calender_icon.png 1 November, 2024 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ జెడ్పీ సమావేశం రసాభాస

03-07-2024 03:54:13 AM

  • డీఈవోను సస్పెండ్ చేయాలి: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి 
  • దళితబంధు టీషర్టుతో జడ్పీటీసీ 
  • మీటింగ్ మధ్యలోనే వెళ్లిపోయిన కలెక్టర్ 
  • హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, జూలై 2 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన నిర్వహించారు. సభ్యుల ఆందోళనలతో చివరి సమావేశం రసాభాసగా ముగిసింది. దళితబంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని కోరుతూ జమ్మికుంట జెడ్పీటీసీ శ్రీరాం శ్యామ్ దళితబంధు టీషర్టును ధరించి సమావేశానికి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. జెడ్పీటీసీని అడ్డుకోవడంపై బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.

జెడ్పీటీసీని లోనికి అనుమతించాలని పోలీసులను జెడ్పీ చైర్‌పర్సన్ విజయ కోరగా.. మరో షర్టు ధరించి వస్తేనే పంపిస్తామని టౌన్ ఏసీపీ నరేందర్ స్పష్టం చేయడంతో జెడ్పీ చైర్‌పర్సన్ తిరిగి వెళ్లిపోయారు. రెండవ విడత నిధుల మంజూరుపై స్టెటస్‌కో మెయింటెన్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశంతో ఆపినట్లు కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. హుజూరాబాద్ మండల విద్యా సంస్థలపై తాను నిర్వహించిన సమీక్షకు హాజరైన విద్యాధికారులకు మెమోలు జారీ చేసిన డీఈవో జనార్ధన్‌రావు సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు.

కౌశిక్‌రెడ్డితోపాటు సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించి సమావేశం ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ను అడ్డుకుని నిరసన వ్యక్తం చేయడంతో కలెక్టర్ సమావేశం మధ్య నుంచే వెళ్లిపోయారు. కౌశిక్‌రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ చిగురుమామిడి జడ్పీటీసీ రవీందర్ చేసిన వ్యాఖ్యలతో గందరగోళ పరిస్థితి నెలకొంది. 

ఎమ్మెల్యే వర్సెస్ కాంగ్రెస్ జడ్పీటీసీలు

బీఆర్‌ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన జడ్పీటీసీలకు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది జెడ్పీ సమావేశమని చైర్‌పర్సన్ ఆదేశిస్తేనే మాట్లాడాలని జెడ్పీటీసీలు కౌశిక్‌రెడ్డికి సూచించారు. మీరు అమ్ముడు పోయారని కౌశిక్ ఆరోపించడంతో తీవ్ర వాగ్వా దం చోటు చేసుకుంది. చిగురుమామిడి జడ్పీటీసీ రవీందర్, కౌశిక్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గొడవ సద్దుమణిగిన అనంతరం లంచ్ బ్రేక్ కొనసాగగా, రెండవ విడత సమావేశానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై జడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు సభ్యులను, ఉద్యోగులను సన్మానించారు. 

పార్టీలకతీతంగా సమస్యల పరిష్కారం: పొన్నం

పార్టీలకతీతంగా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా మని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నా రు. గత ఐదు సంవత్సరాల్లో నిధులు ఉన్నా లేకున్నా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజా సమస్యలు పరిష్కరించి ఎంపీపీలు, జెడ్పీటీసీలు పేరు సంపాదించారని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా సహృద్భావ వాతావర ణంలో కలిసి పనిచేశారన్నారు. పదవీ బాధ్యతలు పూర్తి చేసుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో స్థానిక సంస్థలకు మరింత ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. జెడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ.. ఐదేళ్ల పదవీకాంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశామని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.