుతుంటే కంసుని సింహాసనం దగ్గరికి వెళ్లి, ఒక్క ఉదుటున కింద పడవేసి పిడిగుద్దులతో చంపేసిన కృష్ణుడు అప్పటికి ఇంకా యువకుడు కూడా కాదు.
నూనుగు మీసాల కౌమార దశస్కుడు. ముష్టికాసురుడు అంటే ఎంత తిన్నా ఇంకా కావాలనే వాడు కామములు తీరని వాడు. చాణూరుడు క్రోధానికి ప్రతీక. కామక్రోధాలను జయించాలి. అందుకు భగవంతుడు ఆచార్యుని ద్వారా అనుగ్రహించాలి. ఈ సందర్భంలో రామానుజుని అష్టాక్షర మంత్రం గురించి వివరించారు. “ఈతని కరుణనేకా యిల వైష్ణవులమైతి! మీతనివల్లనే కంటి మీతిరుమణి!” అని రామానుజుని వివరిస్తున్నారు.
-మాడభూషి శ్రీధర్