calender_icon.png 7 October, 2024 | 12:55 PM

కంగారూల విజయగర్జన

06-10-2024 12:00:00 AM

  1. శ్రీలంకపై ఆస్ట్రేలియా విజయం 
  2. రాణించిన స్కట్, బెత్ మూనీ 
  3. లంక సెమీస్ ఆశలు క్లిష్టం

షార్జా: మహిళల టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టోర్నీని ఘనంగా ఆరంభించింది. గ్రూప్-ఏలో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఆరు వికెట్ల తేడాతో సునాయస విజయాన్ని నమోదు చేసుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 93 పరుగులకే పరిమితమైంది. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై కంగారూ బౌలర్ల ముందు లంక బ్యాటర్లు తేలిపోయారు. నిలక్షిక సిల్వా (29 నాటౌట్), హర్షిత సమరవిక్రమ (23) పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మేఘన్ స్కట్ 3 వికెట్లతో రాణించగా.. సోఫీ 2 వికెట్లు పడగొట్టింది.

అనంతరం ఆస్ట్రేలియా 14.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ బెత్ మూనీ (43 నాటౌట్) చివరి వరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. లంక బౌలర్లలో ప్రబోధిని, ఇనోకా, సుగంధిక తలా ఒక వికెట్ తీశారు. మేఘన్ స్కట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. 

తొలుత తడబడినా.. 

లక్ష్యం చిన్నదే కావడంతో ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ విజయం సాధిస్తుందనుకున్నప్పటికీ మొదట్లో లంక బౌలర్లు చెలరేగారు. దీంతో ఆస్ట్రేలియా 35 లోపే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో వన్ సైడ్ అనుకున్న మ్యాచ్ కాస్త ఆసక్తికరంగా మారింది. కానీ బెత్ మూనీతో పాటు గార్డ్‌నర్ (12), లిచ్‌ఫిల్డ్ (9*) నిలబడడంతో మ్యాచ్‌ను కంగారూలు కైవసం చేసుకున్నారు.

ఈ ఓటమితో టోర్నీలో రెండింటికి రెండు మ్యాచులు ఓడిన శ్రీలంక నాకౌట్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. ఇక ప్రపంచకప్‌లో భాగంగా నేడు రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్, స్కాట్లాండ్ తలపడనున్నాయి. గ్రూప్ ఉన్న రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెస్టిండీస్, స్కాట్లాండ్‌లకు మ్యాచ్ విజయం కీలకం కానుంది.

సంక్షిప్త స్కోర్లు

శ్రీలంక:  20 ఓవర్లలో 93/7 (నిలక్షిక 29 నాటౌట్,  హర్షిత 23; మేఘన్ 

స్కట్ 3/12),

ఆస్ట్రేలియా: 14.2 ఓవర్లలో 94/4 (బెత్ మూనీ 43 నాటౌట్, పెర్రీ 17; ప్రబోధిని 1/19).